Top
logo

ప్రభుత్వం ఎందుకు ఫుటేజీ ఇవ్వలేకపోతోంది..ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టిందా?

X
Highlights

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ శాసనసభ్యత్వం రద్దు వ్యవహారం ఎటు వెళ్తోంది? తెలంగాణ...

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ శాసనసభ్యత్వం రద్దు వ్యవహారం ఎటు వెళ్తోంది? తెలంగాణ ప్రభుత్వం హై కోర్టులో కౌంటర్ పిటిషన్ ఎందుకు దాఖలు చేయలేకపోతోంది? జరుగుతున్న పరిణామాలు ఎవరికి లాభం చేకూర్చనున్నాయి? క్రమంగా రాజ్యాంగ ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న ఈ వ్యవహారంలో ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టిందా?

కోమటిరెడ్డి, సంపత్ శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిన వెంటనే అందరికీ వచ్చిన సందేహం.. అసలు ప్రభుత్వానికి గానీ, అసెంబ్లీకి గానీ ఆ హక్కు ఉందా? అని. ఈ అంశంపై జరుగుతున్న పరిణామాలు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మరోసారి అదే సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. శాసన, న్యాయ వ్యవస్థలతోపాటు ప్రభుత్వం మధ్య నలుగుతున్న ఈ అంశంలో ప్రభుత్వమే తప్పనిసరి పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.

రద్దు వ్యవహారంలో ప్రభుత్వ తీరును గమనిస్తే అడ్వకేట్ జనరల్ దేశాయ్ ప్రకాష్ రెడ్డి ఫుటేజీ ఇస్తామని కోర్టులో అంగీకరించడాన్ని ప్రభుత్వ పెద్దలు తప్పుబట్టారు. ఇదే ముదరడంతో దేశాయ్ తన పదవికి చేసిన రాజీనామా ప్రభుత్వానికి మచ్చ తెచ్చింది. కేసు తేలకముందే కాంగ్రెస్ సభ్యుల భద్రతను ఉపసంహరించడం, గెజిట్ విడుదల చేయడంలో ప్రభుత్వం మరోసారి దుందుడుగా వ్యవహరించింది. ఈ క్రమంలోనే కోర్టులో ప్రభుత్వానికి ఎదురుగాలి మొదలయింది. ఫుటేజీ ఇవ్వడానికి సభ అనుమతి లేదన్న కొత్త అడ్వకేట్ జనరల్ వాదనను కోర్టు తోసిపుచ్చడమే కాకుండా అతడి మాటల్లో వైరుధ్యాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని అసెంబ్లీయే తేలుస్తుందన్న వాదనను అంగీకరించని కోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోతే దానితో సంబంధం లేకుండా తీర్పు ఉంటుందని తేల్చేసింది.

ఈ వ్యవహారంలో అంతా ప్రతికూల ఫలితాలు కనిపిస్తుండటంతో ప్రభుత్వం దీనిని శాసనవ్యవస్థపైకి నెట్టేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తుది తీర్పు ఎలా ఉన్నా.. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఘర్షణాత్మక వైఖరి తలెత్తడానికి ప్రభుత్వమే దోహదం చేయడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో పరిస్థితులను బట్టి ప్రభుత్వమే తన పట్టును సడలించుకుంటుందా..? లేకుంటే మూడు వ్యవస్థల మధ్య చిక్కుకొని.. ఈ అంశం ఎటూ కాకుండా పోతుందా? తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story