కాంగ్రెస్‌లో లుకలుకలు... ఆరని అసంతృప్తి జ్వాలలు

కాంగ్రెస్‌లో లుకలుకలు... ఆరని అసంతృప్తి జ్వాలలు
x
Highlights

సర్దుకోరు. సరిదిద్దుకోరు. అసంతృప్తి జ్వాలలు ఆరనివ్వరు. అందుకే ప్రత్యర్థులు, వీరికి గులాబీలతో గాలమేసేందుకు సిద్దమయ్యారు. తిరుగుబాటుకు రెడీగా ఉన్నవారిపై...

సర్దుకోరు. సరిదిద్దుకోరు. అసంతృప్తి జ్వాలలు ఆరనివ్వరు. అందుకే ప్రత్యర్థులు, వీరికి గులాబీలతో గాలమేసేందుకు సిద్దమయ్యారు. తిరుగుబాటుకు రెడీగా ఉన్నవారిపై కన్నేసి, రారమ్మంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌లో లుకలుకలు-గులాబీలు గాలం ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు మంచి క్యాడర్ ఉంది. క్యాడర్‌తో పాటు అంతటి స్థాయి నాయకులు కూడా ఈ జిల్లాలో ఉన్నారు. దీంతో టికెట్ల కేటాయింపు నుంచి పార్టీ పదవుల అప్పగింతల వరకు, ప్రతి దాంట్లో ఇక్కడి నేతలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కాంగ్రెస్‌లో ఉంటూ, జాతీయ స్దాయి రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతలు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. అయితే ఇప్పుడు సీనియర్ నాయకుల తరం నుంచి కొత్తతరం వెలుగులోకి వస్తోంది. ఈ సమయంలోను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్‌, పరిస్దితి ఏమీ మారలేదు. అవే గ్రూప్‌లు, అవే వర్గాలు. ఎన్నికల సమయంలోనైనా అంతా ఏకం అవుతారేమో అనుకున్న క్యాడర్‌కు నాయకులు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి సాధ్యమైనంతగా నాయకులను కారు ఎక్కించుకునేందుకు గులాబీ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.

కరీంనగర్ జిల్లా కేంద్రంలో గతంలో, రెండుసార్లు పోటి చేసిన చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, ఇప్పుడు గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా కాంగ్రెస్‌కి దూరంగా ఉంటున్నప్పటికీ, తనకంటూ ఓ క్యాడర్‌ను ఏర్పాటు చేసుకున్న చల్మెడ, ఇప్పుడు టిఆర్ఎస్‌లోకి వెళితే కరీంనగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు బలం చేకూరడమే కాకుండా..ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్‌ పరిస్దితి నియోజకవర్గంలో మరింతగా డీలా పడుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకవేళ, ఇదే జరిగితే కరీంనగర్‌లో మళ్లీ ఉత్సాహం తెచ్చేందుకు పొన్నం ప్రభాకర్‌ను బరిలోకి దింపాలన్న ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. మరోవైపు కొత్త జైపాల్‌ రెడ్డి కూడా కరీంనగర్‌లో పోటి చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది.

కరీంనగర్ పరిస్దితి ఇలా ఉంటే, ఇక చొప్పదండి తీరే వేరు. ఇక్కడ టికెట్ ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం..అభ్యర్దులను పార్టీ ఫైనల్ చేయకపోవడంతో ఎవరి ప్రచారం వారు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చొప్పదండి నియోజవర్గంలో బండ శంకర్,సుద్దాలదేవయ్య.,మేడిపల్లి సత్యం.,గజ్జెల కాంతం..ఈ నలుగురు తలోదారిలో ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ వర్గాలుగా చీలిపోవడంతో, పార్టీ పరిస్దితి నాలుగముక్కులుగా మారిపోయింది. మరోవైపు మాజీ మంత్రి సుద్దాల దేవయ్య కూడా ఇఫ్పుడు టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇక వేములవాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్దితి. వేములవాడలో కాంగ్రెస్‌ నుంచి ఏనుగు మనోహార్ రెడ్డి, ఆది శ్రీనివాస్ ఇద్దరూ, టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. ప్రచారం కూడా అలానే చేసుకుంటున్నారు. దీంతో పార్టీ అక్కడ కూడా రెండుగా చీలిపోయింది. మొదటి నుంచి పార్టీలో ఉన్నందుకు టికెట్ తనకే ఇవ్వాలని మనోహర్ రెడ్డి అంటుంటే, గతంలో పోటి చేసాను కాబట్టి, తనకే ఇవ్వాలంవటున్నారు ఆది శ్రీనివాస్.

ఇక కోరుట్లలో అయితే టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా, అయినా సరే పోటీ చేసేందుకు సిద్దమయ్యారు అక్కడి కాంగ్రెస్ ఆశావాహులు. ఇప్పటికే ఆ దారిలో ప్రచారం కూడా ప్రారంభించారు. జీవన్‌ రెడ్డి స్థానమైన జగిత్యాల, శ్రీధర్‌ బాబు ఆశిస్తున్న మంథని నియోజవర్గాలు మినహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ రెండు మూడు గ్రూపులుగా విడిపోయింది కాంగ్రెస్. ఎన్నికలకు మహా అంటే రెండు నెలల సమయం కూడా లేదు, ఇలాంటి టైంలో కాంగ్రెస్‌లో ఇలాంటి లుకలుకలు ఎక్కడికి దారితీస్తాయోనని కార్యకర్తలు మథనపడుతున్నారు. ఇక ఈ పంచాయితీలు అన్నీ, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు మృత్యుంజయం చుట్టూ తిరుగుతున్నాయి. కార్యకర్తలకు సమాధానం చెప్పలేక..ఇటు నాయకులను ఒకతాటిపైకి తేలేక, నానా పాట్లు పడుతున్నారు. ఆయన కూడా కరీంనగర్, లేదా సిరిసిల్ల నుంచి టికెట్ ఆశిస్తుండటంతో ఇప్పుడు పార్టీ పరిస్దితి కాస్త, గాల్లో దీపంలా మారిపోయింది. టికెట్ ఎవరికి వస్తుందో తెలియక పోయినా.,ఎవరి విశ్వాసంతో వారు ఉన్నారు..దీంతో కార్యకర్తలు కూడా తమ నాయకుడి వెంట నడుస్తన్నారు..అయితే పార్టీలోని అసంత్రుప్తులను ఆకర్షించేందుకు టీఆర్ఎస్‌ సిద్దమవడంతో, జిల్లా సీనియర్ నాయకులు జీవన్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు, పొన్నంలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories