ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిని ఒక్క‌టి చేసిన ఓటుకు నోటు కేసు

ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిని ఒక్క‌టి చేసిన ఓటుకు నోటు కేసు
x
Highlights

వాళ్లిద్దరూ పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులు... ఆమె అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఆయనేమో కల్వకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న...

వాళ్లిద్దరూ పోలీస్‌ శాఖలో ఉన్నతాధికారులు... ఆమె అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ ఆయనేమో కల్వకుర్తి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వీళ్లిద్దరూ పోలీస్‌ శాఖకే తలవంపులు తెచ్చారు. వివాహేతర సంబంధం పెట్టుకుని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్న ఏఎస్పీ సునీతారెడ్డికి కల్వకుర్తి సీఐ మల్లికార్జున్‌రెడ్డికి ఐదేళ్లుగా పరిచయం ఉంది. అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి అమెరికాలో ఉద్యోగం చేస్తుండగా ఆమె కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఇందూ ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ అపార్ట్‌మెంట్‌ 13వ ఫ్లోర్‌ నివసిస్తోంది. అయితే సీఐ మల్లికార్జున్‌రెడ్డి, ఏఎస్పీ సునీతారెడ్డి వివాహేతర సంబంధం గురించి రెండేళ్ల క్రితం సురేందర్‌రెడ్డికి తెలిసింది. కుటుంబ పెద్దల సమక్షంలో భార్యను నిలదీశాడు. దాంతో వాళ్లిద్దరూ ఇకమీదట అలా చేయబోమని చెప్పారు. అయితే రెండు నెలల నుంచి వీరిద్దరూ మళ్లీ సఖ్యతగా ఉంటున్నట్లు గుర్తించిన ఏఎస్పీ సునీతారెడ్డి భర్త సురేందర్‌రెడ్డి ఇద్దరూ కలిసుండగా రెడ్‌హ్యాండె‌డ్‌గా పట్టుకున్నాడు.

సీఐ మల్లికార్జున్‌రెడ్డితో తన భార్య సునీత చాటింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన సురేందర్‌‌‌రెడ్డి ఈ విషయాన్ని మల్లికార్జున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు, సునీతారెడ్డి తల్లికి, తన తల్లి దృష్టికి తీసుకెళ్లాడు. ఇందు ఫార్చ్యూన్‌ ఫీల్డ్స్‌ గేటెడ్‌ కమ్యూనిటీ హౌజ్‌లో సునీతారెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. సునీత తల్లి, అత్తలు సీఐ మల్లికార్జున్‌రెడ్డిని రోడ్డు మీద పరిగెత్తించి, చెప్పులతో తరిమికొట్టారు. ఆ తర్వాత సురేందర్‌రెడ్డి మాదాపూర్‌ డీసీపీ విశ్వప్రసాద్‌ను కలిసి సీఐ మల్లికార్జున్‌‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. సీఐ మల్లికార్జున్‌రెడ్డి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్యను లొంగదీసుకున్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌లో కోరారు.

ఏఎస్పీ సునీత భర్త సురేందర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీస్‌‌స్టేషన్‌లో కల్వకుర్తి సీఐపై ఐపీసీ 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఏఎస్పీతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. మల్లికార్జున్‌‌రెడ్డి, సునీత బాగోతంపై విచారణకు ఆదేశించారు. సీఐ మల్లికార్జున్‌‌రెడ్డిని ప్రశ్నించిన ఉన్నతాధికారులు అతనిపై సస్పెన్షన్‌ వేటేశారు. అలాగే ఏఎస్పీ సునీత స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేశారు. అయితే ఇది తమ కుటుంబ వ్యవహారమంటూ ఏఎస్పీ సునీత కేపీహెచ్‌బీ పోలీసులపై చిందులేసినట్లు తెలుస్తోంది. గొడవ జరుగుతున్న సమయంలో ఇంటికొచ్చిన పోలీసులను తన హోదాను ఉపయోగించి రెండుసార్లు పంపివేసింది.

అయితే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసే ఏఎస్పీ సునీతారెడ్డి, సీఐ మల్లికార్జున్‌రెడ్డిలను దగ్గర చేసినట్లు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా వీళ్లిద్దరి మధ్యా సాన్నిహిత్యం పెరిగినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాలు పంచుకునేవరకూ వెళ్లిన వీళ్లిద్దరి పరిచయం ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఏఎస్సీ సునీత తన భర్తతో కలిసి ఉండలేనని చెప్పినట్లు తెలుస్తోంది. సీఐ మల్లికార్జున్‌‌రెడ్డి కూడా తన భార్యతో సఖ్యంగా లేనని ఇద్దరం పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. అయితే విషయం ఉన్నతాధికారుల దృష్టి వరకూ వెళ్లడంతో ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రెడ్డిని ఏసీబీ నుంచి బదిలీ చేశారు. అయినా తరచూ కలుస్తుండటంతో అనుమానం వచ్చిన సునీత భర్త ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

ఏఎస్పీ సునీత, సురేందర్‌రెడ్డిలకు 2010లో వివాహమైంది. రెండేళ్ల క్రితం మనస్పర్థలు వచ్చాయి. అయితే 15రోజుల క్రితం ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. సురేందర్‌రెడ్డి ఇంటి నుంచి వెళ్లిపోయారు. అయితే అమెరికాకు వెళ్లినట్లే వెళ్లిన సురేందర్‌రెడ్డి భార్యకు తెలియకుండా హైదరాబాద్‌కు తిరిగొచ్చి వాళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. వీళ్లిద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి మూడ్రోజుల నుంచి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మల్లికార్జున్‌రెడ్డి మూడు రోజుల నుంచి సునీత ఇంట్లో ఉంటున్నట్లు గుర్తించి కుటుంబ సభ్యులు, బంధువుల సాయంతో పట్టుకున్నాడు.

తన భార్య సునీత, సీఐ మల్లికార్జున్‌రెడ్డి వివాహేతర సంబంధం గురించి గతంలోనే ఇద్దరినీ ప్రశ్నించానని, ఇక మీదట అలా చేయమని హామీ ఇచ్చారని సురేంద్‌రెడ్డి చెబుతున్నారు. అయితే మళ్లీ మూడు నెలల నుంచి వాళ్లిద్దరూ దగ్గరయ్యారని, అందుకే సీఐ చేతిలో మరో యువతి మోస పోకుండా ఉండడం కోసమే ఇద్దరిపై నిఘా పెట్టి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపాడు.

శాంతిభద్రతలను పరిరక్షిస్తూ ప్రజలను సరైన మార్గంలో నడిపించాల్సిన పోలీసులే దారితప్పుతున్నారు. హోంగార్డు నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకూ ఎందరో వక్రమార్గంలో నడుస్తున్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాల్సిన ఉన్నతాధికారులు సైతం మార్గం తప్పుతున్నారు. వివాహేతర సంబంధాలతో మొత్తం పోలీస్ వ్యవస్థకే తలవొంపులు తెస్తున్నారు. హోంగార్డులు, కానిస్టేబుల్స్‌ స్థాయిలో ఎంతో మంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తుండగా ఎస్సై, సీఐ, ఏఎస్పీ ర్యాంక్‌ అధికారులు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ సమాజంలో నవ్వులపాలవుతున్నారు. సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ప్రజలను సరైన దారిలో నడిపించాల్సిన పోలీసులే దారి తప్పడం చర్చనీయాంశమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories