ఆడపిల్ల పుట్టిందని కాకినాడలో అమానుషం...చిన్నారిని చంపాలనుకున్న తండ్రి

x
Highlights

ఆడపిల్ల పుట్టింది కాబట్టి అమ్మెయ్.. లేకుంటే పసిదాన్ని గొంతు పిసికేస్తానన్నాడు భర్త. చిన్నారి ప్రాణం తీసేస్తారని విలవిల్లాడిన కన్నతల్లి పరుగున వెళ్లి...

ఆడపిల్ల పుట్టింది కాబట్టి అమ్మెయ్.. లేకుంటే పసిదాన్ని గొంతు పిసికేస్తానన్నాడు భర్త. చిన్నారి ప్రాణం తీసేస్తారని విలవిల్లాడిన కన్నతల్లి పరుగున వెళ్లి పోలీసులకు మొరపెట్టుకుంది. కానీ కంచే చేను మేస్తే.. ఆ తల్లి ఇంకెవరికి చెప్పుకోవాలి?

చిన్నారిని నూతిలో పడేస్తానన్నాడు తండ్రి. గొంతు నులిమి భయపెడుతూ తల్లితో సంతకం చేయించుకోవాలనుకున్నాడు. 5 లక్షలకు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నాడు. కానీ తల్లి అడ్డుపడింది. వేడుకుంది. పోరాడింది. డబ్బులు వద్దు.. నా కూతురే నాకు కావాలని పట్టుబట్టింది.

కాకినాడ దుమ్మలపేటకు చెందిన వెంకటపద్మావతికి డైరీ ఫామ్ సెంటర్‌కు చెందిన సురేష్‌తో 2014లో వివాహం అయింది. ఆడపిల్ల పుట్టగానే భర్త, అత్తింటివారి అసలు రంగు బైటపడింది. చిన్నారిని అమ్మేయమని బలవంతం చేసిన భర్త ఒకరోజు బలవంతంగా తీసుకెళ్లబోతే ఆతల్లి చిన్నారితో సహా కన్నవారింటికి చేరుకుంది.

అక్కడికీ వచ్చిన భర్త, భర్త సోదరుడు.. చిన్నారిని అమ్ముకోడానికి అంగీకరించాలని బలవంతం చేస్తూ దారుణానికి దిగాడు. చిన్నారి గొంతు నులుముతూ.. సంతకం పెడతావా లేదా.. అని భయపెట్టాడని భోరున విలపించింది ఆ తల్లి. పోరాడి ఆ గండం నుంచి బైటపడిన తల్లి.. కూతుర్ని రక్షించుకోడానికి భర్తపై న్యాయపోరాటానికి సిద్ధపడింది. కాకినాడ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కూతుర్నే చంపాలనుకున్న భర్తకు బుద్ధి చెప్పాలనుకున్న తల్లి న్యాయం కోసం పోలీసుల్ని మొరపెట్టుకుంటే అక్కడా అన్యాయమే ఎదురైంది. తప్పుచేసిన భర్తకు శిక్షపడాలని కేసుపెడితే నిరాకరించారు పోలీసులు. వరకట్నం కేసు పెట్టి చేతులు దులుపుకొని ఆ తల్లి పోరాటాన్ని చిదిమేశారు.

చిన్నారిని అమ్మేయాలని, చంపాలని భావిస్తున్న భర్తకు శిక్ష పడాలని పద్మావతి స్వహస్తాలతో ఫిర్యాదు రాస్తే.. దానిని పక్కన పడేసిన పోలీసులు.. తాము చెప్పినట్టుగా ఫిర్యాదు రాయించారు. వరకట్నం కేసు పెట్టించి ఆ తల్లి పోరాటాన్ని నీరుగార్చారు. చిన్నారిని చిదిమేయాలనుకున్న తండ్రి కిరాతకానికి కొమ్ముకాశారు. కానీ అదేం లేదంటున్నారు పోలీసులు. కావాలంటే పద్మావతి చేతి రాతతో ఉన్న ఫిర్యాదు చూడండి.. అని చూపిస్తున్నారు.

తన కూతుర్ని చంపాలనుకున్న భర్తకు శిక్షపడాలని పద్మావతి కోరుకుంటే.. ఆ ఫిర్యాదు తీసుకోకుండా.. బలవంతంగా వరకట్న కేసు పెట్టించి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. కూతురు పుట్టిందని అమ్మేసి వ్యాపారం చేసుకుందామని, లేకుంటే చంపేయాలనుకున్నాడు భర్త. అలాంటివాడికి శిక్ష పడాలని పోలీసులకు మొరపెట్టుకుంటే.. అక్కడా అన్యాయమే ఎదురైతే.. ఆ తల్లి ఇంకెవరికి చెప్పుకోవాలి?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories