ర్యాంకుల వెంట సర్కారు పరుగులు!

ర్యాంకుల వెంట సర్కారు పరుగులు!
x
Highlights

మన దేశంలో ఐఐటీలు, ఐఐఎంలే ఇప్పటి వరకు అతి పెద్ద స్థాయి విద్యా సంస్థలు. ఇంజనీరింగ్, ఎంబీయే లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివితే వీటిలోనే చదవాలన్న యాంబిషన్...

మన దేశంలో ఐఐటీలు, ఐఐఎంలే ఇప్పటి వరకు అతి పెద్ద స్థాయి విద్యా సంస్థలు. ఇంజనీరింగ్, ఎంబీయే లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివితే వీటిలోనే చదవాలన్న యాంబిషన్ చాలామందిలో కనిపిస్తుంది. అయితే వీటిని తలదన్నేలా సరికొత్తగా ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినపుడు అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. పేరుకు ఐఐటీలు, ఐఐఎంలు ఉన్నా, అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలు వెలువడినపుడు వాటిలో మన సంస్థలకు ఎక్కడా స్థానం లభించకపోవడంతో వీటి నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోందన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య కాలంలో అయితే టాప్ ఐఐటీలలో కూడా.. 60-70 శాతం మందికి మాత్రమే క్యాంపస్ ప్లేస్‌మెంట్లు వస్తున్నాయన్న కథనాలు వెలువడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీటిని తలదన్నే అత్యుత్తమ విద్యావ్యవస్థగా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గత వారంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ సంస్థలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కోరుతూ దరఖాస్తులు ఆహ్వానించింది.

అత్యున్నత స్థాయి నాణ్యతతో కూడిన ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం చాలా మంచి ముందడుగేనని దేశంలో విద్యావేత్తలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయితే.. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో మన విద్యాసంస్థలు కూడా ర్యాంకింగులలో స్థానం దక్కించుకునే అవకాశం ఉన్నా, సాంఘిక-ఆర్థిక అభివృద్ధి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ వ్యవస్థ కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని పదేసి యూనివర్సిటీలను గుర్తించి, వాటికి మరింత స్వాతంత్య్రం కల్పించి, వాటికి ప్రభుత్వం అన్నిరకాలుగా అండదండలు అందిస్తుంది. వాటిలో మరింత సులువైన నియంత్రణ వ్యవస్థ ఉంటుంది. రాబోయే పదేళ్లలో ఈ సంస్థలు ప్రపంచంలోని టాప్-500 యూనివర్సిటీల జాబితాలో చోటు సంపాదించాలన్నది తుది లక్ష్యం. మొత్తం 20 విద్యాసంస్థలు కూడా ఈ జాబితాలో స్థానం పొందేందుకు కావల్సిన అర్హతా ప్రమాణాలన్నింటినీ సాధించాలని చెబుతున్నారు.

అందుకోసం ఈ సంస్థలలో ఏమేం ఉండాలని ప్రభుత్వంలోని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చెబుతోందంటే.. అత్యంత పారదర్శకమైన, అవసరాలకు తగినట్లుగా ఉండే ప్రవేశాల విధానం, అందులోనూ ఉపకార వేతనాలు, విద్యా రుణాలకు కావల్సిన అవకాశాలు తప్పనిసరిగా ఉండాలి. స్వదేశీ, విదేశీ విద్యార్థుల వద్ద ఎంతెంత ఫీజులు వసూలు చేయాలో ఆయా విద్యా సంస్థలే నిర్ణయించుకునే స్వాతంత్య్రం వాటికి ఉంటుంది. అక్కడ ఏయే కోర్సులు అందజేయాలో తమకు తామే నిర్ణయించుకోడానికి వీలుగా వాటికి అటానమీ కల్పిస్తారు. సరైన కరిక్యులం ఏర్పాటుచేసుకుని ఆన్‌లైన్ కోర్సులను కూడా అందించాలని చెబుతున్నారు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన అధ్యాపకులను కూడా తెచ్చుకుని, వారితో బోధన చేయించాలని సూచిస్తున్నారు. దాంతోపాటు వివిధ అంతర్జాతీయ యూనివర్సిటీలతో కొలాబరేషన్ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా విద్యార్థులకు అవకాశాలు పెంచాలని అంటున్నారు. అత్యున్నత స్థాయి పరిశోధనలు, బోధన, ఆర్థిక, పాలనాపరమైన అటానమీ మొత్తం వీటిలో ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఈ తరహా విద్యా సంస్థల విషయంలో చెబుతున్న ఈ విషయాలే భారతీయ ఉన్నత విద్యారంగంలో కొన్ని తీవ్రమైన సవాళ్లకు సమాధానాలు అవుతాయన్నది పలువురు విద్యావేత్తల వాదన.

కానీ... అసలు ఈ సంస్థలలో ప్రవేశం సంగతి ఏంటన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ముఖ్యం గా ప్రతిభకు ఏమాత్రం కొదవ లేకపోయినా ఆర్థికప రంగా వెనకబడి ఉండే చాలామంది భారతీయ విద్యార్థులకు ఈ సంస్థలలో ప్రవేశించే అవకాశం అసలు దొరుకుతుందా? అని అడుగుతున్నారు. ఉపకార వేతనాలు ఇస్తామని చెబుతున్నా అవి కూడా కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితం అవుతాయి. ఒకవేళ విద్యా రుణాలు ఇచ్చినా, అంత పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు గ్యారంటీలు అడుగుతున్నాయి. ఇప్పటికే ఇళ్లు, పొలాల పత్రాలు లేనిదే నాలుగైదు లక్షల విద్యా రుణాలను మంజూరు చేయడానికి కూడా చాలా వరకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్థికంగా బాగా వెనుకబడిన వారికి ఈ సంస్థలు అందని ద్రాక్షలు గానే ఉంటాయా.. మళ్లీ ఈ అత్యున్నత స్థాయి విద్య కేవలం భారతీయ సమాజంలో ఉన్న కేవలం అతి కొద్దిమందికే పరిమితం అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. కానీ అదే సమయంలో భారతీయ విద్యా వ్యవస్థను, యూనివర్సిటీల స్థితిగతులను మార్చాల్సిన అవసరం కూడా చాలా కనిపిస్తోంది. అత్యున్నత స్థాయి పరిశోధనలు, బోధన మీద దృష్టి సారించాల్సిందే. మన దేశంలో పీహెచ్‌డీల సంఖ్యే బాగా తక్కువగా ఉంటోందంటే.. వాటి నాణ్యత మీద కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పీహెచ్‌డీ పూర్తి చేసిన చాలామంది ఇంకా ఉద్యోగాల కోసం ఎదురు చూపులు చూస్తూనే ఉండటం దీనికి నిదర్శనం. అందుకే ఈ కొత్త విద్యా సంస్థలలో ప్రమాణాలను పాటించాలన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. అత్యున్నత స్థాయి మౌలిక వసతులు కల్పించడం ద్వారా వీటిని సాధించాలని చెబుతున్నారు.

వాస్తవానికి ఈ ప్రతిపాదన రావడానికి ప్రధాన కారణం.. ప్రతి ఏటా వివిధ అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే టాప్-500 ఉన్నత విద్యా సంస్థల జాబితా, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్, క్యూఎస్ లాంటి ర్యాంకింగ్ జాబితాలలో మన దేశంనుంచి విద్యాసంస్థల పేర్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. టాప్ 1000 సంస్థలలో భారతీయ విద్యాసంస్థలు కేవలం 30 మాత్రమే ఉన్నాయి. గత సంవత్సరం మన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ర్యాంకు 201-250 స్థాయిలో ఉండగా, ఈ సారి అది 251-300కు పడిపోయింది. పరిశోధనల సంఖ్య తగ్గడం, పరిశోధనల ఆదాయం తగ్గడం వల్లే ఈ ర్యాంకు దిగజారింది. క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల జాబితాలో టాప్ 200 సంస్థలలో కేవలం రెండు ఐఐటీలే చోటు సంపాదించాయి. అంటే ఈ రెండూ తప్ప మరే సంస్థా ఆ ప్రమాణాలకు దరిదాపుల్లో కూడా లేదనే అర్థం.

మన దేశంలో ప్రస్తుతం 800 యూనివర్సిటీలు, 39 వేల కాలేజీలు, 12000 ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో ప్రతి ఏటా సుమారు 3.5 కోట్ల మంది విద్యార్థులు చేరుతుంటారు. మరి ఇప్పుడు కొత్తగా రూపొందిస్తామంటున్న 20 విద్యా సంస్థలు ఏయే ప్రాంతాల్లో ఉంటాయి? దేశంలోని నలుమూలల్లో అందరికీ అందుబాటులోకి వస్తాయా? అనేది మొదటి ప్రశ్న. ఇలాంటి విద్యా సంస్థలను ఏర్పాటుచేసినపుడు దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా చాలా వరకు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దేశంలో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలను చూసి వీటిని ఏర్పాటుచేస్తారా లేదా అనే అనుమానాలున్నాయి. అంతర్జాతీయ ర్యాంకులు పొందే సంస్థలన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల అవసరాలకు తగినట్లుగా ఉంటాయి.

ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న, దిగువ మధ్యతరగతి ఆదాయం ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాలకు ఇవి ఎంతవరకు సరిపోతాయన్నది కూడా అనుమానంగానే కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయి అని చెబుతున్న అతికొద్ది సంస్థలలో ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టడం, వాటికే నిధులు కుమ్మరించడం వల్ల విస్తృత ప్రజాప్రయోజనా లకు విఘాతం కలిగే ప్రమాదముందని అంటు న్నారు. అంతర్జాతీయ ర్యాంకులను సాధించా లన్న ప్రభుత్వ తాపత్రయం పట్ల కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పరిశోధనలను పెంచాలంటే ఏ విధానాలు అవలంబించాలి.. ఎలాంటి బోధనా పద్ధతులు అవలంబించాలి.. ఎలాంటి అధ్యాపకులను నియమించుకోవాలి.. ఇలాంటివి చూడకుండా భారీ బడ్జెట్లతో ఇంతటి పెద్దపెద్ద సంస్థలను మాత్రం పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుందా? అని మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యే పరిశోధనా పత్రాలు, మొత్తం పరిశోధనల సంఖ్య.. ఇలాంటి వాటి ఆధారంగానే అంతర్జాతీయ ర్యాంకులు నిర్ణయమవుతాయి. స్కోపస్, వెబ్‌సైన్స్ లాంటి అంతర్జాతీయ ఏజెన్సీలు వీటినే లెక్కలోకి తీసుకుంటాయి. అది కూడా అంతర్జాతీయ పరిశోధన సంస్థలలో చేస్తే మరింత గుర్తింపు వస్తుంది. కానీ, ఇలా చేసే అవకాశాలు అతి కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. పైపెచ్చు అంతర్జాతీయ ప్రచురణ అంటే తప్పనిసరిగా ఇంగ్లిషులోనే ఉండాలి. అంటే, ఈ అవకాశం కేవలం దేశంలో ఇంగ్లిషు మీడియం పాఠశాలలకు వెళ్తున్న కేవలం 17శాతం విద్యార్థులకే పరిమితం అవుతుందా? బిహార్ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే విద్యా విషయంలో వెనకబడి ఉన్నాయి. అక్కడ కేవలం 3 శాతం విద్యార్థులే ఇంగ్లిషు మీడియంలో చదువుతున్నారు. ఇలాంటి సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడు ఉన్నత, అత్యున్నత స్థాయి విద్య మళ్లీ కేవలం అతి కొద్దిమందికి మాత్రమే పరిమితం అవుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణంగా ఇలా ఏదైనా కొత్త విధానాలు అమలు చేసినప్పుడు వాటి ఫలితాలు దీర్ఘకాలంలోనే తెలుస్తాయి. ప్రధానంగా మానవాభివృద్ధి సూచికలపై వీటి ప్రభావం ఎంత ఉందన్నది ముఖ్యం. ఎందుకంటే, ఈ విషయంలో మన దేశం పరిస్థితి బాగా తీసికట్టుగా ఉంది. ప్రపంచ ఆర్థిక ఫోరం ఇటీవల ప్రచురించిన 2017 నాటి అంతర్జాతీయ మానవ పెట్టుబడి నివేదిక ప్రకారం చూస్తే.. దక్షిణాసియా దేశాలలో మానవ పెట్టుబడి అభివృద్ధి సూచికల విషయంలో మన దేశం కేవలం పాకిస్థాన్, బంగ్లాదేశ్ కంటే మాత్రమే పైన ఉంది. మిగిలిన రెండు దేశాలు మనకంటే పైన ఉన్నాయి. జి20 దేశాలలో చూసుకుంటే మనది అట్టడుగు స్థానం. యువత అక్షరాస్యత శాతంలో కూడా బాగా వెనకబడి ఉంటున్నాం. దేశంలో అత్యధిక జనాభా దిగువ మధ్యతరగతి ఆదాయ స్థాయిలోనే ఉంటోంది. ఇన్ని ప్రతికూలతలున్నా, విద్య నాణ్యత, సిబ్బంది శిక్షణలాంటి అంశాలకు మాత్రం మన దేశం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటం గుడ్డిలో మెల్ల లాంటిది. ఎక్కువ మందికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తే మానవాభివృద్ధి సూచికలలో కాస్త పైకి ఎదిగే అవకాశం ఉంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు.

చంద్రశేఖర శర్మ

Show Full Article
Print Article
More On
Next Story
More Stories