రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చిన పెథాయ్

x
Highlights

వరి కంకులు వంగాయి, కోసిన వరి నీటిపాలైంది. అరటి గెలలు నేలరాలాయి, మిరప పంట మునిగింది, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఎటు చూసిన నష్టం రైతన్నకు ఎంత...

వరి కంకులు వంగాయి, కోసిన వరి నీటిపాలైంది. అరటి గెలలు నేలరాలాయి, మిరప పంట మునిగింది, కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. ఎటు చూసిన నష్టం రైతన్నకు ఎంత కష్టం. పెథాయ్ తుపాను బీభత్సం అన్నదాతలను నిండా ముంచింది. ఆదుకోవాలంటూ అన్నదాతలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో వేలాది ఎకరాలు వరిచేలు నీట మునిగాయి. కొద్ది రోజుల్లో ఇంటికి చేరాల్సిన ధాన్యం తడిసి ముద్దయింది. సముద్ర తీర ప్రాంతం నరసాపురం లోనే కాదు ఏలూరు సమీపంలో వరి చేలు ఎడతెరిపి లేని వర్షాలకు నీట మునిగాయి. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. ఎకరానికి 35 వేలు నుంచి 40వేల వరకు తాము పెట్టుబడి పెట్టామని ఆ డబ్బులు చేతికి వస్తాయో, రాదో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కృష్ణా జిల్లాలో వరిపంట నీటిపాలైంది. పెడన నియోజకవర్గం బంటుమిల్లి, పెదతుమ్మిడి, చిన్నగొల్లపాలెం, జింజేరు , కృత్తివెన్ను, పెడన, చెన్నూరు, గురజ ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట చేలలో నిండిన నీటిని పంపుసెట్ల ద్వారా తోడుకుంటున్నారు. నూజివీడులో మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగ్రంచిప్రోలు, తిరువూరులో పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పరిహారం చెల్లించాలని రైతులు వేడుకుంటున్నారు. ఎకరానికి 35 వేలు నుంచి 40వేల వరకు తాము పెట్టుబడి పెట్టామని ఆ డబ్బులు చేతికి వస్తాయో, రాదో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో పెథాయ్ తూఫాన్ రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. తుఫాను ప్రభావంతో కురిసిన వర్షం ఈదురు గాలులకు వేల ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. నాలుగు నెలలుగా కష్టపడి పండించిన పంట కాస్త చేతికి వచ్చే సరికి తుఫాను రైతాంగాన్ని నట్టేట ముంచింది. పిఠాపురం,యు. కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలలో అరటి తోటలు నేలకొరిగాయి. వరి పంట పనులు నీట మునిగాయి. ఉల్లి, మిరప, టమాటా వంటి కూరగాయలతో పాటు పత్తి, మినప మరికొన్ని పంటలకు భారీ నష్టం వాటిల్లింది. తుపాను ఎఫెక్ట్ తో కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. నష్టం అంచనా వేసేందుకు అధికారులు నష్టం వాటిల్లిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

కొత్తపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పంటలు పాడైపోగా, విద్యుత్తు స్తంబాలు, చెట్లు నెలకొరిగాయి. రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, ఆలమారు మండలాల్లో అరటి తోటలు గాలికి నేలనెంటాయి.విద్యుత్తు స్తంబాలు విరిగిపోవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లంకల్లో కొబ్బరిచెట్లు సైతం పడిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పెథాయ్ తుఫాన్ ప్రభావం పడింది జిల్లాలోని డెల్టా ప్రాంతంలో వరిపంట నీటమునిగింది. చేతి వచ్చిన పంట నీటమునిగిపోవడంతో తడిసిన ధాన్యానికి కనీసం మద్దతు కల్పించాలని ప్రభుత్వం తమను అదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

పెతాయ్ తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలో మూగ జీవాలు మృతి చెందాయి. జిల్లాలోని కురుపాం మండలం, గుమ్మలక్ష్మీపురం మండలంలో తుఫాన్ ప్రభావంతో చలి తీవ్రత పెరగటంతో 32 మూగ జివాలు మృత్యవాత పడ్డాయి. పెథాయ్ తుఫాన్ అనంతరం జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగి జిల్లా వాసులతో పాటు మూగ జీవాలు అల్లడుతూ మృత్యువాత చెందుతున్నాయి. దీంతో పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటమునగడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. పంట నష్టం చెల్లించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories