నీకో దండం బాబూ..

నీకో దండం బాబూ..
x
Highlights

ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నూతన ఒరవడికి శ్రీకారంచుట్టారు. ప్రజలతో నిత్యం ఇటు ఆన్‌లైన్‌లో అటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో...

ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నూతన ఒరవడికి శ్రీకారంచుట్టారు. ప్రజలతో నిత్యం ఇటు ఆన్‌లైన్‌లో అటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉండే మంత్రి కేటీఆర్ ఇటీవలే మన నగరం పేరుతో టౌన్‌హాల్ సమావేశం నిర్వహించి నూతన పద్ధతికి శ్రీకారంచుట్టారు. దీనికి కొనసాగింపుగా హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, దేశవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలతో ట్విట్టర్ వేదికగా అనుసంధానమయ్యారు. గురువారంనాడు ట్విట్టర్‌లో ప్రజలతో లైవ్‌చాట్ చేశారు. దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అయ్యే మంత్రి కేటీఆర్ హ్యాష్‌ట్యాగ్ టాప్‌లో నిలిచింది. దాదాపు రెండు గంటలకుపైగా రాజకీయ, వ్యక్తిగత, వృత్తిగత, పరిపాలనాపరమైన అభిప్రాయాలు, ప్రశ్నలు, సందేహాలు స్వీకరిస్తూ తగు రీతిలో, తనదైనశైలిలో చమత్కారంగా, సందర్భోచితంగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును టాస్క్‌మాస్టర్ అని అభివర్ణించారు. 2018లో కాళేశ్వరం పూర్తవుతుంది కదా ఇది తెలంగాణకు పండుగ సంవత్సరం కదా అని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు అవునని సమాధానమిచ్చారు. 2018 నిజంగా తెలంగాణకు పండుగ సంవత్సరమని చెప్పారు.

నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. రాజకీయాలు, వ్యక్తిగత ఆసక్తులు, ప్రభుత్వ పాలనతోపాటు వివిధ రంగాలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధికి నిరోధకమన్నారు. కేసీఆర్‌ కూడా ఒకప్పుడు కాంగ్రె్‌సలో పని చేశారన్న ఒక ప్రశ్నకు.. అందరూ తప్పులు చేస్తారని, తెలివైనవాళ్లు వాటి నుంచి నేర్చుకుంటారని సమాధానమిచ్చారు. సోనియానా, మోదీనా అన్న ప్రశ్నకు సమాధానంగా.. దేశంలో రెండు పార్టీల వ్యవస్థ మాత్రమే లేదన్న కేటీఆర్‌.. సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైరైన విషయాన్ని గుర్తుచేశారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావడం లేదన్న ప్రశ్నకు.. ప్రభుత్వం, ప్రజలు వేర్వేరు అనే భావన ఉందని, నిజానికి అవి రెండూ కలిస్తేనే ప్రజాస్వామ్యమన్నారు.

వచ్చే ఎన్నికల్లో విజయం మీదే అని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి ట్వీట్‌ చేశారు. దాంతో, ఎన్నికల గురించి చింత లేదని, దృష్టంతా పాలనపైనే అని సమాధానమిచ్చారు. టీఆర్‌ఎస్‌ని ఏపీలో విస్తరించే ఆలోచనలేవీ తనకు తెలియవన్నారు. ఏపీని దాయాది రాష్ట్రం (సిస్టర్‌ స్టేట్‌)గా అభివర్ణించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనల్లో ఏ పార్టీకి ఓటేస్తారని అడగగా.. తనకు అక్కడ ఓటు లేదన్నారు. కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గురించి చెప్పాలని కోరగా.. ‘ఆయన ఎవరు?’ అని ఎదురు ప్రశ్నించారు. హైకోర్టు విభజనకు అన్ని మార్గాల్లో ప్రయత్నించిన తర్వాతే పార్లమెంటులో తమ ఎంపీలు నిరసన తెలిపారని స్పష్టం చేశారు. ‘1+1=?’ ఎంత అన్న ఓ నెటిజన్‌ ట్వీట్‌కు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఒకటి ఒకటి రెండు ఎన్నటికీ కాదన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో చేరతారా? అన్న ప్రశ్నకు.. ఢిల్లీలో రెండు ప్రభుత్వాలున్నాయని, వాటిలో ఏదని చమత్కరించారు.

పలువురు నెటిజన్ల ట్వీట్లకు కేటీఆర్‌ నవ్వులు పూయించారు. కొత్త సంవత్సర వేడుకలకు డీజే అనుమతి ఇప్పించాలని ఒక నెటిజన్‌ కోరగా.. ‘నీకో దండం బాబూ’ అంటూ రీట్వీట్‌ చేశారు. ట్విటర్‌ ద్వారా ప్రజలతో మాట్లాడటం మంచి పరిణామమని, అయితే, నాకు ఎప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇస్తారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరగా.. ‘త్వరలోనే’ అని సమాధానమిచ్చారు. మణికొండ రోడ్లను బాగు చేయాలంటూ సినీ నటుడు వెన్నెల కిషోర్‌ ట్వీట్‌ చేయగా.. సానుకూలంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ దాదాపు పూర్తయిందని మంత్రి కేటీఆర్‌ వేరుగా ట్వీట్‌ చేశారు.

రాహుల్‌ద్రవిడ్, కోహ్లీ, రోహిత్ తన అభిమాన క్రికెటర్లు అని మంత్రి కేటీఆర్ తెలిపారు. షారుఖ్‌ఖాన్ తమ అభిమాన బాలీవుడ్ నటుడని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ఒబామా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడని పేర్కొన్నారు. ఇండియన్ చైనీస్ తనకు ఇష్టమైన అహారమని అన్నారు. అమెరికాలో ఉన్నప్పుడు వంటచేశానని చెప్పారు. అల్లు అర్జున్ గురించి చెప్పమంటే ఎనర్జీ, స్టైల్, స్వాగ్ అన్నారు. మహేశ్‌బాబు సూపర్‌స్టార్, ప్రభాస్ బాహుబలి, సచిన ఒక లెజెండ్, పవన్‌కల్యాణ్ ఒక ఎనిగ్మా (అంతుపట్టని) అని వివరించారు. ప్రజలే పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితాన్ని నిర్ణయిస్తారని పేర్కొన్నారు.

తాను దేవున్ని కాకుండా కర్మను నమ్ముతానని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫిట్‌గా ఉండటమే కొత్త సంవత్సర తీర్మానమని మంత్రి కేటీఆర్ నెటిజన్లకు స్పష్టంచేశారు. మెట్రో ప్రారంభం, జీఈఎస్ సమావేశం రెండూ ఒకేరోజు ఉండటమే ఈ ఏడాది గుర్తిండిపోయే రోజని వివరించారు. జీఈఎస్ సదస్సులో చర్చను నిర్వహించిన సందర్భంలో నెర్వస్‌గా ఫీల్ అయిన్నట్టు మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories