ఫిట్‌లెస్‌ ఆర్‌టీఏ... హెచ్‌ఎంటీవీ ఇన్వెస్టిగేషన్‌

ఫిట్‌లెస్‌ ఆర్‌టీఏ... హెచ్‌ఎంటీవీ ఇన్వెస్టిగేషన్‌
x
Highlights

ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులదే రాజ్యం. ఇంకా చెప్పాలంటే పాలు నీళ్లులా కలిసిన అవినీతి బంధం. సిబ్బంది, అధికారులతో ఏజెంట్ల మమేకం అవుతారు. ముడుపులు లేనిదే...

ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులదే రాజ్యం. ఇంకా చెప్పాలంటే పాలు నీళ్లులా కలిసిన అవినీతి బంధం. సిబ్బంది, అధికారులతో ఏజెంట్ల మమేకం అవుతారు. ముడుపులు లేనిదే ఎంవీఐలు సంతకాలు పెట్టరు... నిబంధనలు బేఖాతరు చేస్తూ నిర్భయంగా వ్యవహారం సాగించేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఆర్టీఏ కార్యాలయం చూసినా ఏమున్నది గర్వకారణం. యంత్రాంగం సమస్తం అవినీతి పారాయణత్వం... అన్నట్టుగా నడుస్తోంది. దీనిపైనే హెచ్‌ఎంటీవీ ఫోకస్‌ పెట్టింది. అవినీతి పట్టను బద్ధలు కొట్టింది. ఒకరోజంతా తిరుమలగిరిలోని ఆర్‌టీఏ కార్యాలయంలో స్పై కెమెరాతో మకాం వేసిన హెచ్‌ఎంటీవీ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌... అక్కడ జరుగుతున్న అసలు రంగును వెలికితీసింది. క్యాబిన్‌లు దాటని ఎంవీఐలు... ఏజెంట్లతో నడిపిస్తున్న కథను బట్టబయలు చేసింది.

తిరుమలగిరిలోని రవాణా శాఖ కార్యాలయం అవినీతి దందాకు కేంద్రం. ఆర్‌టీఏ అంటేనే అవినీతికి కేరాఫ్‌అడ్రస్‌ అన్నంతగా మారిపోయింది ఇక్కడి పరిస్థితి. అధికారులు.. ఏజెంట్లు, దళారులతో కలిసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినా వసూల్‌ రాజాలు తమదైన శైలిలో అక్రమాలకు పాల్పడుతున్న వైనాన్ని హెచ్‌‌ఎంటీవీ అత్యంత సాహసంగా తన కెమెరాలో బంధించింది. ప్రతి పనికి ఫిక్స్‌డ్‌ ధర నిర్ణయించి వాహనదారుల జేబులను కొల్లగొడుతున్న వైనాన్ని బట్ట బయలు చేసింది. ఈ దందాలో అధికారులు వెనకుండి చక్రం తిప్పుతుండగా, దళారులు దర్జాగా వసూళ్లు సాగిస్తున్నారన్న చీకటి కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. కార్యాలయ క్యాబిన్‌లు దాటకుండానే ఎంవీఐలు సంతాకలు పెట్టేస్తున్నారు. దళారులు ఏది చెబితే దానికే సై అంటున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సు పర్‌ఫెక్ట్‌గా ఉందంటూ సరిఫ్టికెట్‌ ఇచ్చిన దళారి... హెచ్‌ఎంటీవీ ప్రతినిధి నుంచి మూడు వేల రూపాయలు దండుకుంటూ కెమెరాకు అడ్డంగా చిక్కారు.

పిల్లలు యూనిఫాం వేసుకుని స్కూలు బ‌స్సు ఎక్కుతుంటే మురిసిపోతాం. కానీ ఆ బ‌స్సులో ఎన్ని లోపాలున్నాయో వారికి మనకు తెలియదు. లైసెన్సు లేని డ్రైవ‌ర్లు, ఫిట్‌నెస్‌ లేని బ‌స్సులు, క‌నీస భద్రతా ప్రమాణాలు పాటించని బ‌స్సులు.. ఇదీ మ‌న బ‌డి బ‌స్సుల ప‌రిస్థితి. మోటార్ వెహిక‌ల్ చ‌ట్టాలు, జీవోలు ఎన్నున్నా ర‌వాణా శాఖ క‌క్కుర్తి ముందు అన్నీ బ‌లాదూర్. ఇవన్నీ గాలి మాటలు కాదు... హెచ్‌ఎంటీవీ పరిశోధనలో తేలిన నిజాలు. మామూలు బ‌స్సుల కంటే స్కూలు బ‌స్సుల‌కు ఎక్కువ రూల్స్ ఉంటాయి. కానీ బ్రేకులు కూడా లేని డొక్కు బ‌స్సు తెచ్చినా జ‌స్ట్, 2 వేలు మనవి కావ‌నుకుంటే, ఫిట్‌నెస్‌ స‌ర్టిఫికెట్ ఈజీగా వచ్చేస్తోంది.

నిజానికి ఓ స్కూల్ బస్సుకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే... బస్సుకు హెడ్‌లైట్లు, హారన్, విద్యార్థులు కూర్చునేందుకు అనువుగా సీట్లు, అన్ని కిటికీలకు అద్దాలు ఉన్నాయో లేదో చూడాలి. విద్యార్థులు కిటికీలోంచి చేతులు, తల బయటపెట్టకుండా ప్రతి కిటికీని అనుసంధానం చేస్తూ సేఫ్టీ రాడ్లను అమర్చాలి. డ్రైవర్‌కు ఇరువైపుల బస్సుకు లోపల బయట అద్దాలు అమర్చాలి. ప్రయాణ సమయంలో డ్రైవర్.... లోపల ఉన్న విద్యార్థులను, రోడ్డుపై వస్తున్న వాహనాలను గమనించేలా అద్దాలను ఏర్పాటు చేయాలి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా... ఆ మాటకొస్తే... అసలు అక్కర్లేదన్నట్టుగా సాగుతుంది వ్యవహారం ఇక్కడ.

ప్రతీ రోజూ ఆర్టీఏ ఆదాయం... ఆ సెంటర్‌ను బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఏజెంట్లు, కింది స్థాయి సిబ్బంది ఆదాయానికి ఢోకాలేదు. ఇలా మొత్తం మీద ఆర్టీఏ కార్యాలయాలు.. పైసా వసూల్ కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఇదంతా బహిరంగ రహస్యమే. అయినా ఎందుకనో మన ప్రభుత్వాలు మాత్రం వీరిని కట్టడి చేయలేకపోతున్నాయి. కనీసం అరికట్టలేకపోతున్నాయి. కనీసం ఇప్పటికైనా సర్కార్‌ స్పందిస్తుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories