అన్నదాతలకు ఆసరా ఏదీ?

అన్నదాతలకు ఆసరా ఏదీ?
x
Highlights

రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. కానీ ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండటం లేదు. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న తాను...

రైతే దేశానికి వెన్నెముక అని అంటారు. కానీ ఇప్పుడా వెన్నెముకే విరిగిపోతోంది. రైతుకు కనీస ఆదాయం కూడా ఉండటం లేదు. పదిమందికీ అన్నం పెట్టే రైతన్న తాను రోజుకు మూడు పూట్లా నాలుగు వేళ్లు నోట్లో పెట్టుకోలేకపోతున్నాడు. పిల్లలకు సరైన చదువులు చెప్పించే పరిస్థితి కూడా ఉండట్లేదు. ఆరుగాలం కష్టపడి పొలంలో ఎండనక, వాననక, పగలనక, రేయనక నిరంతరాయంగా కష్టపడినా దానికి తగిన ఫలితం రావడం లేదు. గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదు. ప్రపంచంలో ఏ వస్తువు తయారు చేసేవాళ్లయినా దాని ఉత్పత్తి కోసం అయిన ఖర్చు, పన్నులు, రవాణా, నిల్వ, మార్కెటింగ్.. వీటన్నింటితో పాటు తమ లాభాలు కూడా వేసుకుని ఆ ధరకు అమ్ముతారు. అంటే ఆ వస్తువు ధరను వాళ్లే నిర్ణయిస్తారు. అందుకే పావలా, అర్ధ రూపాయి తయారీ ఖర్చు ఉండే వస్తు వులు వినియోగదారుల వరకు వచ్చేసరికి రూపాయి, రూపాయన్నరకు కూడా అమ్ముతుంటారు. గుండు సూది నుంచి మోటారు కారు వరకు ఇదే సిద్ధాంతం అమలవుతుంది. కానీ ఒక్క వ్యవసాయో త్పత్తుల విషయంలో మాత్రం ఇది అమలు కావడం లేదు.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రైతులు తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే పొలాల్లో ఎంత కష్టపడి పెంచినా వాటికి తగిన ధర మాత్రం రావడం లేదు. కుటుంబం మొత్తం కష్టపడి పొలాల్లో పనిచేసి దుక్కి దున్నడం నుంచి మొదలుపెట్టి, చివరకు దిగుబడి వచ్చిన పంటను మార్కెట్ వరకు తరలించి అమ్ముకుందాం అనుకు నేసరికి అప్పటివరకు చాలా ఎక్కువ స్థాయిలో ఉండే రేట్లు కూడా ఒక్కసారిగా పడిపోతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లిపాయల ధర ఆకాశంలో ఉండేది. వినియోగదారులు కొనాలంటే కిలో 60 రూపాయలకు పైగా కూడా వెళ్లింది. దాంతో కిలో ఉల్లిపాయలు కొనుక్కుని వాటినే వారం, రెండు వారాలు కూడా వాడుకోవల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ తీరా పంట సీజన్ మొదలై రైతుల చేతికి దిగుబడి వచ్చి, దాన్ని మార్కెట్ వరకు తీసుకెళ్లేసరికి వాళ్లకు కిలో 3 రూపాయల కంటే ఇచ్చేది లేదని వ్యాపారులు కుండ బద్దలు కొట్టి మరీ చెప్పారు. క్వింటాలుకు 300 రూపాయలు మాత్రమే ధర చెల్లిస్తా మని తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన కర్నూలు మార్కెట్లో వ్యాపారులు చెప్పారంటే.. పరిసి ్థతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అన్నాళ్లు కష్టపడిన పంటను అంతే ధరకు అమ్మాలంటే కనీసం లారీ రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక రైతు గుండెపోటుతో మరణించాడు కూడా.

ప్రతిసారీ ఇలాగే జరుగుతోంది. ఏదైనా ఒక పంటకు రేటు బాగుందని రైతులంతా పెద్ద ఎత్తున ఆ పంట పండించడం, తీరా వాళ్లు మార్కెట్ వరకు తీసుకొచ్చేసరికి దానికి ఏమాత్రం ధర పలకకపోవడంతో ఆ సరుకునంతా రోడ్లమీద పారబో యడం లేదా అక్కడికక్కడే తగలబెట్టడం లాంటి పరిణామాలు చాలాసార్లు చోటుచేసుకుంటున్నాయి. గతంలో మిర్చి పరిస్థితి ఇలాగే అయ్యింది. మిర్చిరైతుకు గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో ఆగ్రహం చెందిన రైతులు నడిరోడ్డు మీద మిర్చి లారీలను కూడా తగలబెట్టేశారు. ఉల్లి, టమోటా.. ఇలా అన్నింటి పరిస్థితీ ఇలాగే ఉంటుంది. టమోటా కూడా మొన్నటి వరకు రీటైల్ మార్కెట్లలోను, రైతు బజార్లలోను కిలో 60-70 రూపాయల వరకు పలికింది. కానీ, మదనపల్లె మార్కెట్లో మంచి సీజన్ వచ్చేసరికి నాలుగైదు కిలోలకు రూపాయి కూడా చెల్లించిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అసలు కిలో టమోటా పండించాలంటే ఎన్నాళ్లు కష్టపడాలి, భూమికి కౌలు ఎంత చెల్లించాలి, విత్తనాలు ఎంత పెట్టి కొనుగోలు చేయాలి, ఎంతకాలం ఆ మొక్కలను చంటిబిడ్డల్లా సాకాలి.. అన్నాళ్లూ రైతు, వాళ్ల కుటుంబ సభ్యుల పోషణ ఖర్చు ఎంతవుతుంది, ఆ లెక్కన టమోటా ఉత్పత్తి ధర, రవాణా, మార్కెటింగ్, లాభం.. ఇవన్నీ కలుపుకొంటే ఎంత పడుతుంది అన్న విషయాలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో కిలోకు పావలా, 20 పైసలు కూడా తీసుకుని అమ్ముకోవడం, కాదనుకుంటే రోడ్ల మీదే సరుకు మొత్తం పారబోసి ఉత్త చేతులతో వెనక్కి తిరిగి వెళ్లడం లాంటి ఘటనలు చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తోంది? రైతే రాజు అని, జై జవాన్.. జై కిసాన్ అని ఇచ్చిన నినాదాలకు అర్థం లేకుండా ఎందుకు పోతోంది? దేశంలో మరే ఇతర వర్గానికీ లేని సమస్య రైతుల విషయంలోనే ఎందుకు వస్తోంది? ఈ విషయంలో పాలకులు ఎందు కంత దారుణంగా విఫలం అవుతున్నారు? వాళ్ల సమస్యలకు రుణ మాఫీలు మాత్రమే పరిష్కారం అవు తాయా అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వాళ్లు ఎవరూ కనిపించడం లేదు. ముఖ్యంగా సన్న కారు, చిన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటోంది.

తమకున్న అర ఎకరం, ఒక ఎకరానికి తోడు మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఏదో ఒక పంట సాగుచేస్తే దానికి గిట్టుబాటు ధర రాకపోవడంతో కనీసం కౌలు డబ్బులు కట్టే పరిస్థితి కూడా కనిపిం చడం లేదు. మరోవైపు పెద్దరైతులు మాత్రం ప్రభుత్వా ల నుంచి వచ్చే సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలను పెద్ద మొత్తంలో అందుకుంటూ అన్ని రకాలుగా లాభపడు తున్నారు. చిన్న రైతులు కనీసం పూట గడిచే పరిస్థితి కూడా కనిపించక ఏం చేయాలో అర్థం కాక అల్లాడు తున్నారు.అందులోనూ ఈమధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల వ్యవసాయం కూడా కార్పొరేటీకరణ దిశగా పయనిస్తోంది. కార్పొరేట్ శక్తులు ఈ రంగంలోకి కూడా ప్రవేశించి, చిన్న కమతాలు ఉన్న రైతుల నుంచి భూములు లీజుకు తీసుకుంటున్నాయి. పెద్ద పెద్ద కమతాలుగా వాటిని మార్చి వంద, రెండొందల ఎకరా ల్లో సాగు చేస్తున్నాయి. పెద్ద పెద్ద యంత్రాలతో భూమి దున్నడం, కలుపు తీయడం, డ్రోన్లతో ఎరువులు చల్లించడం.. ఇలా అన్నిరకాలుగా టెక్నాలజీని ఉప యోగించుకుంటూ ఖర్చు తగ్గించుకుంటున్నాయి. చివ రకు తమ సొంత పొలాల్లో ఆ రైతులనే కూలీలుగా మారుస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు కావడంతో తాము పండించిన పంటను మెరుగైన పద్ధతులలో కోల్ స్టోరేజీలలో నిల్వచేయడం, గిట్టుబాటు ధర వచ్చేవరకు వాటిని అక్కడే ఉంచి, ధరలు బాగా పెరిగిన తర్వాత అమ్ముకుని భారీ మొత్తంలో లాభాలు మూటగటు ్టకోవడం లాంటివి వాళ్లకు సాధ్యం అవుతున్నాయి. బక్క రైతులు అన్నాళ్లు ఆగే పరిస్థితి ఉండదు. పండించిన పంటను వెంటనే అమ్ముకుంటే తప్ప సాగుకు చేసిన అప్పులు తీరవు. ఇలా ఒక విషవలయంలో చిన్నరైతు చిక్కుకుపోతున్నాడు. చిన్న రైతులు పండించే ఉత్పాద నలను అమ్ముకోడానికి అంటూ ప్రారంభించిన రైతు బజార్ల వ్యవస్థ కూడా దారుణంగా విఫలమైంది. రైతు బజార్లలో ఎక్కడ చూసినా వ్యాపారులే కనిపిస్తున్నారు తప్ప రైతులకు చోటు ఉండటం లేదు. పొరపాటున ఎక్కడైనా ఒకరిద్దరు రైతులు అక్కడివరకు వచ్చినా, వాళ్లకు ఏదో ఒక మూల.. చిట్ట చివర స్టాల్ ఇస్తున్నారు. ముందు వరుసలో ఉండేవన్నీ పెద్ద వ్యాపారుల స్టాళ్లే. దాంతో వినియోగదారులు రాగానే ఎదురుగా కనిపించే చోట నాలుగు రకాలు కొనేసు కుని వెళ్లిపో తున్నారు. ఇలా రైతులకు అక్కడ ప్రవేశం దొరకడమే గగనం అనుకుంటే, చిట్ట చివర ఉండటంతో బేరాలు కూడా రావడం లేదు.

మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను రైతుల వరకు తీసుకెళ్ల డానికి ప్రభుత్వా లకు మనసు ఒప్పడం లేదు. ఎన్నికల ప్రయోజనాల కోసం రైతు రుణమాఫీ లాంటి ఆకర్షణీయమైన చాక్లెట్లు, బిస్కట్లు ఇచ్చి అప్ప టికప్పుడు వారి ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటన్న విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. రైతులు తమ పంట పొలాల నుంచి కూరగాయ లను నేరుగా కాలనీలకు తీసుకొచ్చి అమ్ముకు నేందుకు వీలుగా వాళ్లకు చిన్నపాటి రవాణా వాహనాలు సమకూరిస్తే.. నలుగురైదుగురు రైతులు కలిసి చిన్న సహ కార సంఘంగా ఏర్పడి తమ కూర గాయలను తామే అమ్ముకుంటారు.

అప్పుడు మధ్యలో దళారుల ప్రమేయం ఉండదు కాబట్టి ఇటు రైతుకూ తగినంత ధర వస్తుంది, అటు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన కూరగాయలు అందుతాయి. అలాగే బియ్యం, ఇతర పప్పు దాన్యాలు కూడా. వీటన్నింటినీ ఆరుగాలం శ్రమించి పండించే రైతుకు పైసల్లోనే ధరలు లభిస్తుంటే, కొనుగోలు చేసే సమయంలో వినియోగ దారులకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయి .వ్యవసాయరంగ అభివృద్ధి విషయం లో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లాంటివాళ్లు చేసిన సూచనలను ఏ ప్రభుత్వమూ అమలు చేయడం లేదు. ఉత్పత్తి ఖర్చు ఎంతయిందో లెక్కించి, దానికి రెట్టింపు ధరను కనీస మద్దతుధర లేదా గిట్టుబాటు ధరగా నిర్ణయించాలని ఇచ్చిన సలహాలు ఎవరికీ పట్టడం లేదు.

రైతులు లేనిదే అసలు ఈ ప్రపంచంలో తినడానికి తిండి కూడా దొరకదన్న కనీస విషయాన్ని కూడా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కాదు. ఉత్పాదక రంగంపై విపరీతంగా దృష్టి సారించి, ఆ రంగానికి బోలెడన్ని సదుపాయాలు, సౌకర్యాలు, రాయితీలు కల్పించి వాళ్లకు తగినంత ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పించడమే కాక వాళ్లు తమ ఇష్టానుసారం ఎంతకు కావాలంటే అంతకు అమ్ముకునే స్వేచ్ఛ ఇస్తున్నారు. తద్వారా వాళ్లు లాభాల మీద లాభాలు ఆర్జించేందుకు ప్రత్యక్షం గానే సహకరిస్తున్నారు. మరి అదే విధానాన్ని రైతుల విషయంలో ఎందుకు అమలుచేయ లేకపోతున్నారన్న ప్రశ్నకు మాత్రం ఎక్కడా సమాధానం రావడం లేదు. దేశంలో రైతులు బాగుపడాలంటే అంతా కలిసి పెద్ద కమతాలు ఏర్పాటు చేసుకోవాలని మాత్రం చెబు తున్నారు. వినడానికి బాగానే ఉన్నా, అమలులో ఇది చాలా కష్టం అవుతుంది. అందుకే ఈ విధానాన్ని కార్పొరేట్ పెద్దలు అందిపుచ్చుకున్నారు. రైతులకు పప్పు బెల్లాలు మాత్రం పెట్టి తాము భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. రైతు బాగుపడితే దేశం చల్లగా ఉంటుందన్న విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి, వాళ్లకు మేలు చేసే విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

చంద్రశేఖర శర్మ

Show Full Article
Print Article
Next Story
More Stories