logo
సినిమా

‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ

‘ఈ నగరానికి ఏమైంది?’ మూవీ రివ్యూ
X
Highlights

టైటిల్ : ఈ నగరానికి ఏమైంది? జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం,...

టైటిల్ : ఈ నగరానికి ఏమైంది?
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి
సంగీతం : వివేక్‌ సాగర్‌
దర్శకత్వం : తరుణ్‌ భాస్కర్‌
నిర్మాత : డి. సురేష్‌ బాబు


టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం ఆయనకు అవార్డులు, రివార్డులు సంపాదించి పెట్టింది. దాంతో తరుణ్ భాస్కర్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. తన రెండో చిత్రంగా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని రూపొందించి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలను చేరుకొన్నారా? టాలీవుడ్‌లో ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

కథేంటంటే: వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్‌గో మతం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) నలుగురు స్నేహితుల కథ ఇది. వీరు ఒక షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలని అనుకుంటారు. దాంతో తమ ప్రతిభకు ఈ ప్రపంచానికి చూపించాలని అనుకుంటారు. కానీ, వివేక్‌కు చాలా కోపం. దాన్ని అదుపులో ఉంచుకోలేడు. దానికి తోడు లవ్‌ ఫెయిల్యూర్‌. ఈ గ్యాంగ్‌ మధ్య కూడా తరచూ గొడవలు వస్తుంటాయి. కార్తీక్‌ జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఆ పార్టీకి తన స్నేహితులు ముగ్గురినీ పిలుస్తాడు. పబ్బులో చిత్తుగా తాగిన ఈ నలుగురు స్నేహితులు ఆ మత్తులో గోవా వెళ్లి పోతారు. అక్కడకు వెళ్లాక, ఈ నలుగురూ ఏం చేశారు? తమ స్నేహాన్ని, జీవితాన్ని ఎలా సరిదిద్దుకున్నార? వారి మధ్య సాగే అల్లర్లుచిరు కోపాలు, ఎలా సాగాయి అనేదే కథ.

విశ్లేష‌ణ‌ : రొటీన్‌గా ఓ ల‌వ్ స్టోరీ, నాలుగు పాట‌లు, నాలుగు ఫైట్లు, ప్రీ క్లైమాక్స్, అదిరిపోయే ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, కొన్ని న‌వ్వులు... ఇలాంటి ఫార్ములాకు దూరంగా సాగే సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. అనుకున్న క‌ల‌ల‌ను సాకారం చేసుకునే ప‌నిలో ప‌డ్డ న‌లుగురు కుర్రాళ్లు, వాళ్ల‌ల్లో ఒక‌రికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్‌, ఒక‌రికి ల‌వ్ ప్రాబ్ల‌మ్‌.. ఇంకో ఇద్ద‌రు మామూలుగా ఉంటారు. ఏదో చేద్దామ‌ని, డ‌బ్బు కోసం.. డాబు కోసం ఇంకేదో చేయాల‌నుకున్న ఒక ఫ్రెండ్ మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని గ్ర‌హించిన మ‌రో ఫ్రెండ్‌.. అత‌ని క‌ల సాకారం అయ్యే ద‌శ‌గా అడుగులు వేయించిన తీరు, యువ‌త స‌ర‌దాగా మందు కొట్టిన‌ప్పుడు వారు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చూపించిన స‌న్నివేశాలు, క‌ష్టాల‌న్నిటినీ ప‌క్క‌న‌పెట్టి క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ స‌న్నివేశాలు, న‌లుగురు కుర్ర‌కారు కూర్చుని మాట్లాడుకుంటే చాటుగా మ‌నం విన్న‌ప్పుడు ఎలాంటి డైలాగులు వినిపిస్తాయో అలాంటి డైలాగులు... మేన‌మామ తండ్రిలాంటి వాడే అయినా, మేన‌ల్లుడికి ఒక ర‌కంగా స్నేహితుడిలాంటి వాడు అని చూపించే షాట్లు... జీవితం ఎక్క‌డా ఆగిపోదని, కావాల్సిన నాలుగు మెతుకులు, మ‌న అనుకున్న న‌లుగురు స్నేహితులు, న‌చ్చిన ఉద్యోగం, ఎదురుప‌డితే న‌వ్వుతూ ప‌ల‌క‌రించే న‌లుగురు ఆప్తులు అని చెప్ప‌క‌నే చెప్పిన సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. స‌న్నివేశాల్లో కామెడీ పంచ‌డం కోసం తాగుడు స‌న్నివేశాల‌ను రాసుకుని, దానికి జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌డానికి `ఈ న‌గ‌రానికి ఏమైంది` అని టైటిల్ పెట్టాడు త‌రుణ్ భాస్క‌ర్‌. క‌థ‌గా ఈ సినిమాలో చెప్పుకోవ‌డానికి పెద్ద‌గా ఏమీ లేక‌పోయినా, ఇది... కొత్త‌ది అని చెప్పేంత‌గా లేక‌పోయినా, స‌న్నివేశాల‌ను, కామెడీని చ‌క్క‌గా రాసుకున్నారు త‌రుణ్‌.

ఎవరెలా చేశాంటే: పాత్రధారులను ఎంచుకోవడంలో తరుణ్‌ భాస్కర్‌ మరోసారి విజయం సాధించాడు. తెరపై కనిపించే నలుగురూ కొత్తవారు. వారి నుంచి తనకు కావాల్సిన సహజమైన నటన రాబట్టుకున్నాడు. ముఖ్యంగా కౌశిక్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో నవ్విస్తుంది. ముఖ్యంగా వివేక్‌ మద్యం సేవిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని హావభావాలు పలికించిన తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. కథానాయికలు అందంగా కనిపించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం మరోసారి ఆకట్టుకుంటుంది. యూత్‌కు తగ్గట్టు ట్రెండీగా నేపథ్య సంగీతం అందించాడు. సినిమాటోగ్రఫీ కలర్‌ కాంబినేషన్‌, సెట్టింగ్‌లు, నేపథ్యం కథకు తగినట్టు సాగాయి. రచయితగా తరుణ్‌ భాస్కర్‌ నూటికి నూరు మార్కులు కొట్టేస్తాడు. కాకపోతే మరింత పటిష్టమైన కథను రాసుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మాణ విలువలు గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. కథకు తగినట్లు అన్ని వనరులు సమకూర్చారు.

Next Story