కన్న కూతురిని చంపిన తండ్రి.. సాక్షిగా నిలిచిన తల్లి!

కన్న కూతురిని చంపిన తండ్రి.. సాక్షిగా నిలిచిన తల్లి!
x
Highlights

నల్గొండ: జిల్లాలో బాలిక పరువు హత్య సంచలనం సృష్టించింది. తన కూతురి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో రగిలిపోయిన తండ్రి కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా ఆమెను...

నల్గొండ: జిల్లాలో బాలిక పరువు హత్య సంచలనం సృష్టించింది. తన కూతురి ప్రవర్తనపై తీవ్ర అసహనంతో రగిలిపోయిన తండ్రి కన్న కూతురన్న కనికరం కూడా లేకుండా ఆమెను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ దారుణానికి కన్నతల్లి సాక్షిగా నిలవడం శోచనీయం. నల్గొండ జిల్లా చింతపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. శుక్రవారమే ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం చింతపల్లి మండలం తీటేడు గ్రామానికి చెందిన శాంతి(పేరు మార్చాం) స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఆ బాలిక వయసు 13 సంవత్సరాలు. పాఠశాలకు వెళుతున్న క్రమంలో కొందరు విద్యార్థులతో శాంతి చనువుగా ఉండేది. అది నచ్చని తండ్రి నరసింహ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అబ్బాయిలతో మాట్లాడొద్దని వారించాడు. అయితే తెలిసీతెలియని వయసు కావడంతో తండ్రి మాటలను ఆమె లెక్కచేయలేదు. తాను ఎంత చెప్పినా కూతురు వినడం లేదని నరసింహ తీవ్ర అసంతృప్తితో రగిలిపోయాడు. భార్య లింగమ్మతో కూతురి ప్రవర్తన గురించి చర్చిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. గత శుక్రవారం ఈ విషయంపై తండ్రీకూతురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

కూతురిపై కోపంతో రగిలిపోయిన తండ్రి నరసింహ చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగక ఆమె గొంతు నొక్కి.. తలను గోడకేసి మోదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. కూతురిలో ఎలాంటి చలనం లేకపోవడంతో ప్రాణాలతో ఉందా.. లేదా అని చూశాడు. అయితే అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. భర్త కూతురిపై ఇంత పాశవికంగా ప్రవర్తిస్తుంటే, అడ్డుకోవాల్సిన భార్య లింగమ్మ చూస్తూ నిల్చుంది. అంతేకాదు, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె భర్తకు సహకరించింది. కూతురి మృతదేహానికి నిప్పంటించి.. ఆమె తగలబెట్టుకున్నట్లుగా ఇద్దరూ కేకలు వేశారు. ఇరుగుపొరుగు రావడంతో ఏడుస్తూ తమకేం సంబంధం లేనట్లు వ్యవహరించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి హత్యగా అనుమానించారు. తమదైన స్టైల్లో దర్యాప్తు జరిపి ఆ బాలిక తల్లిదండ్రులే హత్య చేసినట్లుగా తేల్చారు. నరసింహ, లింగమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories