గౌరీ లంకేశ్ కలం మూగపోయింది

గౌరీ లంకేశ్ కలం మూగపోయింది
x
Highlights

ఆమె మరణించింది.. కానీ ఆమె రగిలించిన స్ఫూర్తికి మాత్రం చావులేదు.. యావత్ దేశాన్ని కదిలించిన ఆమె మరణంపై స్పందించని ప్రభుత్వం లేదు, గళమెత్తని సంఘం లేదు....

ఆమె మరణించింది.. కానీ ఆమె రగిలించిన స్ఫూర్తికి మాత్రం చావులేదు.. యావత్ దేశాన్ని కదిలించిన ఆమె మరణంపై స్పందించని ప్రభుత్వం లేదు, గళమెత్తని సంఘం లేదు. బెంగళూరులో జరిగిన హత్య దేశమంతా పెను సంచలనం సృష్టించింది.

ఎవరీ గౌరీ ?
గౌరీ లంకేష్, కర్ణాటకలో పెద్ద పేరున్న జర్నలిస్టు. బెంగళూరు, ఢిల్లీలో పలు వార్తాపత్రికల్లో వివిధ హోదాల్లో గౌరీ లంకేష్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె రచయిత్రి, సాహితీవేత్త, పాత్రికేయురాలు, మత సామరస్య వేదిక నాయకురాలు, సామాజికవేత్త, ఆధునిక భావజాలమున్న మహిళగా సుపరిచితురాలు. 55 ఏళ్ల వయస్సులోకూడా చలాకీగా, యువతతో కలిసి పలు వివాదాస్పద అంశాలపై గళమెత్తిన కంఠం ఆమెకే సొంతం, సంప్రదాయవాదులపై కత్తి కట్టి, అభ్యుదయ భావజాలంతో ఝుళిపించిన కలం ఆమె సొంతం. ఆమె నోరు విప్పితే నిప్పు కణికలే, ఆమె కలం కదిలితే నిజాల నిప్పుల కుంపటి రగులుతుంది. ఆమె చేసిన వ్యాఖ్యలు, రాసిన రాతలు నేటికీ రావణ కాష్టంలా కాలుతూనే ఉన్నాయంటే ఆమె పెన్ పవర్ ఏంటో అర్థమవుతుంది.

బార్న్ జర్నలిస్ట్..
ప్రముఖ జర్నలిస్ట్ లంకేష్ కుమార్తెగా చిన్నప్పటినుంచీ జర్నలిజంపై పట్టును కొనసాగించి, తన తండ్రి పేరుతోనే స్వయంగా గౌరీ లంకేష్ పత్రికను కన్నడ భాషలో ప్రారంభించారు. ఈ పేపర్‌లో ఒక్క ప్రకటన కూడా లేకుండా కేవలం వార్తలను మాత్రమే ప్రచురించి జర్నలిజంలో సరికొత్త ఎత్తులను అధిరోహించారు. తాను రాసే ప్రతి వార్త సమాజానికి ఉపయోగపడేలా, సాక్షాధారాలతో సహా రుజువు చేస్తూ పత్రికా ఉద్యమాన్ని నెత్తిన ఎత్తుకున్న గౌరీ లంకేష్ తనకు ఎదురైన సవాళ్లను ఎన్నడూ ఖాతరు చేయలేదు. దీంతో ఆమె దారికి ఏ సమస్యలూ అడ్డురాలేదు. అడ్డుదగిలిన సమస్యలు వాటంతట అవే పక్కకు జరిగాయి. సంప్రదాయ జర్నలిజానికి ఎదురీదినా ప్రజల ఆదరణను, గౌరవాన్ని చూరగొన్న విశ్వసనీయమైన, నిఖార్సైన జర్నలిజాన్ని కన్నడ పాఠక లోకానికి రుచి చూపిస్తూ సాగింది గౌరీ పోరాటం.

సంప్రదాయవాదులపై కత్తి కట్టి...
సొంత పత్రిక పెట్టకముందు.. ఇంగ్లీష్, కన్నడ పత్రికల్లో పనిచేస్తూ, ప్రజాసమస్యలపై ఘాటుగా కథనాలను రిపోర్ట్ చేశారు. ఇక పండుగలు, పెళ్లిళ్లు, పూజలు, మతవిశ్వాసాల పేరుతోసాగే మూఢనమ్మకాలపై సమరశంఖం ఊది ఉద్యమించారు. దీంతో సంప్రదాయవాదులు ఆమెపై కన్నెర్ర చేశారు. బీజేపీ, హిందుత్వ వాదులనుంచి వచ్చిన గ ట్టి వ్యతిరేకతను తట్టుకుని నిలబడ్డారు. అయినా తన పంథాను మార్చుకోలేదు. తన కలానికి మరింత పదునుపెడుతూ సంప్రదాయవాదుల సిద్ధాంతాలను బుల్డోజ్ చేస్తూ, యువతనుకూడా తన బాటలో పయనించేలా మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థిసంఘం నేత కన్హయ్య కుమార్ వంటివారు ఎంతోమంది యువ ఉద్యమకారులు దేశవ్యాప్తంగా ఈమెకు శిష్యగణంగా ఉన్నారు.

నక్సలైట్ల కోసం సోదరుడితో విభేదాలు...
ఇక నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఆమె చేసిన కృషి విశిష్టమైంది. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు పోయినట్టు అనుమానాలున్నాయి. మావోల సానుభూతిపరురాలిగా పేరుగాంచారు, లెఫ్ట్ భావజాలంతో సంప్రదాయవాదులకు కంట్లో నలుసుగా మారారు. నక్సలైట్లకు మద్దతుగా వార్తలు రాసేందుకు ఆమె ఏకంగా సొంత సోదరుడితోనే న్యాయపోరాటం చేశారు. ఆఖరుకి ఆమె నక్సలిజాన్ని వ్యాప్తి చేస్తోందంటూ సోదరుడు ఇంద్రజిత్ ప్రెస్ మీట్ పెట్టాడంటే వారిమధ్య ఏస్థాయిలో సిద్ధాంతాలపై పోరాటం సాగిందో అర్థమవుతుంది. అంతేకాదు అంతవరకూ వీరిద్దరూ కలిసి నిర్వహించిన లంకేష్‌పత్రిక కాకుండా గౌరీ లంకేష్ పత్రికెను సొంతంగా ప్రారంభించి, నక్సలైట్లపట్ల తనకున్న సానుభూతిని చాటుకున్నారు. ఇక కులవ్యవస్థను, అగ్రవర్ణాల పెత్తనం, సాహిత్య ప్రపంచంలో దళిత సాహిత్యాన్ని తొక్కేస్తున్న విధానాలను ఎండగట్టడం గౌరీకి అత్యంత ప్రాధాన్యాంశం. అందుకే గౌరీపై కర్నాటక బ్రాహ్మణ సంఘం పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టింది.

ఆర్నెల్ల జైలు, ఆపై బెయిలు...
2008లో కర్నాటక బీజేపీ నేతల ముఠా ఒకటి బలవంతపు వసూళ్లకు పాల్పడిందని, ఒక నగల వ్యాపారిని బెదిరించి, డబ్బు తీసుకున్నారంటూ సాక్ష్యాధారాలతో వార్త ప్రచురించారు గౌరీ. దీంతో ఈ వార్తలపై రెండు పరువునష్టం కేసుల్లో కోర్టు గౌరీని దోషిగా పేర్కొంది. బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బీజేపీ నేత ఉమేష్‌లు వేసిన పరువునష్టం కేసుల్లో ఆరు నెలల జైలు శిక్ష పడినప్పటికీ అదే రోజు కోర్టు ఆమెకు బెయిలు మంజూరు చేసింది. అంతేకాదు బీజేపీ నేతలది తాత్కాలిక విజయం మాత్రమేనని గర్జించిన గౌరీ, వీటిని పై కోర్టులో సవాలు చేయనున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.

భయం అంటే పరిచయం లేదామెకు..
భయం అంటే అస్సలు పరిచయం లేని వ్యక్తి గౌరీ లంకేష్. విద్యాధికురాలు, తాను నమ్మిన సిద్ధాంతాలకు, విలువలకు ప్రాణమిచ్చే సమున్నత వ్యక్తి. చివరికి ప్రాణత్యాగానికి దారి తీసినా ఆమె ఆఖరి శ్వాస వరకూ బెదరలేదు సరికదా ఆఖరి గడియవరకూ సంఘం, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, మూఢనమ్మకాలు, మత విశ్వాసాలపై పోరాటాన్ని కొనగాస్తూనే తనువు చాలించారు. కన్నడ పత్రిక ‘గౌరీ లంకేష్ పత్రికె’కు ఎడిటర్‌గా సెన్సేషనల్ వార్తలను ప్రచురిస్తూ వచ్చారు. నాస్తికురాలిగా, రేషనలిస్టుగా ఆమెపై ఎన్ని కేసులు.. ఏ స్థాయివారు పెట్టినా ఆమెను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోగా, సాహసోపేతమైన విలేకరిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే అకాలమరణంపాలై తనువు చాలించారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో సాగిన ఆమె అంత్యక్రియల తర్వాత.. సంప్రదాయబద్ధంగా ఎటువంటి కర్మకాండలు చేపట్టడంలేదంటూ.. గౌరీ సిద్ధాంతాలను ఆమె మరణం తర్వాతకూడా పాటించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు.

కర్ణాటకలో ఏం జరుగుతోంది ?
గౌరీ హత్యోదంతంపై స్పందించిన బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి, అసలు కర్ణాటకలో ఏం జరుగుతోందని, దీనిపై తక్షణం స్పందించకపోతే, 1930లో షికాగో నగరంలా బెంగళూరు మారుతుందని హెచ్చరించారు. గౌరీ హత్య సిద్ధరామయ్య సర్కారుకి, ప్రతిపక్ష బీజేపీకి చాలా సవాళ్లే విసురుతోంది. బెంగళూరు నడిబొడ్డు ఉన్న రాజరాజేశ్వరి నగర్‌లో ఆమె సొంత ఇంటివద్దే కాల్పులు జరిగాయంటే అసలు సిటీ ఆఫ్ గార్డెన్స్‌లో ప్రజలకున్న రక్షణ ఏపాటిదంటూ సిలికాన్ సిటీలోని సెలబ్రిటీలు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

భావప్రకటన వర్సెస్ కాషాయదళం...
భావప్రకటనకు, సంప్రదాయ వాదుల కాలం చెల్లిన సిద్ధాంతాలకు మధ్య సాగుతున్న పోరులో కల్బుర్గి, గౌరీవంటువారు భౌతికంగా బలయ్యారని.. తమ సిద్ధాంతాలతో విభేదిస్తే మట్టుబెడతారా అంటూ రేషనలిస్టులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు నిప్పులాంటి నిజాలను జర్నలిజంలో జొప్పించిన జర్నలిస్టులకు చివరికి మిగిలేది ఇదేనా అంటూ జేడే, వీరబోయిన యాదగిరితోపాటు దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో జరిగిన పలువురు జర్నలిస్టులు హత్యలు శేష ప్రశ్నలు మిగులుస్తున్నాయి.
కె.భార్గవి

ఏం జరిగినా మాపైనేనా?
ప్రముఖ కన్నడ సాహితీవేత్త ఎంఎం కల్బుర్గి హత్యకు, గౌరీ హత్యకు పోలికలున్నాయని బెంగళూరు పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగిన తీరు, హత్యకు ముందు సోషల్ నెట్‌వర్క్‌లో గౌరీపై వచ్చిన ఘాటు విమర్శలు అన్నీ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. అయితే వామపక్ష భావజాలమున్న నేతలకు ఎప్పుడు ఏం జరిగినా తమనే టార్గెట్ చేయడం సరికాదని హిందుత్వశక్తులు కూడా వాదిస్తున్నాయి.

అసలు గౌరీ హత్యకు కారణాలేంటి, హత్యకు పాల్పడే అవసరం ఎవరికుంది వంటి విషయాలను అన్వేషించకుండా తమపై నేరారోపణ చేయడంపై కాషాయనేతలు గుర్రుగా ఉన్నారు. ఇంకా విచారణ జరగలేదు, అయినా స్వయంగా కర్ణాటక హోంమంత్రే ఇది సంప్రదాయవాదుల పనేనంటూ పేర్కొన్నారంటే అర్థమేంటి అని కన్నడ హిందూ సంఘాలు ధ్వజమెత్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories