Top
logo

500 కిలోల ఊబకాయ మహిళ ఎమన్ మృతి

X
Highlights

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత ఊబకాయురాలిగా గతంలో వార్తల్లో నిలిచిన ఈజిప్టు మహిళ ఎమన్ అహ్మద్ మరణించింది. దాదాపు...

అబుదాబి: ప్రపంచంలోనే అత్యంత ఊబకాయురాలిగా గతంలో వార్తల్లో నిలిచిన ఈజిప్టు మహిళ ఎమన్ అహ్మద్ మరణించింది. దాదాపు 500 కిలోల బరువుతో బాధపడుతున్న ఆమె సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 4.35 నిమిషాలకు కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. అబుదాబిలోని బర్జీల్ ఆసుపత్రిలో ఆమె గత కొద్దిరోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె కిడ్నీల పనితీరు పూర్తిగా క్షీణించిందని, గుండె సంబంధిత వ్యాధితో ఎమన్ చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం ఎమన్ మేలో అబుదాబిలోని ఆసుపత్రిలో చేరింది. దాదాపు 20 మందితో కూడిన వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ఎమన్ మహ్మద్ ముంబైలో కూడా చికిత్స పొందిన సంగతి తెలిసిందే. ఆమెను తరలించడానికి విమానయాన సంస్థలు నిరాకరించడంతో ఫిబ్రవరి 11న అలెగ్జాండ్రియా నుంచి ఆమెను ప్రత్యేక కార్గో విమానంలో ఇండియాకు తీసుకొచ్చారు. ముంబైలోని సైఫీ ఆసుపత్రి చైర్మన్ ముఫజల్ లక్డవాలా ఆమెకు చికిత్స చేశారు. ఆమె ఆ క్రమంలో దాదాపు 200 కిలోల బరువు తగ్గినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆమెకు చికిత్స సక్రమంగా జరగడం లేదంటూ ఎమన్ సోదరి సైమా ఆరోపణలు చేసింది.

ఆమె ఆరోపణలను సైఫీ చైర్మన్ ముఫజల్ కొట్టిపారేశారు. దీర్ఘకాలిక చికిత్స కోసం ఆమెను మే 4న యూఏఈకి తరలించారు. దాదాపు 4నెలల వ్యవధిలోనే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమన్ అహ్మద్‌ బరువు తగ్గాలని కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎన్నో పెద్దపెద్ద ఆసుపత్రుల్లో ఆమెకు అనేక రకాల వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్స్ చేయించారు. మరికొద్దిరోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుని, మామూలు మనిషిగా తమ ముందు తిరుగుతుందని భావించామని, కానీ ఇలా జరగడంతో చాలా బాధగా ఉందని ఎమన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎమన్ పుట్టిన సమయంలో ఆమె బరువు 5కిలోలు. థైరాయిడ్ సమస్యతో ఆమె పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోయింది. చనిపోయేనాటికి ఆమె వయసు 36 సంవత్సరాలు.

Next Story