ఫైర్‌ బ్రాండ్‌ రాములక్క... ఇప్పుడు కాంగ్రెస్‌ తురుపుముక్క!!

ఫైర్‌ బ్రాండ్‌ రాములక్క... ఇప్పుడు కాంగ్రెస్‌ తురుపుముక్క!!
x
Highlights

ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ, తెలంగాణ ఎన్నికల తెరపై ధూంధాం చేసేందుకు సిద్దమయ్యారు. మొన్నటి వరకు అలకపాన్పుపై ఉన్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా...

ఫైర్‌ బ్రాండ్‌ రాములమ్మ, తెలంగాణ ఎన్నికల తెరపై ధూంధాం చేసేందుకు సిద్దమయ్యారు. మొన్నటి వరకు అలకపాన్పుపై ఉన్న విజయశాంతికి, స్టార్‌ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగించడంతో, ఇక చెలరేగిపోవాలని డిసైడయ్యారు. ఊరూవాడా తిరుగుతూ, కేసీఆర్‌కు దీటుగా విమర్శల బాణాలు సంధించాలని సిద్దమయ్యారు. మరి మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న రాములమ్మ, ఇక తెలంగాణ పోరులో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మారారు. సిల్వర్‌ స్క్రీన్‌పైనే కాదు, పొలిటికల్‌ స్క్రీన్‌పైనా విజయశాంతి తనదైన ముద్ర వేశారు. భావోద్వేగ ప్రసంగాలతో ఉర్రూతలూగించారు. మొదటి నుంచి తెలంగాణ నినాదంతో, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారు. అనేక పార్టీలు మారి, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు.

టీఆర్ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత విజయశాంతి హవానే నడిచింది. అన్నా చెల్లెల్లుగా జనంలో పేరు పొందారు. తెలంగాణ కోసం పార్లమెంట్‌లోనూ ఇద్దరూ గట్టిగా స్వరం వినిపించారు. అయితే, అన్నాచెల్లెళ్ల బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. టీఆర్ఎస్‌ నుంచి బయటకు వస్తున్నట్టు ఆమె ప్రకటించారు. అలాగే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. కానీ సరైన ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇవ్వలేదని, రాజీనామాను ఆమోదించలేదు స్పీకర్. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు విజయశాంతి.

2014లో తెలంగాణ కల సాకారం చేసిన కాంగ్రెస్‌కు కృతజ్నతలు తెలిపారు విజయశాంతి. అదే ఏడాది కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. బీజేపీ, తర్వాత తల్లితెలంగాణ, టీఆర్ఎస్‌, ఆ తర్వాత కాంగ్రెస్‌. అలా విజయశాంతి, రాజకీయ జీవితం రకరకాల పార్టీలు మారుతూ, రకరకాల మలుపులు తిరిగింది. నేడు కాంగ్రెస్‌లో కాస్త స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై ప్రశంసలు కురిపించి, 2014లో అదే పార్టీలో చేరారు విజయశాంతి. మెదక్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. తర్వాత సైలెంటయ్యారు.

అయితే, తెలంగాణపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టిపెట్టడం, రాహుల్ గాంధీ నాయకత్వ బాధ్యతలు తీసుకోవడంతో, మళ్లీ కాంగ్రెస్‌ వైపు నడిచారు విజయశాంతి. రాహుల్ సమక్షంలోనే మరోసారి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏమైందోకానీ ఆ తర్వాత రాములమ్మ మాత్రం, మళ్లీ పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగయ్యారు. చాలా రోజుల తర్వాత ఇటీవల బోనాల పండుగలో కనిపించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఇక రాములమ్మ మళ్లీ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీ ఇటీవలె తెలంగాణలో రెండురోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. కానీ విజయశాంతి మాత్రం రాహుల్ టూర్‌లో కనిపించలేదు.

తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల వేడి రాజుకుంది. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాలేకపోయామని కుమిలిపోతున్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది. సరికొత్త కూటములు కడుతోంది. ఇంతటి కీలకమైన సమయంలోనూ, రాములమ్మ కాంగ్రెస్‌కు చేదోడు, వాదోడుగా ఉండకుండా పంతాలకుపోయి దూరంగా ఉండటం కాంగ్రెస్ శ్రేణులను విస్తుపోయేలా చేసింది. అయితే, ఇఫ్పుడు స్టార్‌ క్యాంపెనర్‌గా కీలక బాధ్యతలు అప్పగించడంతో, ఫుల్‌ జోష్‌ మీద రాములమ్మ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories