కార్తీక్ ఓ అవారా

కార్తీక్ ఓ అవారా
x
Highlights

తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని పక్కా ప్లాన్ ప్రకారం చంపేశాడు. ఉన్మాదంతో రెచ్చిపోయి పెట్రోల్ పోసి నడిరోడ్డుమీద తగలబెట్టేశాడు. తనకు దక్కని ప్రేమ...

తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందని పక్కా ప్లాన్ ప్రకారం చంపేశాడు. ఉన్మాదంతో రెచ్చిపోయి పెట్రోల్ పోసి నడిరోడ్డుమీద తగలబెట్టేశాడు. తనకు దక్కని ప్రేమ ఇంకెవరికీ దక్కకూడదన్న కక్షతో వ్యవహరించాడు. ఎందుకంత కక్ష..? కాదంటే కనికరం లేకుండా చంపేస్తారా..? రాజధానిలో అమ్మాయిలకు రక్షణలేదా..? సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రేమ పేరుతో వేధిస్తూ తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికీ దక్కకూడదన్న అక్కసుతో సంధ్యారాణిని చంపేశాడు దుర్మార్గుడు. శాంతినగర్‌‌లోని లక్కీ ట్రేడర్స్‌లో సంధ్యారాణి అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. అక్కడే ఆమెకు కార్తీక్‌తో పరిచయం ఏర్పడింది. అయితే, ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకున్న కార్తీక్ ఆ విషయాన్ని సంధ్యకు చెప్పడంతో తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్‌ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు.
సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్‌ విద్యామందిర్‌ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. దీంతో గురువారం సాయంత్రం కార్తీక్‌ పెట్రోల్ డబ్బాతో ఆ ప్రాంతంలో కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఆమెపై పోశాడు.
షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్‌ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది.
ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆస్పత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతూ సంధ్యారాణి ప్రాణాలు విడిచింది. అయితే, సంధ్యారాణిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడు కార్తీక్ పోలీసులకు లొంగిపోయాడు. తాను పథకం ప్రకారమే సంధ్యను హతమార్చినట్టు పోలీసులకు విచారణలో తెలిపాడు.
సంధ్య అందంగా ఉండటంతోపాటు చదువుకుందని, ఏడో తరగతి ఫెయిల్ అయిన కార్తీక్ అవారాగా తిరుగుతుండటంతో ఆమె కాదనుకుందని డీసీపీ సుమతి చెప్పారు. సంధ్యారాణి మరణానికి కారకుడైన కార్తీక్‌పై 302, 354డీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కార్తీక్‌కి కఠిన శిక్ష పడేలా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సంధ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు.. సంధ్యారాణి కుటుంబ సభ్యులను కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చూడాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షించాలని, సమాజంలో ఇంకెవరికీ ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబంతోపాటు మహిళలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories