ఐపీఎల్ -12లో కోనసీమ కుర్రోడు

ఐపీఎల్ -12లో కోనసీమ కుర్రోడు
x
Highlights

ఐపీఎల్ వేలంలో కోనసీమ కుర్రోడు, ఆంధ్ర ఆల్ రౌండర్ బండారు అయ్యప్ప పంట పండింది. జైపూర్ లో నిర్వహిచిన 12వ సీజన్ వేలంలో.. ఢిల్లీ ఫ్రాంచైజీకి చెందిన ఢిల్లీ...


ఐపీఎల్ వేలంలో కోనసీమ కుర్రోడు, ఆంధ్ర ఆల్ రౌండర్ బండారు అయ్యప్ప పంట పండింది. జైపూర్ లో నిర్వహిచిన 12వ సీజన్ వేలంలో.. ఢిల్లీ ఫ్రాంచైజీకి చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అయ్యప్ప చోటు సంపాదించాడు. ప్రస్తుత సీజన్లో ఈఘనత సాధించిన రెండో ఆంధ్ర క్రికెటర్ గా నిలిచాడు. అయ్యప్పను చూసి అతని కుటుంబసభ్యులు మురిసిపోతున్నారు.

భారత వేదికగా గత 11 సీజన్లుగా జరుగుతున్న ఐపీఎల్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను మాత్రమే కాదు వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది క్రికెటర్లను ఊరిస్తూ ఉడికిస్తూ వస్తోంది. బ్యాటు బాలు పట్టిన ప్రతి యువకుడు ప్రతి క్రికెటరూ ఐపీఎల్ లో ఏదో ఒక జట్టులో సభ్యుడిగా ఆడాలని కలలు కనటం సాధారణ విషయమే. ఐపీఎల్ లో చోటు కోసం వందలాదిమంది స్వదేశీ, విదేశీ క్రికెటర్లు పోటీపడుతుంటే అతికొద్ది మందికి మాత్రమే కలనిజమాయెగా అనుకొనే పరిస్థితి ఉంది. అలాంటి అదృష్టవంతుల జాబితాలో కోనసీమ కుర్రోడు, ఆంధ్ర ఆల్ రౌండర్ బండారు అయ్యప్ప వచ్చి చేరాడు.

క్రికెటర్లు అంటే ఒకప్పుడు ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల నుంచి మాత్రమే వచ్చేవారు. అయితే భారత దేశవాళీ టీ-20 ఐపీఎల్ పుణ్యమా అంటూ మారుమూల గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లు సైతం వెలుగులోకి వస్తున్నారు. ఇదిగో ఇదే కోనసీమలోని రాజోలు పట్టణం. క్రికెట్ లాంటి ఆట కోసం ఏవిధమైన సౌకర్యాలు లేని ప్రాంతం ఇది. ఇక్కడి గల్లీలలో క్రికెట్ ఆడుతూ జాతీయస్థాయికి ఎదిగిన ఆటగాడే బండారు అయ్యప్ప. బాల్యంలో పేదిరకం ఓ వైపు క్రికెట్ ఆడుకోటానికి కావాల్సిన బ్యాటు, బంతి, ప్యాడ్లు లాంటి పరికరాల కొరత ఓవైపు అవరోధంగా మారినా కొబ్బరి చెట్టు మట్టనే బ్యాటుగా చేసి ప్రాక్టీస్ చేసిన అనుభవ అయ్యప్పకు ఉంది. మండలస్థాయి నుంచి రంజీట్రోఫీ స్థాయి వరకూ నిలకడగా రాణిస్తూ రావడం ద్వారా అయ్యప్ప ఎన్నో ట్రోఫీలు, అవార్డులు సాధించాడు.

ఈ క్రమంలోనే ఆంధ్ర రంజీజట్టులో చోటు సంపాదించాడు. అయ్యప్ప గత ఏడు సీజన్లుగా ఆంధ్ర రంజీ ప్రధాన బౌలర్లు, ఆటగాళ్లలో ఒకడిగా ఉంటూ వచ్చాడు. నిలకడగా రాణిస్తూ వివిధ ఫ్రాంచైజీల దృష్టిని సైతం ఆకర్షించాడు. జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ -12వ సీజన్ వేలంలో ఢిల్లీ ఫ్రాంచైజీ 20 లక్షల రూపాయల కనీస ధరకు అయ్యప్పను సొంతం చేసుకొంది. మరోవైపు తన కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని ఐపీఎల్ లో ఆడాలన్న తన కోరిక ప్రస్తుత సీజన్లో నెరవేరడాన్ని మించిన అదృష్టం లేదంటూ అయ్యప్ప పొంగిపోతున్నాడు. తన ప్రతిభపై నమ్మకం ఉంచి తమ జట్టులోకి తీసుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు.

అంతేకాదు తమ కుమారుడు ఐపీఎల్ జట్టులో చోటు దక్కించుకోడంతో...అయ్యప్ప తల్లి పెద్దింట్లు పట్టలేని ఆనందంతో మురిసిపోతోంది. గత ఏడేళ్లుగా తన కొడుకు క్రికెట్టే ఊపిరిగా సాధన చేస్తూ వచ్చాడని ఇంతకాలానికి గుర్తింపు వచ్చిందని చెప్పింది. రాజోలు లాంటి చిన్నపట్టణం నుంచి క్రికెటర్ గా ఎదిగిన తన భర్త ఐపీఎల్ జట్టుకు ఎంపిక కావడం తమ కుటుంబానికే గర్వకారణమని స్థాయికి తగ్గట్టుగా రాణించడం ద్వారా భారతజట్టులో సైతం చోటు సంపాదించాలని తాను కోరుకొంటున్నట్లు అయ్యప్ప భార్య రమ్య తెలిపింది. ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్లు కిర్గిసో రబాడా, ఇశాంత్ శర్మ, క్రిస్ మోరిస్ లాంటి ఆటగాళ్లతో కలసి సాధన చేయటమే కాదు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడే అవకాశం దక్కించుకొన్న రాజోలు ఎక్స్ ప్రెస్
అయ్యప్ప పూర్తిస్థాయిలో రాణించి తెలుుగు రాష్ట్రాలకే గర్వకారణంగా నిలవాలని కోరుకొందాం.


Show Full Article
Print Article
Next Story
More Stories