ప్రపంచానికి కనిపించని గుజరాత్‌ గుట్టు!!

ప్రపంచానికి కనిపించని గుజరాత్‌ గుట్టు!!
x
Highlights

గుజరాత్‌లో వలస కార్మికులపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే దేశంలో ఈ తరహా దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా దాడులు...

గుజరాత్‌లో వలస కార్మికులపై జరిగిన దాడులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే దేశంలో ఈ తరహా దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా దాడులు వివిధ రాష్ట్రాల్లో జరిగాయి. విద్య, ఉద్యోగావకాశాల్లో స్థానికేతరులు తమ అవకాశాలను సొంతం చేసుకుంటున్నారన్న భావన ఈ తరహా దాడులకు మూలకారణంగా ఉంది. తక్షణ కారణాలు మాత్రం వేరేవిగా ఉన్నాయి. గుజరాత్ తరహా దాడులు గతంలో కర్నాటకలోనూ జరిగాయి. 2012 ఆగస్టులో వందలాది మంది ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తమ సొంత స్థలాలకు తిరుగుముఖం పట్టారు. కొద్ది రోజుల్లోనే సుమారు 30 వేల మంది కర్నాటక వదిలి వెళ్ళారు. చెన్నై. పుణె నగరాల్లోనూ ఈ తరహా ఉదంతాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగా అనేక వదంతులు వచ్చాయి. సుమారు 15 మందిపై దాడులు జరిగాయి. మేము సైతం భారతీయులమే అంటూ ఆ రాష్ట్రాలకు చెందిన వారు వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించారు.

మహారాష్ట్రలో కూడా స్థానికేతరులపై ఈ తరహా దాడులు జరిగాయి. 2012లో శివసేన, మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన మద్దతుదారులు ఈ విధమైన దాడులకు పాల్పడ్డారు. బీహార్, జార్ఖండ్, యూపీ లకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగాయి. బీహారీలను చొరబాటుదారులుగా రాజ్ థాకరే అభివర్ణించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 2016లో ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులపై దాడులు జరిగాయి. 2014లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఢిల్లీలో ఉంటున్న ఈశాన్య రాష్ర్టాల విద్యార్థినుల్లో సుమారు 81 శాతం మంది ఈ విధమైన వేధింపులకు గురయ్యారు.

తాజాగా గుజరాత్ లో జరుగుతున్న దాడుల్లో రాజకీయ కోణం కూడా ఉంది. పలువురు నాయకులు ఈ దాడులను ఖండించారు. ఇక దాడులపై కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శలకు పాల్పడ్డాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జాతీయ స్థాయిలో కొన్ని అంశాలను ఎంచుకునే యోచన లో ఉంది. రామ మందిర నిర్మాణం, హిందూత్వ లాంటి అంశాలతో బీజేపీ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వాటిపై విమర్శలకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందుకే ఎక్కడిక్కడ ప్రాంతీయ అంశాలను ప్రధానంగా ఎంచుకొని బీజేపీ పై పోరాటం చేసే వ్యూహంతో ఉంది. అలాంటి సందర్భాల్లో గుజరాత్ తరహా అంశాలు కీలకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీలు కూడా స్థానికత అంశాన్ని ప్రధానంగా చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భాల్లో అగ్గి రాజేసేందుకు ఓ చిన్న సాకు దొరికితే చాలు...ఏ రాష్ట్రమైనా భగ్గుమనేందుకు. కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు లాంటి కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాల్లో భారతీయులంతా ఎక్కడైనా ఉపాధి పొందేందుకు రాజ్యాంగపరమైన హక్కు ఉంది. అదే సమయంలో వేలు, లక్షల సంఖ్యలో వలసలు కొనసాగితే మాత్రం సామాజిక, రాజకీయ అస్థిరతలు తలెత్తే అవకాశం కూడా ఉంది. అందుకే ఎక్కడికక్కడ స్థానికులు వలస పోవాల్సిన అవసరం లేని విధంగా విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories