ముంబై చెత్త వివాదంలో విరుష్క జోడీ

ముంబై చెత్త వివాదంలో విరుష్క జోడీ
x
Highlights

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ...ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని...

భారత సెలెబ్రిటీ జోడీ అనుష్కశర్మ- విరాట్ కొహ్లీ...ఓ చెత్త వివాదంలో చిక్కుకొన్నారు. లగ్జరీ కారులో ప్రయాణం చేస్తూ ముంబై రోడ్డుపై చెత్తవేసిన ఓ యువకుడిని అనుష్క మందలించడం దానిని వీడియో తీసి విరాట్ కొహ్లీ నెట్ లో పోస్ట్ చేయటం పట్ల మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. చివరకు అనుష్క పరిస్థితి తిట్టబోయి తిట్లుతిన్నట్లుగా తయారయ్యింది.

భారత క్రికెట్ మొనగాడు విరాట్ కొహ్లీ...అతని భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ ప్రస్తుతం మనదేశంలో మెగా సెలెబ్రిటీజోడీ. ఈ జోడీ ఏది చేసినా అది ఓ సంచలనమే. అంతేకాదు. ఈ ఇద్దరినీ సోషల్ మీడియాలోని వివిధ వేదికల ద్వారా అనుసరించేవారు... లక్షలకొద్దీ ఉన్నారు. అంతేకాదు...అనుష్క ఏపని చేసినా...చివరకు తమ పెంపుడుకుక్కతో ఆడుకొన్నా...దానిని సెల్ ఫోన్ ద్వారా చిత్రించడం...ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకోడం, తన భార్యను గొప్పగా పొగడటం..విరాట్ కొహ్లీకి ఈమధ్య కాలంలో ఓ అలవాటుగా మారింది. అయితే..ఆ అలవాటే ప్రస్తుతం విరుష్కజంటను ఓ వివాదంలో కేంద్రబిందువుగా చేసింది.

ముంబైలో విరుష్క జోడీ తమ లగ్జరీ కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో...తమ పక్కనుంచి వెళుతున్న మరో లగ్జరీ కారులో నుంచి చిన్నప్లాస్టిక్ వస్తువును రోడ్డు మీద పడవేయటాన్ని అనుష్కశర్మ చూసింది. అంతేకాదు...కారు అద్దం తెరచి...ప్లాస్టిక్ వస్తువు వేసిన యువకుడికి క్లాసు పీకింది. విలాసవంతమైన కార్లలో ప్రయాణం చేస్తూ...రోడ్లను చెత్తకుండీలా మార్చే అలవాటు మంచిదికాదంటూ మండిపడింది. ఆ యువకుడిని తీవ్రంగానే మందలించినంత పని చేసింది. ఈ సంఘటన మొత్తాన్ని..విరాట్ కొహ్లీ తన సెల్ ఫోను ద్వారా చిత్రించి.. ఆ వీడియోని... ఇన్ స్టా గ్రామ్ పంచుకోడం చర్చనీయాంశమయ్యింది. పైగా ఆ యువకుడి ముఖానికి మాస్క్ కూడా వేయకుండా ప్రదర్శించడం...విమర్శలకు కారణమయ్యింది.

విరాట్ కొహ్లీ ఉంచిన వీడియో తనకు బాధకలిగించిందని..వ్యక్తిగతంగా తన ప్రైవసీకి భంగం కలిగించిందని...అర్హాన్ సింగ్ అనే యువకుడు ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. అనుష్కశర్మ లాంటి సెలెబ్రిటీ..తాను చేసిన తప్పును మర్యాదగా, మృదువుగా ఎత్తిచూపవచ్చునని..అయితే ..ఆమె చాలా కటువుగా...అమర్యాదకరమైన రీతిలో చెప్పడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మండిపడ్డాడు. రోడ్డు మీద ప్లాస్టిక్ వస్తువును పడేయటం తాను చేసిన తప్పేనని...అయితే...తాను చేసిన చెత్త పనికంటే...అనుష్కశర్మ మరింత చెత్తగా మాట్లాడితే...ఆ చెత్త విషయాన్ని కొహ్లీ వీడియోగా చిత్రించి...సోషల్ మీడియాలో ఉంచడం మరింత చెత్తపని అంటూ ఎదురుదాడికి దిగాడు.

అర్హాన్ సింగ్ తల్లి సైతం...విరుష్క జోడీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుభ్రత పేరుతో అనుష్క, విరాట్ జోడీ తమ గొప్పతనాన్ని ప్రచారం చేసుకోడాన్ని మించిన చెత్తపని మరొకటి లేదని...ఎదుటివారిని కించపరచేలా..వీడియోలు పెట్టే హక్కు ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదిఏమైనా...విరుష్కజోడీ వీడియా...వైరల్ గా మారటం సంగతేమో కానీ...మిశ్రమస్పందన మాత్రం వ్యక్తమయ్యింది. అనుష్కశర్మ చెత్తవాగుడు విధానం నుంచి బయటకు వచ్చి..కాస్త మృదువుగా, మర్యాదగా మాట్లాడటం నేర్చుకొంటే బాగుంటుందని...సోషల్ మీడియా ద్వారా చాలామంది సలహా ఇవ్వటం ఇక్కడి కొసమెరుపు.

Show Full Article
Print Article
Next Story
More Stories