ఇక తన గురి హస్తినపీఠమేనా.. రాహుల్‌ గాంధీ సమర సంకేతం

ఇక తన గురి హస్తినపీఠమేనా.. రాహుల్‌ గాంధీ సమర సంకేతం
x
Highlights

మూడు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌కు ఎంత హుషారునిచ్చాయంటే, ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఫుల్‌ జోష్‌గా...

మూడు రాష్ట్రాల ఫలితాలు కాంగ్రెస్‌కు ఎంత హుషారునిచ్చాయంటే, ఢిల్లీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఫుల్‌ జోష్‌గా కనిపించారు. బీజేపీకి గట్టిపట్టున్న మూడు హిందీ రాష్ట్రాల్లో విజయం సాధించినందుకు, ముఖంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడింది. మాటిచ్చి తప్పిన మోడీ, మూల్యం చెల్లించుకున్నారని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు మోడీపై విశ్వాసం కోల్పోయారని వ్యాఖ్యానించి, ఇక తన గురి హస్తిన పీఠమేనని సమర సంకేతాలు పంపారు.

రాహుల్‌ ఇంత విజయోత్సాహంగా ఉండటంలో ఎలాంటి ఆశ‌్చర్యంలేదు. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రం, కాంగ్రెస్‌ కోల్పోతోందని బీజేపీ నేతలు, విమర్శకులు వ్యాఖ్యానించారు. 2014 తర్వాత మోడీ వర్సెస్ రాహుల్‌గా సాగిన ప్రతి ఎన్నికల్లో ఓడిపోతున్నాడని విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోనూ మోడీ వర్సెస్ రాహుల్‌గా ఎలక్షన్స్ సాగాయి. అందుకే మోడీతో తలపడి, మూడు రాష్ట్రాలను గెలుచుకొచ్చానని అన్నట్టుగా రాహుల్‌ కాన్పిడెంట్‌గా మాట్లాడారు. ఈ విజయం ఢిల్లీకి రాచబాట పరుస్తుందనుకుంటున్నారు రాహుల్. ఎందుకంటే ఈ మూడు రాష్ట్రాలే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రాణవాయువునిచ్చాయి. ఇప్పుడు ఆ ఆక్సిజన్‌ను గుప్పిటపట్టేందుకు, ఈ విక్టరీ మార్గం సుగమం చేసిందని, రాహులే కాదు, కాంగ్రెస్‌ కార్యకర్తలూ సంబరపడుతున్నారు.

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌లో మొత్తం ఎంపీ స్థానాలు 65. 2014లో 65లో 62 స్థానాలు సాధించి, ఢిల్లీ పీఠం కొల్లగొట్టింది బీజేపీ. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాబట్టి, ఆ 62 సీట్లకు ప్రమాదం ఏర్పడింది. ఇదే రేంజ్‌లో కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిస్తే, బీజేపీ బలం తగ్గిపోతుంది....కాంగ్రెస్‌ బలగం పెరుగుతుంది...మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సాధించిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే, దాదాపు 44 సీట్లను బీజేపీ కోల్పోతుందని, ఆ సీట్లు కాంగ్రెస్‌ చేజిక్కించుకుంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అంటే ఈ పరిణామాలు మోడీకి, ప్రమాద సంకేతాలు పంపుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగి పార్టీ, బీఎస్పీ, స్వతంత్రులు పోటీ చేసి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చినా 10 శాతం భారీ మార్జిన్‌తో గెలిచింది కాంగ్రెస్. అలాగే రాజస్థాన్‌లో ఆరుశాతం ఓట్ల తేడాతో విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లో 4 శాతం ఓటింగ్ కోల్పోయింది బీజేపీ. ఇలా గణనీయమైన స్థాయిలో ఓట్లు కోల్పోవడం బీజేపీకి డేంజర్‌ బెల్స్ మోగిస్తుంటే, కాంగ్రెస్‌కు వెడ్డింగ్‌ బెల్స్ మోగుతోంది. యూపీలోనూ ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్‌తో జతకడితే దాదాపు 50 సీట్లు గల్లంతవుతాయని పరిణామాలు నిరూపిస్తున్నాయి.

అయితే బీజేపీకి కీలకమైన మూడు హిందీ రాష్ట్రాల్లో గెలవగానే, కాంగ్రెస్‌కు పండగ కాదు. ఢిల్లీ పీఠం చేజిక్కించినట్టేనని సంబరపడితే మొదటికే మోసం. ఎందుకంటే చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రులు భారీగా ఓట్లు సాధించారు. వీరందర్నీ కలుపుకుంటేనే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. మిత్రులను కలుపుకుపోవాలి. పార్లమెంట్‌ ఎన్నికలకు మరికొద్ది నెలల్లో నగారా మోగనున్న తరుణంలో, ఫ్రంట్‌ కట్టడం కాంగ్రెస్‌ ముందున్న సవాలు. మరి మూడు రాష్ట్రాల్లో విజయపతాక ఎగరేసిన కాంగ్రెస్‌ గొడుకు కిందకు, మిగతా ప్రాంతీయ పార్టీలు వస్తాయా? రాహుల్‌ నాయత్వాన్ని సమర్థిస్తాయా?

Show Full Article
Print Article
Next Story
More Stories