Top
logo

ఇండియా మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్ సయీద్

Highlights

ఉగ్రవాదులెందరో...అతను చంపిన అమాయకులెందరు...హఫీజ్‌ సయీద్‌ ఉగ్ర ప్రస్థానం ఒక్కసారి చూద్దామా... ఉగ్రవాద సంస్థల...

ఉగ్రవాదులెందరో...అతను చంపిన అమాయకులెందరు...హఫీజ్‌ సయీద్‌ ఉగ్ర ప్రస్థానం ఒక్కసారి చూద్దామా...
ఉగ్రవాద సంస్థల నాయకుడని ఎన్నో దేశాలు ప్రకటించాయి. ముంబై అటాక్స్ సూత్రధారి అని భారత్‌ ఎన్నో ఆధారాలూ సమర్పించింది. అవును నిజమేనంటూ లేట్‌గా బల్బ్ వెలిగినట్టు యాక్ట్ చేసిన పాకిస్తాన్, అతను టెర్రర్ ఆర్గనైజర్‌ అని ఫస్ట్‌ టైమ్‌ ఒప్పుకుంది. కానీ ఆధారాలూ మాత్రం లేవంటూ, చేతులెత్తేసి, అతని విడుదలకు సహకరించింది. అసలు హఫీజ్ సయీద్ ఎవరు....అతని పాపాలేంటి?
హఫీజ్ సయీద్. పాకిస్తాన్‌ ఇస్లామిస్ట్‌ ప్రబోధకుడు. జమాత్‌ ఉద్‌ దవా వ్యవస్థాపకుడు, ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా కో ఫౌండర్. పాకిస్తాన్‌ కేంద్రంగా ప్రపంచం మీదకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్నాడు.
పాకిస్తాన్‌లో అన్ని మత సంస్థలు, ఉగ్రవాద శిబిరాలపై ఆధిపత్యం చెలాయించే హఫీజ్‌‌పై ఐక్యరాజ్య సమితి కూడా ఆంక్షలు విధించింది. ముంబై దాడుల సూత్రధారిగా ముద్రవేసిన అమెరికా, 2012 ఏప్రిల్‌లో అతని తలపై 10 మిలియన్ల రివార్డు ప్రకటించింది.
ఇండియాకు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్ సయీద్. 2008, నవంబర్‌లో ముంబై దాడులకు సూత్రధారి సయీదేనని ఆధారాలతో సహా నిరూపించింది భారత్. అంతేకాదు, 2006 ముంబై ట్రైన్ పేలుళ్లు, 2001 పార్లమెంట్్ అటాక్స్‌తోనూ ఇతనికి సంబంధముందని ఆరోపించింది. ఎప్పుడెప్పుడు తమ చేతికి చిక్కుతాడా అని నేషనల్ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ వేటాడుతోంది.
మొన్ననే హఫీజ్‌ సయీద్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది అమెరికా. ఎన్నో ఏళ్ల నుంచి అతనిపై నిషేధం విధించింది. అలాగే బ్రిటన్, యూరోపియన్ యూనియన్, రష్యా, ఆస్ట్రేలియా కూడా అతనిపై బ్యాన్ పెట్టాయి. కానీ పాకిస్తాన్‌ అడుగులకు మడుగులొత్తుతున్న చైనా మాత్రం, హఫీజ్ చాలా మంచోడంటూ వెనకేసుకొస్తోంది.
జమాత్ ఉద్ దవాలో యువతకు ఉగ్ర బోధనలు చేసే హఫీజ్‌ సయీద్‌, వేలమందిని టెర్రరిస్టులుగా తర్ఫీదునిచ్చాడు. కాశ్మీర్ ఆజాదీ అంటూ అక్కడి యువత భావావేశాలను మండించి, నిత్య ఘర్షణ రగిలిస్తున్నాడు. అనేక ప్రోత్సాహకాల ఆశచూపి, టెర్రర్‌ క్యాంపుల్లోకి లాగుతున్నాడు. బలవంతంగా కూడా కొందర్ని రొంపిలోకి దింపుతున్నాడు. ఎదురుకాల్పుల్లో వారి మరణాలకు కారకుడవుతూ, కుటుంబాలకు తీరని విషాదం నింపుతున్నాడు.
హఫీజ్‌ సయీద్ అనే రక్తపిశాచాన్ని తయారు చేసింది ఎవరో కాదు, పాకిస్తాన్ ఆర్మీ. పాక్ సైన్యాధిపతిగా, దేశాధ్యక్షుడిగా పని చేసిన జనరల్ మహ్మద్ జియా ఉల్‌ హక్‌, సయీద్ అనే కలుపు మొక్కకు నారూనీరు పోశాడు. భారత్‌ వ్యతిరేక కుట్రలకు పావుగా తయారు చేశాడు.
తమదేశంలో ఉగ్రవాద శిబిరాలను నిర్వహిస్తూ, అమాయక యువతను టెర్రరిస్టులుగా మారుస్తున్నాడని మొదటిసారి పాకిస్తానే ఒప్పుకుంది. మొన్నటి వరకూ ఇతను కేవలం మత బోధకుడని, స్వచ్చంద సంస్థ నిర్వాహకుడన్న పాక్ ప్రభుత్వం, సడన్‌గా ప్లేటు మార్చేసరికి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కానీ ఇదంతా డొనాల్డ్ ట్రంప్‌ ఒత్తిడేేనని, ఇలా అనకపోతే అమెరికా నుంచి నిధులు రావన్న ఆలోచనతోనే, పాకిస్తాన్ దొంగనాటకమాడింది. అందుకే పంజాబ్‌ కోర్టులో ఆధారాలను కావాలనే తొక్కిపెట్టి, సయీద్ విడుదలకు మార్గం సుగమం చేసింది.
ముంబై దాడులకు సూత్రధారని ఇండియాతో పాటు ప్రపంచమంతా ఘోషిస్తున్నా పాకిస్తాన్‌లో మాత్రం చలనం లేదు. కోర్టుకు ఆధారాలు సమర్పించని పాకిస్తాన్, మరి భారత్ ఇచ్చిన డాక్యుమెంట్స్‌ను ఏం చేసిందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మన నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ‌్ జాదవ్‌ను పట్టుకుని, నరకయాతన పెడుతున్న పాకిస్తాన్‌, అతను భారత గూఢాచారి అంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. కానీ వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న సయీద్‌పై భారత్‌ సమర్పించిన ఆధారాలను మాత్రం లెక్క చేయడం లేదు. అంటే తమ దేశంలో ఉగ్రవాదం లేదంటూనే, మరోవైపు సయీద్‌లాంటివారిని వెనకేస్తూ, ఉగ్ర పన్నాగాలను ప్రోత్సహిస్తోంది.
సయీద్‌ను విడుదలపై భారత్‌ తీవ్ర స్వరంతో స్పందించింది. ఇది పాకిస్తాన్ రెండు నాల్కల ధోరణికి నిదర్శమని వ్యాఖ్యానించింది.
ముంబై దాడులకు ఈనెల 26తో తొమ్మిదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ అటాక్స్‌కు మాస్టర్ మైండయిన హఫీజ్ సయీద్ అప్పగింతకు పట్టుబడుతున్న ఇండియా, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. అమెరికా నుంచి పాక్‌కు నిధులను ఆపాలి. అన్ని రకాలుగా పాక్‌ను వెనకేసుకొస్తున్న చైనా మనసును కూడా మార్చాలి. ఎలాగైనా హఫీజ్ సయీద్‌ను అప్పగించేలా పొరుగుదేశానికి బుద్దిచెప్పాలి. భారత గడ్డపై మారణహోమం సృష్టించిన, ఉగ్ర సూత్రధారికి ఈగడ్డపైనే శిక్షపడేలా చేయాలి.

Next Story