బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ యుద్ధం..అధికారం ఆ పార్టీదే సర్వేలు..!

బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ యుద్ధం..అధికారం ఆ పార్టీదే సర్వేలు..!
x
Highlights

గుజరాత్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలిదశ ఎన్నికలు జరగనున్న 89 నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు...

గుజరాత్ అసెంబ్లీ తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. తొలిదశ ఎన్నికలు జరగనున్న 89 నియోజకవర్గాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. 977 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. జమనగర్ నుంచి అత్యధికంగా 27మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. ఝగాడియా, గండేవి నుంచి అత్యల్పంగా ముగ్గురు అభ్యర్ధులే పోటీలో ఉన్నారు. సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లోని 89 నియోజకవర్గాల్లో రెండు కోట్ల 12లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఐదోసారీ అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ.. 22 ఏళ్ల తర్వాత మళ్లీ పవర్ లోకి రావాలని కాంగ్రెస్‌ భావిస్తుండటంతో ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. బీజేపీ మొత్తం 89 నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ రెండు స్థానాలు మినహా 87 స్థానాల్లో పోటీ చేసింది. బీఎస్పీ 64చోట్ల, ఎన్సీపీ 30 స్థానాల్లో పోటీపడుతున్నాయి.

ఇటు తొలిదశ ఎన్నికల్లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేలనుంది. ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని వెస్ట్ రాజ్‌కోట్‌ నుంచి బరిలో నిలవగా.. కాంగ్రెస్‌ సీనియర్ నేతలు శక్తి సిన్హ్‌ గోహిల్‌, మండ్వి నుంచి.. పరేశ్‌ ధనానీ, అమ్రేలీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ ప్రచారం సాగింది. మరోవైపు, సూరత్‌లోని రెండు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల తీర్పు కీలకంకానుంది.గుజరాత్ ఎన్నికలు ప్రధాని మోడీకి ప్రతిష్టాత్మకం కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌ గాంధీ పనితీరుకు ఈ ఎన్నికలు పరీక్షగా నిలవనున్నాయి. బీజేపీకి కంచుకోట సూరత్‌లో ఈసారి ఆ పార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, ఉద్యోగాలు కోల్పోవడం, ధరల పెరుగుదల, పాటిదార్ల ఉద్యమం ఇలా ఒకదాని తర్వాత మరొక పరిణామంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ 16కు 16 సీట్లు గెలిచింది. కాని ఈసారి సగానికి పైగా సీట్లు బీజేపీ కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రసుత్తం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.

ఇదిలావుంటే గుజరాత్‌ మోడీ సొంత రాష్ట్రం కావడంతో కాషాయ దళం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మోడీ ప్రధాని అయిన తర్వాత గుజరాత్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడం మరో విశేషం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం, పాటిదార్‌ ఉద్యమం బీజేపీకి ప్రతికూలంగా మారాయి. అయితే, ఈ పరిస్థితిని కాంగ్రెస్‌ ఎంత వరకూ అనుకూలంగా మలుచుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తోంది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ పుంజుకుంటున్నా.. అధికారం మాత్రం బీజేపీదేనని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్‌లో రెండు దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న బీజేపీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గేందుకు ఆ పార్టీ రకరకాల ఆయుధాలను ప్రయోగించింది. గుజరాత్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే మళ్లీ మత కల్లోలాలు జరుగుతాయని, హిందువులు మైనారిటీలో పడిపోతారని.. కమలదళం ప్రచారం చేసింది. ప్రజలు ఈ ప్రచారానికి ఎంత మాత్రం స్పందిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇవన్నీ వాడేసిన కార్డులే అయినా.. ఈసారి ప్రజల తీర్పు ఎలా ఉండనుందో ఈనెల18న తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories