జైలవకుశ రివ్యూ

జైలవకుశ రివ్యూ
x
Highlights

చిత్రం: జైలవకుశ నిర్మాణ సంస్థ: నందమూరి తారకరామారావు ఆర్ట్స్ నటీనటులు: ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్, సాయికుమార్, పోసాని, రోనిత్ రాయ్,...

చిత్రం: జైలవకుశ

నిర్మాణ సంస్థ: నందమూరి తారకరామారావు ఆర్ట్స్
నటీనటులు: ఎన్టీఆర్, రాశిఖన్నా, నివేదా థామస్, సాయికుమార్, పోసాని, రోనిత్ రాయ్, నందితారాజ్, హంసానందిని, అభిమన్యు సింగ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: దేవిశ్రీప్రసాద్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
కథ, మాటలు, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ)
విడుదల తేదీ: 21.09.2017

సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడం సర్వసాధారణం. దాదాపు అందరు హీరోలూ ద్విపాత్రాభినయం చేసినవారే. ముఖ్యంగా కొందరు తెలుగు సినిమా హీరోలు మూడు, ఐదు, తొమ్మిది...ఇలా ఒకటి కంటే ఎక్కువ పాత్రలు చేశారు. ఈ మధ్యకాలంలో కమల్‌హాసన్ దశావతారం చిత్రంలో పది పాత్రలు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు రెండు పాత్రలు మించి ఎవరూ చెయ్యలేదు. తాజాగా ఎన్టీఆర్ ఆ సాహసం చేశారు. కె.ఎస్.బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మించిన జై లవ కుశ చిత్రంలో మూడు పాత్రలు కనపడ్డారు. దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ గురువారం విడుదైలెన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? మూడు పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతవరకు మెప్పించగలిగాడు? మూడు క్యారెక్టర్లను డైరెక్టర్ బాబీ పర్‌ఫెక్ట్‌గా హ్యాండిల్ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

జై, లవ, కుశ అనే ముగ్గురు అన్నదమ్ముల కథ ఇది. ఈ ముగ్గురూ చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ వుంటారు. ముగ్గురిలో పెద్దవాడైన జైకి నత్తి వుంటుంది. డైలాగ్స్ చెప్పడంలో ఇబ్బంది ఎదురవుతుంది. దాంతో అతనికి సరైన క్యారెక్టర్స్ లభించవు. తమ్ముళ్ళు మాత్రం తమ నటనతో అందరి ప్రశంసలు అందుకుంటూ వుంటారు. వారి బంధువులు కూడా సహజంగానే జైని తక్కువ చేసి చూస్తారు. అలా చిన్నతనంలోనే తమ్ముళ్ళపై కోపం పెంచుకున్న జై ఓ నాటకం వేస్తున్నప్పుడు అతను గ్యాస్ లీక్ చేయడంతో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. వాళ్ళు పెరిగి పెద్దవారవుతారు. లవకుమార్ ఓ బ్యాంక్‌కి మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. కుశ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు.

తన అమాయకత్వం వల్ల, మంచితనం వల్ల కొందరి చేతుల్లో మోసపోతాడు లవకుమార్. దానివల్ల బ్యాంకుకి కొన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది. అంతేకాకుండా అతను ఎంతో ఇష్టపడే ప్రియ(రాశిఖన్నా) అతన్ని కాదంటుంది. ఆ బాధతో కారు నడుపుతూ ఎదురుగా వస్తున్న కుశ కారుని ఢీ కొడతాడు. ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. లవ తన సమస్యను కుశతో చెప్తాడు. లవ స్థానంలో వెళ్ళి బ్యాంకులో సమస్యని పరిష్కరించి వస్తానంటాడు కుశ. తన దగ్గర వున్న 5 కోట్ల పాత కరెన్సీని మార్చుకోవడానికి కుశ బ్యాంక్‌కి వెళ్ళాడని లవకు తెలీదు. ఆ తర్వాత పాత కరెన్సీ మార్పిడి కేసులో పోలీసులు లవని అరెస్ట్ చేస్తారు. ఇదిలా వుంటే లవ ప్రేయసిని కిడ్నాప్ చేయడమే కాకుండా కుశ 5 కోట్ల రూపాయలను కూడా మాయం చేస్తాడు జై.

చిన్నప్పుడే తమ్ముళ్లతో విడిపోయిన జై ఓ పెద్ద లీడర్‌గా ఎదుగుతాడు. అతని క్రూరత్వానికి అందరూ భయపడతారు. అతన్ని రావణ్ అని పిలుస్తుంటారు. ఎంత మందిని తొక్కయినా రాజకీయంగా ఎదగాలన్నది జై ప్లాన్. అలాంటి జై.. లవ కుశలను ఎందుకు తన దగ్గరకు రప్పించుకున్నాడు? లవ ప్రేయసిని ఎందుకు కిడ్నాప్ చేశాడు? కోట్లకు అధిపతి అయిన జై... కుశ డబ్బును ఎందుకు కాజేశాడు? జై తముళ్ళపై వున్న ద్వేషాన్ని తగ్గించుకున్నాడా? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలాంటి పాత్రనైనా అవలీలగా చెయ్యగల ప్రతిభ ఎన్టీఆర్‌లో వుందని అందరికీ తెలుసు. జై లవకుశ చిత్రానికి వస్తే ఒకేసారి మూడు విభిన్న పాత్రలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అమాయకుడిగా, చలాకీగా, పగతో రగిలిపోయేవాడిగా, ప్రేమికుడిగా... ఇలా అన్ని భావోద్వేగాలు వున్న మూడు పాత్రలను ఎన్టీఆర్ అద్భుతంగా పోషించాడు. అంతేకాదు డాన్సులు, ఫైట్స్‌లో ఎన్టీఆర్ పడిన కష్టం కనిపిస్తుంది. కథ మొత్తం జై లవ కుశ మధ్య జరుగుతుంటుంది కాబట్టి మిగతా పాత్రలకి, ఆ పాత్రలు పోషించిన నటీ నటులకు అంత ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించదు.

సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాల్సి వస్తే సినిమాకి ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ నూటికి నూరుపాళ్లు న్యాయం చేసింది. సినిమాని కలర్‌ఫుల్‌గా చూపించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఈసారి ఎన్టీఆర్‌కి సూపర్‌హిట్ సాంగ్స్ ఇవ్వడంలో దేవి సక్సెస్ కాలేదని చెప్పకతప్పదు. కేవలం రావణా.. అనే పాట ఒక్కటే సినిమాలో బాగుంది అనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా జై ఎంటర్ అయిన తర్వాతే బాగుంది. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటింగ్ ఫర్వాలేదు. సినిమా నిడివి 2 గంటల 40 నిముషాలు. సినిమా నిడివి తగ్గించే ప్రయత్నం చేస్తే బాగుండేది. మూడు పాత్రలతో మంచి కథనే రాసుకున్నాడు బాబీ. దానికి కోన వెంకట్, చక్రవర్తిల స్క్రీన్‌ప్లే సహకారం కూడా తీసుకున్నారు.

బాబీ జై పాత్రపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని సినిమా చూసినవారికి అర్థమవుతుంది. ఫస్ట్‌హాఫ్‌ని స్పీడ్‌గా నడిపించిన బాబీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కథను పక్కదారి పట్టించి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌కి తీసుకెళ్ళాడు. దీంతో అప్పటివరకు ఆసక్తికరంగా సాగుతున్న సినిమా ఒక్కసారిగా బోర్ కొట్టించే దిశగా వెళ్ళింది. జై దగ్గరకి చేరిన లవ, కుశ.. అన్నయ్యలో మార్పు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలు, జై తన తమ్ముళ్ళకు అప్పగించిన పనులు పూర్తి సినిమాటిక్‌గా వున్నాయి. చివరగా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఇది పూర్తిగా ఎన్టీఆర్ షో. సినిమా మొత్తంలో ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ గురించి తప్ప చెప్పుకోడానికి విశేషాలు లేవు. ఈ సినిమా అభిమానులకు మాత్రం బాగా నచ్చే అవకాశం వుంది.

చివరగా: జై లవ కుశ.. వన్ మ్యాన్ షో
రేటింగ్: 3/5

Show Full Article
Print Article
Next Story
More Stories