ఇన్‌ ఫ్రంట్‌ ఫెస్టివల్‌... కేసీఆర్‌ వ్యూహం ఇదే!!

ఇన్‌ ఫ్రంట్‌ ఫెస్టివల్‌... కేసీఆర్‌ వ్యూహం ఇదే!!
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. మరో నెలరోజుల్లో దేశంలో కొత్త పార్టీ రానుందని కూడా...

తెలంగాణ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. మరో నెలరోజుల్లో దేశంలో కొత్త పార్టీ రానుందని కూడా కేసీఆర్ ప్రకటించారు. నిజంగానే ఆయన కొత్త పార్టీ పెడుతారా ? ఆ పార్టీ నిర్మాణం ఎలా ఉంటుది ? అలాంటి పార్టీ మరో ఆరునెలల్లో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయగలదా ? బీజేపీయేతర, కాంగ్రేసేతర పార్టీగా దాన్ని ప్రజలు అంగీకరిస్తారా లాంటి అంశాలన్నీ ఇప్పుడ తెరపైకి వచ్చాయి. నిజానికి కొన్ని నెలల క్రితమే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి ప్రస్తావించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రతిపాదన అప్పట్లో మరుగున పడిపోయింది. ఇక తాజాగా మరోసారి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బహుశా ఒక జాతీయ పార్టీ నిర్మాణంతో తెరపైకి రానుంది.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలలు కన్నారు కేసీఆర్. ఆ విషయంలో అనుకున్నది సాధించారు. ఇక ఇప్పుడు ఆయన దృష్టి రాష్ట్రాలను మరింత బలోపేతం చేసే దిశగా మళ్ళింది. రాష్ట్రాలకు మరిన్ని నిధులు, అధికారాల కోసం ఆయన పోరాటం చేయనున్నారు. ఆయన చేయబోయే పోరాటం ఒంటరిపోరాటం కాదు. మొన్నటి స్వాతంత్ర్య ఉద్యమాన్ని, నిన్నటి తెలంగాణ ఉద్యమాన్ని తలపించే తరహాలో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కలసి చేయనున్నారు. అయితే ఈ పోరాటం పార్టీల కూటమి తరహాలో కాకుండా వినూత్నంగా ఉండనుంది. అంతేకాదు....బీజేపీయేతర, కాంగ్రెసేతర కన్సార్టియం రూపంలో పార్టీ నిర్మాణాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. కూటమిలా ఉన్నప్పటికీ పార్టీ తరహా నిర్మాణం దీని ప్రత్యేకతగా ఉండే అవకాశం ఉంది. ఈ పార్టీ కోసం ఇప్పటికే అజెండా రూపొందించుకున్నట్లు కూడా కేసీఆర్ వెల్లడించారు. దీన్ని ఎలా ప్రారంభించాలనే విషయంలో ఇప్పటికే స్కెచ్ వేసుకున్నట్లు కూడా కేసీఆర్ తెలిపారు.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ ఎప్పటి నుంచో భావిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్న సమయంలోనే ఆయనకు వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీల పునాదులు, బలాబలాలపై ఆయనకు అవగాహన ఉంది. కారణాలు ఏవైతేనేం....పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో తమ మనుగడను కొనసాగించుకునేందుకు ప్రజాకర్షక సంక్షేమ పథకాలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ పథకాల అమలుకు నిధులు అవసరం. ఆ నిధులు కావాలంటే కేంద్రంపై ఆధారపడక తప్పదు. కేంద్రం ఇచ్చే సాయం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో ప్రాంతీయ పార్టీకి ఉన్న సంబంధాన్ని, అనుబంధాన్ని బట్టి ఉంటోంది. అందుకే కేసీఆర్ నేరుగా కుంభస్థలంపైనే కన్నేశారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల ప్రభుత్వమే అధికారంలోకి రావాలన్నది ఆయన ఆకాంక్ష.

కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు రావడంలో కేంద్రప్రభుత్వమే అడ్డుగా నిలుస్తోంది. ఒకవైపున రాష్ట్రాలు నిధుల్లేక అల్లాడుతుంటే మరో వైపున కేంద్ర ప్రభుత్వం వద్ద, ప్రత్యక్షంగా, పరోక్షంగా కేంద్ర ప్రభుత్వ పెత్తనం ఉండే వివిధ వ్యవస్థల్లో లక్షల కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. అన్ని లక్షల కోట్ల నిధులను కేంద్రప్రభుత్వమే ఆయా వ్యవస్థల నుంచి లాక్కోలేకపోతున్నది. ఆర్బీఐ లాంటి వాటిని ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఆర్బీఐ వద్ద ఉన్న లక్షల కోట్ల నిధులను కొంతమొత్తాన్ని పొందాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆర్బీఐ మాత్రం అందుకు నిరాకరించింది. చివరకు ఆర్బీఐ గవర్నర్ తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆ వివాదమే పరోక్షంగా కారణమైందన్న వాదనలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు కంపెనీలతో పాటుగా మహారత్న, నవరత్న హోదా కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కోట్లాది నిధులున్నాయి. ప్రాంతీయ పార్టీలే గనుక కేంద్రంలో అధికారం చేపడితే ఆ నిధులను ఉపయోగించుకునే అవకాశం ప్రాంతీయ పార్టీలకు కలుగుతుంది. తద్వారా అవి తమ రాష్ర్టాల్లో ప్రజాకర్షక సంక్షేమ పథకాలను సజావుగా కొనసాగించే అవకాశం లభిస్తుంది. అంతేగాకుండా విద్య, వైద్యం లాంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వ పెత్తనం వద్దని కేసీఆర్ కోరుకుంటున్నారు. పలు ప్రాంతీయ పార్టీల ఆలోచన కూడా అదే విధంగా ఉంది. రాజ్యాంగం ప్రకారం యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఉన్నాయి. స్టేట్ లిస్ట్ ను పెంచడం తో పాటుగా మిగిలిన రెండు జాబితాల్లోని అంశాలను తగ్గించడం పై కూడా కేసీఆర్ యోచించే అవకాశం ఉంది

కేసీఆర్ కొత్త పార్టీకి ఒక విధంగా బీజేపీ వ్యూహమే స్ఫూర్తినిచ్చిందని చెప్పవచ్చు. దేశంలో కొన్ని దశాబ్దాలుగా మైనారిటీలను సంతృప్తి పరిచే రాజకీయాలు కొనసాగాయి. బీజేపీ మాత్రం మెజారిటీలను ఆకట్టుకునే వ్యూహాలను అనుసరించింది. సరిగ్గా ఇదే వ్యూహాన్ని తనదైన శైలిలో అనుసరించారు కేసీఆర్. తెలంగాణలో ఒకవైపున తమ పార్టీ ఓటుబ్యాంకును స్థిరపరుచుకోవడంతో పాటుగా మజ్లిస్ తో ఫ్రెండ్ షిప్ చేశారు. అధికారికంగా పొత్తు లేకపోయినా మజ్లిస్ టీఆర్ఎస్ మిత్రపక్షంగానే వ్యవహరించింది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేలా కేసీఆర్ చేసుకోగలిగారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీలను భాగస్వాములను చేయడంలో కూడా ఆయన ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఒక రాష్ర్టంలో ఒక ప్రాంతీయ పార్టీని ఎంచుకుంటే అక్కడే ఒక కులం లేదా మతం వారిలో బలమైన ఉనికి కలిగిన మరో పార్టీతో దానికి అనధికారిక పొత్తు కుదిర్చే అవకాశం ఉంది. తమిళనాడునే ఉదాహరణగా తీసుకుంటే డీఎంకే గనుక కేసీఆర్ తో మొగ్గు చూపితే, తమిళనాడులో బలమైన కులవర్గానికి ప్రాతినిథ్యం వహించే మరో పార్టీని కూడా అక్కున చేర్చుకునే అవకాశం ఉంది. అలా చేయడం ద్వారా ఒక్కో రాష్ట్రంలో అనధికారిక పొత్తుతో రెండు పార్టీలు కలసి ఇతర పార్టీలను ఓడించడం, ఆ తరువాత అవన్నీ కలసి కేసీఆర్ పార్టీ నిర్మాణంలో భాగస్వాములు కావడం జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఇవన్నీ ఊహాగానాలే. కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు దాని నిర్మాణ తీరుతెన్నులు మరింత స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories