ప్రపంచకప్ హాకీలో నయా చాంపియన్

ప్రపంచకప్ హాకీలో నయా చాంపియన్
x
Highlights

భారత్ వేదికగా ముగిసిన 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీ ద్వారా బెల్జియం రూపంలో సరికొత్త చాంపియన్ వెలుగులోకి వచ్చింది. మూడుసార్లు చాంపియన్ హాలెండ్,...


భారత్ వేదికగా ముగిసిన 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీ ద్వారా బెల్జియం రూపంలో సరికొత్త చాంపియన్ వెలుగులోకి వచ్చింది. మూడుసార్లు చాంపియన్ హాలెండ్, రెండుసార్లు విజేత ఆస్ట్రేలియాల ఆధిపత్యానికి బెల్జియం గండికొట్టింది. మరోవైపు 5వ ర్యాంకర్, ఆతిథ్య భారత్ టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకోడంలో విఫలమయ్యింది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గత మూడువారాలుగా జరిగిన 2018 ప్రపంచకప్ హాకీ టోర్నీ అట్టహాసంగా ముగిసింది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియం అగ్రశ్రేణి జట్లను కంగు తినిపించి తొలిసారిగా ప్రపంచ టైటిల్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది.ప్రపంచ హాకీలో మొదటి 16 టాప్ ర్యాంక్ జట్లు పాల్గొన్న ఈటోర్నీని గ్రూప్ లీగ్ కమ్ నాకౌట్ తరహాలో నిర్వహించారు. ఆసియా నుంచి భారత్, లాటిన్ అమెరికా నుంచి అర్జెంటీనా, ఓషియానా నుంచి ఆస్ట్రేలియా జట్లు నాకౌట్ రౌండ్ చేరుకోగా మిగిలిన స్థానాలను యూరోపియన్ జట్లు జర్మనీ,హాలెండ్, ఇంగ్లండ్, బెల్జియం జట్లు అర్హత సంపాదించాయి.

ప్రపంచ 5వ ర్యాంకర్, ఆతిథ్య భారత్ క్వార్టర్ ఫైనల్లోనే హాలెండ్ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఆసియాజట్ల ఉనికే లేకుండా పోయింది. చివరకు టాప్ ర్యాంకర్ ఆస్ట్రేలియా, రెండో ర్యాంకర్ హాలెండ్, మూడో ర్యాంకర్ బెల్జియం, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరాయి. తొలిసెమీఫైనల్లో 3వ ర్యాంకర్ బెల్జియం 6-0 గోల్స్ తో ఇంగ్లండ్ ను చిత్తు చేసి తొలిసారిగా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా- హాలెండ్ జట్ల మధ్య నువ్వానేనా అన్నట్లుగా సాగిన పోటీ నిర్ణితసమయంలో రెండుజట్లు చెరో రెండు గోల్స్ చేసి 2-2తో సమఉజ్జీగా నిలవడంతో..
పెనాల్టీ షూటౌట్ పాటించారు.

చివరకు షూటౌట్ ద్వారా ఆస్ట్రేలియాను అధిగమించడం ద్వారా హాలెండ్ ఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది. సెమీఫైనల్స్ ఓటమితో ప్రపంచ కప్ హ్యాట్రిక్ కొట్టాలన్న కంగారూ ఆశలు అడియాసలుగా మిగిలిపోయాయి. ఇక మూడుసార్లు విజేత హాలెండ్, తొలిసారిగా ఫైనల్ చేరిన బెల్జియం జట్ల టైటిల్ సమరం సమఉజ్జీలు సమరంలానే సాగింది. నిర్ణితసమయంలో రెండుజట్లూ గోలు చేయలేకపోడంతో షూటౌట్ పాటించారు. హోరాహోరీగా సాగిన షూటౌట్లో బెల్జియం 3-2తో హాలెండ్ ను అధిగమించి తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీ అందుకొంది. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన బెల్జియం రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచకప్ బంగారు పతకం అందుకొని ఆస్ట్రేలియా, జర్మనీ, హాలెండ్ లాంటి మేటిజట్ల సరసన నిలిచింది.

రెండుసార్లు విజేత, ప్రపంచ నంబర్ వన్ జట్టు ఆస్ట్రేలియా చివరకు కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఒడిషా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ టోర్నీకి...భారత క్రికెట్ దేవుడు మాస్టర్ సచిన్ టెండుల్కర్ ప్రత్యేకఆతిథ్యగా హాజరై క్రికెటేతర క్రీడలంటే తనకు ఎంత అభిమానమో మరోసారి చాటుకొన్నాడు. 43 సంవత్సరాల విరామం తర్వాత మరోసారి ప్రపంచ టైటిల్ సాధించాలన్న భారత్ ఆశలు..క్వార్టర్స్ ఓటమితో అడియాసలుగానే మిగిలిపోయాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories