logo

ప‌రువును బ‌జారుకీడుస్తున్న పోలీసులు

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ సర్కార్‌ గొప్పలు చెప్పుకుంటుంటే... కొంతమంది సిబ్బంది మాత్రం శాఖ పరువును బజారుకీడుస్తున్నారు. సహనంగా వ్యవహరించి.. వారిలో మార్పు తీసుకురావాల్సింది పోయి... చెంపచెళ్లుమనిపిస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఉన్నతాధికారులనూ అవాక్కయ్యేలా చేస్తున్నాయి.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకన్ డ్రైవ్ మంచి సత్ఫలితాలనిస్తోంది. ప్రమాదాల నివారణకు రాత్రంతా ట్రాఫిక్ పోలీసులు చేస్తున్న కృషిని అభినందించాల్సిందే కానీ... మందుబాబులతో ఓపికగా వ్యవహరించాల్సింది పోయి చితకబాది వివాదాస్పదమవుతున్నారు. కనీస విచక్షణ మరిచిన ఇద్దరు కానిస్టేబుళ్లు అందరు చూస్తుండగానే ఇటీవల ఓ మందుబాబును కాళ్లతో తన్నుతూ చితకబాది వివాదానికి కారణమయ్యారు. ఫలితంగా ఇద్దరు హోంగార్డులపై బదిలీవేటు పడినా.. మందుబాబులతో పోలీసులు ప్రవర్తించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.

ట్రాఫిక్ పోలీసుల తీరు ఇలా ఉంటే లా అండ్ అర్డర్ పోలీసులు కూడా తామేం తక్కువ కాదని నిరూపించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఇటీవలే జాతీయ స్దాయి పురస్కారం పొందిన బేగంపేట్ ఏసీపీ రంగారావ్ మహిళా దొంగలతో వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా ఒక్కరోజు వ్యవధిలోనే సిటీ ఆర్ముడ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. బంగారం దొంగిలించిన మహిళా నిందితుల్ని అరెస్ట్ అనంతరం మీడియా ముందు ప్రవేశపెట్టిన ఏసీపీ రంగారావ్...రికవరీ విషయంలో పోలీసులను ముప్పతిప్పలు పెడుతోందంటూ సహనం కోల్పోయారు. అందరు చూస్తుండగానే సదరు మహిళా దొంగ చెంపచెళ్లుమనిపించారు.

ఈ రెండు ఘటనలు హైదరాబాద్ పోలీసుల ప్రతిష్ట దిగజార్చే విధంగా చేస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్ తీరు ఉన్నతాధికారులను నోరెళ్లబెట్టేలా చేసింది. భర్త చనిపోయిన ఓ బాధితురాలింటికి వెళ్లిన సీఐ వివరాలు సేకరిస్తూ బాధిత మహిళా కూర్చున్న మంచంపై కాలు పెట్టి రాజసం ప్రదర్శించారు. ఆ ఫోటో కాస్త వైరలవ్వటంతో మరో చోటికి బదిలీచేశారు. కుర్చీ విరిగిన కారణంగా కాలు పెట్టానని వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసిన అప్పటికే జరగాల్సిందంతా జరగటంతో వేటు వేశారు.

సహనం కోల్పోయి చితకబాదుతున్న ఘటనలే కాదు అక్రమసంబందాలు పోలీస్ శాఖకు మరింత మాయని మచ్చగా మారాయి. పోలీస్ శాఖలో మంచి అధికారిణిగా గుర్తింపు పొందిన ఏసీబీ అదనపు ఏస్పీ సునీతారెడ్డి.. అదే శాఖలోని మల్లిఖార్జున్‌రెడ్డి అనే ఇన్స్‌పెక్టర్‌తో సన్నిహితంగా ఉండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నాడు సునీతారెడ్డి భర్త. తర్వాత సునీతారెడ్డి బంధువులు సీఐని చితకబాదటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండే హైదరాబాద్‌లోనే మచ్చుకు కొన్ని ఘటనలు బయటపడగా వెలుగులోకి రాని అంశాలు మరెన్నో.. మరి జిల్లాల్లో పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తోతంది.

arun

arun

Our Contributor help bring you the latest article around you


లైవ్ టీవి

Share it
Top