హైకోర్టు ముందుకు ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ కేసు

x
Highlights

రెవెన్యూ అధికారులు సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన వ్యవహారంపై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాయదుర్గంలోని తన అతిథి గృహాన్ని...

రెవెన్యూ అధికారులు సినీ హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ సీజ్ చేసిన వ్యవహారంపై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకోబోతోంది. రాయదుర్గంలోని తన అతిథి గృహాన్ని అధికారులు సీజ్‌ చేయడంపై ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్టు ధర్మాసనానికి బదిలీ చేసింది. ప్రభాస్ పిటిషన్‌ను ఇవాళ న్యాయస్థానం విచారించే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాయదుర్గం పాన్ మక్తలోని ‘పైగా’ భూములపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పాన్ మక్తా గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 46లో ఉన్న 84 ఎకరాల 30 గుంటల భూమికి సంబంధించి 40 ఏళ్లుగా కోర్టులో ఉన్న కేసులు తొలగిపోవడంతో శేరిలింగంపల్లి తహసీల్దార్‌ ఆ స్థలంలోని నిర్మాణాలు తొలగించి స్వాధీనం చేసుకున్నారు. అక్కడి కట్టడాలను సోమవారం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్కడే ఉన్న ప్రభాస్‌ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు.

ఎలాంటి నోటీసులివ్వకుండానే గెస్ట్‌హౌస్‌ను అధికారులు సీజ్‌ చేయడంపై ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. నిబంధనలను పాటించకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేయడం చట్ట విరుద్ధమని ప్రభాస్ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అధికారుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. పాన్ మక్తాలో గెస్ట్ హౌస్ ఉన్న సిఎస్ /7 లో ఉన్న భూమి పిటిషనర్ తండ్రి కోనుగోలు చేశారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని సక్రమంగానే రిజిస్టేషన్ చేసుకున్నామని వివరించారు. ఈ వివాదం చాలా మందికి సంబంధించింది కాబట్టి ఈ కేసును గతంలో విచారించిన డివిజన్ బెంచ్ కు బదిలీ చెయ్యాలని అభ్యర్థించారు. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన సింగిల్ బెంచ్ ప్రభాస్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ కు బదీలీ చేసింది. గెస్ట్ హౌస్ సీజ్ వివాదం పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. సినిమాల్లో భూవివాదాల గొడవ చూసిన ప్రభాస్ ఇప్పుడు నిజ జీవితంలో అలాంటి కేసునే ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు తీర్పుపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories