Top
logo

పర్సంటేజీల భారతం

పర్సంటేజీల భారతం
X
Highlights

మామూలు మనుషులు జీవితకాలం కష్టపడినా సాధ్యం కాని సంపాదన.. కేవలం ఐదేళ్లలోనే కొంత మందికి సాధ్యం అవుతోంది. తరతరాలు...

మామూలు మనుషులు జీవితకాలం కష్టపడినా సాధ్యం కాని సంపాదన.. కేవలం ఐదేళ్లలోనే కొంత మందికి సాధ్యం అవుతోంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులను వాళ్లు పోగేసుకుం టున్నారు. కేవలం ఐదు సంవత్సరాలు గడిస్తేనే వాళ్ల ఆస్తులు 500 శాతం కూడా పెరిగిపోతున్నాయి. ఇందు కోసం వాళ్ల దగ్గర ఉన్న మంత్రదండం ఏంటా అని చూస్తే... రాజకీయం! అవును.. ప్రజాప్రతినిధులుగా అందులో నూ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలుగా ఐదేళ్లు పనిచేసిన వారు పోగేసుకుంటున్న ఆస్తులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అప్పటివరకు ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అంతంతమాత్రంగానే ఉండేవాళ్లు కూడా ఆ తర్వాత ఒక్కసారిగా కుబేరులు అయిపోతున్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారం మీద తీవ్రంగా మండిపడింది. అంత తక్కువ కాలంలో అంత సొమ్ము సంపాదిస్తున్నారని తెలిసినా వాళ్ల మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపో యారని ప్రశ్నించింది. అసలు వాళ్ల గురించి ఏమైనా సమగ్ర విచారణ జరిపించారా అని నిలదీసింది. ఐదు సంవత్సరాల అతి స్వల్ప కాలంలో దాదాపు 500 శాతం వరకు కూడా ఆస్తులు పెంచేసుకున్న దాదాపు 300 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల వ్యవహారాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రైట్స్ సంస్థ బయటపెట్టినప్పుడు దాని ఆధారంగా ఒక స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం పుణ్యమాని ఇది కోర్టు దృష్టికి వచ్చింది. అసలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతున్న విధానమే చాలా దారుణంగా ఉంటోంది. ఇటీవల జరిగిన నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఈ ఎన్నికల్లో కేవలం రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరు కలిసి ఖర్చుపెట్టిన మొత్తం దాదాపు వంద కోట్ల రూపాయలని లెక్కతేలింది. అంత ఖర్చుపెట్టడానికి వాళ్లకు ఆ డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయన్నది ప్రశ్నార్థకమే. అయితే.. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తాను ఖర్చు చేసిన దానికి ఒకటో రెండో రెట్లు ఎక్కువగా ఆ డబ్బును తిరిగి సంపాదించుకోలేకుండా సదరు అభ్యర్థి ఉండలేరు కదా! సరిగ్గా ఇక్కడే అవినీతి మొదలవుతోం ది.

ఎన్నికలలో ఎలాగైనా గెలవాలన్న ఆలోచనతో.. ఓటుకు 2 నుంచి 5 వేల రూపాయల వరకు కూడా పంచిపెడుతున్నారు. ఓటర్లు కూడా.. తాము ఎప్పుడో ఐదేళ్లకు ఒక్కసారే కదా తీసుకుంటున్నది, అది కూడా వాళ్లంతట వాళ్లే ఇస్తున్నారు తప్ప తాము అడిగి తీసుకోవడం లేదని సమాధానపడిపోతున్నారు. విడివిడిగా ప్రజల స్థాయిలో చూసినపుడు అది చాలా తక్కువ మొత్తం కావచ్చు గానీ, నియోజకవర్గం మొత్తంలో ఓటర్లందరికీ కలిపి ఇచ్చిన డబ్బులు, ప్రచారానికి చేసిన ఖర్చు, కార్యకర్తల వాహనాలకు అయిన పెట్రోలు, పెద్ద నాయకుల నిర్వహణ ఖర్చులు, వాళ్ల అనుచరులకు ఆ పది - పదిహేను రోజుల పాటు మేత.. ఇవన్నీ కలిపి చూస్తే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గానికే దాదాపు 50-70 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నా రు. ఒకప్పుడు నాయకులను చూసుకుంటే.. సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు చాలా గొప్ప పేరున్న పెద్ద న్యాయవాది. ఫీజుల రూపంలో ఆయన తీసుకున్న మొత్తాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ రూపంలో చాలా ఆస్తులు కూడగట్టకున్న ఆయన... ప్రజాజీవితం లోకి వచ్చి, ఒకసారి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన తర్వాత చివరి దశలో తినడానికి తిండి కూడా దొరకనంత దుర్భర స్థితిలోకి వెళ్లిపోయారు. అంటే, అప్పట్లో ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులుగా పనిచేసినవాళ్లు కూడా రాజకీయాలను సంపాదనకు మార్గాలుగా కాక... ప్రజాసేవ కోసమే వచ్చామని మనసా వాచా కర్మణా నమ్మి, దాన్ని యథాతథంగా ఆచరించేవారు కూడా. అందుకే వాళ్ల ఆస్తులు కూడా కరిగిపోయేవి తప్ప కొండల్లా పెరిగిపోయేవి కావు. లాల్ బహదూర్ శాస్త్రి లాంటివాళ్లు ఒక్క రైలు ప్రమాదం జరిగితే కేంద్ర మంత్రి పదవికి పూర్తిస్థాయిలో రాజీనామాచేసి పదవులను తృణప్రాయంగా వదిలేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, చక్రవర్తుల రాజగోపాలాచారి, శ్యామాప్రసాద్ ముఖర్జీ, రఫీ అహ్మద్ కిద్వాయ్... ఇలా తొలితరం నాయకులను ఎవరిని చూసినా వాళ్లలో ఎవరూ సంపాదన ధ్యేయంగా రాజకీయాల్లోకి వచ్చినవారు లేరు. పైపెచ్చు, ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిపాస్తులను కూడా అమ్మేసుకున్నవాళ్లే. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది.

ఓ వ్యక్తి ఇంతకుముందు వార్డు కౌన్సిలర్ పదవికి పోటీచేసినా ఓడిపోయారు. ఆ తర్వాత ఏవేవో కారణాల వల్ల జాతీయపార్టీ టికెట్ మీద పోటీచేసి ప్రాంతీయ పార్టీ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచారు. పొత్తులతో భాగంగా చిన్నపాటి మంత్రిపదవి కూడా దక్కించుకున్నారు. అంతకుముందువరకు కేవలం ఒక సైకిల్ మీద మాత్రమే తిరుగుతూ, ఒక మాదిరి ఫొటోస్టూడియో పెట్టుకుని దానిమీద వచ్చే సంపాదనతోనే పొట్టపోసుకున్న వ్యక్తి.. ఇప్పుడు ఒకేసారి కోట్లకు పడగలెత్తేశారు. పెద్దపెద్ద భవనాలు ఆయన సొంతమయ్యాయి, పెద్ద ఎస్యూవీలో తప్ప బయటకు కదలడం లేదు, ఒకప్పటి తన స్థాయి వ్యక్తులకు కనీసం ఆయన అపాయింట్ మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు. ఇంకా ఆయన పదవి చేపట్టి ఐదేళ్లు కూడా అవ్వలేదు. అంతలోనే ఇంత పరిస్థితి వచ్చిందంటే.. ఆ తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. రాజకీయ నాయకులు ఇంత సంపాదనకు ఎలా అలవాటు పడుతున్నారు, వాళ్లకు అసలు ఆదాయ మార్గాలు ఏంటని చూస్తే.. చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఎన్నికలలో పెడుతున్న ఖర్చు, దానికితోడు ఎన్నికయిన తర్వాత వంధిమాగధు లను పోషించడానికి అయ్యే ఖర్చులు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తున్న కొద్దిపాటి జీతంతో వెళ్లడం లేదట. ఒక మంత్రిగారు ఏదైనా ప్రారంభోత్స వానికి గానీ, సభకు గానీ వెళ్లాలంటే కేవలం మంత్రిగారి వాహనం ఒక్కటే వెళ్లి, ఆయన ఒక్కరే వెళ్తే హంగు, ఆర్భాటం లాంటివి ఏమీ కనిపించవు కదా.. అందుకే ముందు నాలుగైదు వాహనాలు, వెనక నాలుగైదు వాహనాలు, వాటికి తోడు పైలట్ వాహనం, ఇవన్నీ ఉండి.. ఆయన కారు దిగడానికి ముందే వచ్చి కారు డోరు తీసి ఆయనకు కుడిఎడమల నిలిచి జయజయ ధ్వానాలు చేసుకుంటూ తీసుకెళ్లడానికి ఓ పాతిక మంది కావాలి. వాళ్లంతా ఊరికే ఎందుకొస్తారు? అప్పటివరకు ప్రతిరోజూ వాళ్లకు తిండితిప్పలు చూసుకోవడమే కాకుండా, ప్రతినెలా ఇంత అనుకుని జీతం కూడా ఇస్తూ ఉండటం, అడపా దడపా ఏవైనా కాంట్రాక్టులు ఇప్పించి వాళ్లు కూడా నాలుగు రాళ్లు వెనకేసుకునేలా చూడటం తప్పనిసరి అయిపోతోందట. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిపదవి అనుభవించి, ఇప్పుడు జాతీయపార్టీలో ఎలాంటి పదవి లేకుండా కేవలం ఒక నాయకుడిగా మాత్రమే ఉంటున్న ఓ వ్యక్తి తన ఇంట్లో ప్రతిరోజూ కనీసం 50 మందికి తక్కువ కాకుండా టీ టిఫిన్లు, భోజనాలు సమకూర్చాల్సి వస్తోందట. దానికి అయ్యే ఖర్చులు ఇంతకుముందైతే పర్వాలేదు గానీ ఇప్పుడు భరించడం చాలా బరువుగా అనిపిస్తోందని ఆయన వాపోతున్నారు. మరి వాళ్లకు ఇంత పెద్దమొత్తంలో డబ్బులు సంపాదించడానికి మార్గాలు ఏమున్నాయని చూస్తే... పర్సంటేజీలు. ఏ పని చేసినా అందులో ఎంతో కొంత పర్సంటేజి తీసుకోవడం మామూలైపోయింది. కింది నుంచి పై వరకు.. అంటే మామూలు గుమాస్తా స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకు పర్సంటేజీలు ఇవ్వాల్సి రావడం వల్లే పనుల అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

అదే పెద్ద ప్రాజెక్టులైతే మంత్రులు, ఎంపీలు.. అలా ఇంకా పై స్థాయిలో ముడుపులు ముట్టజెప్పాల్సి వస్తోంది. ఎన్నికలలో పెట్టిన ఖర్చులను వెనక్కి తిరిగి తీసుకోవడంతో మొదలవుతున్న ఈ వ్యవహారం.. మళ్లీ తర్వాతి ఎన్నికలకు పెట్టుబడి గురించి ఆలోచించేవరకు వెళ్తుంది. అక్కడినుంచి తన తర్వాతి తరం సంగతేంటని అనుకుంటారు. అలా అనుకుంటూ... చివరకు తరత రాలు కూర్చుని తిన్నా కరగనంత ఆస్తిపాస్తులు సంపాది స్తారు. పవర్ ప్లాంట్లలో పెట్టుబడులు పెడతారు. రకరకా ల వ్యాపారాల్లోకి దిగుతారు. వాళ్ల పేర్ల మీద, వాళ్ల పిల్లల పేర్ల మీద ఉండే వ్యాపార సంస్థలు మిగిలినవాటి తో సంబంధం లేకుండా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటాయి. లాభాల వర్షాలు కురిపిస్తూనే ఉంటాయి. వేరేవాళ్లు ఇలాంటి వ్యాపారాలే పెట్టినా వాటిలో మాత్రం ఇంత లాభాలు రావు. అందులోని రహస్యం ఏంటో ఎవరికీ తెలియదు. ఇటీవలే ఓ పెద్ద పదవిలోకి వెళ్లిన బడా నాయకుడి పుత్రరత్నం రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్న వాహనాల డీలర్ కంపెనీకి ఒక రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చింది. పోటీ సంస్థ అంతకంటే తక్కువ ధరకే వాహనాలు ఇస్తామన్నా, ఇందులో ఉన్న సౌకర్యాలు, సానుకూలతలు అందులో లేవంటూ సర్టిపికెట్ ఇచ్చి మరీ ఆ సంస్థకు కాంట్రాక్టు కట్టబెట్టారు. తెల్లారి లేస్తే తెగ తిట్టుకునే ఆ రెండు పార్టీల మధ్య వ్యాపారం విషయంలో మాత్రం ఇలా ఇచ్చి పుచ్చుకునే ధోరణి అవలంబించడం చాలా ఆశ్చర్యం వేస్తుంది. హైదరాబాద్ నగరంలో మొన్నామ ధ్య జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కూడా చాలా బరువుగానే ముగిశాయి. ఒక్క డివిజన్ లో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థి తన రెండు కమర్షియల్ ప్లాట్లు అమ్మి 3 కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చిందని చెప్పారు. అదే నిజమైతే... అసలు ప్రజాస్వామ్యం ఎటు పోతోంది? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని జబ్బలు చరుచుకుని చెప్పుకొంటున్న మనం ఎన్నికలు, రాజకీయాల విష యంలో ఎందుకింతగా దిగజారిపోతున్నాం? రాజకీయాలు అంటే అంతా డబ్బుల మయమేనా.. నాయకత్వం అన్నదానికి వేరే అర్థం లేకుండా పోతోందా? ప్రజాస్వామ్యవాదుల నుంచి వస్తున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నాధుడు ఎక్కడా కనిపించడం లేదు.

ఎక్కడో దుర్భిణీ వేసి గాలిస్తే... త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ లాంటివాళ్లు కనిపిస్తారు. హైదరాబాద్ నగరంలో జరిగే ఓ కార్యక్రమానికి ఆయన వస్తున్నారని తెలిసి భారీగా స్వాగత ఏర్పాట్లు చేసుకుని కొంతమంది నాయకులు రైల్వేస్టేషన్ వరకు వెళ్లారు. అక్కడ ఏసీ బోగీలన్నీ గాలించినా ఆయన మాత్రం కనపడలేదు. దాంతో.. కార్యక్రమాన్ని ఆయన ఏమైనా వాయిదా వేసుకున్నారే మో అని భావించి వాళ్లు వెనక్కి వచ్చేశారు. కట్ చేస్తే.. స్లీపర్ బోగీలోంచి భుజాన ఒక గుడ్డ సంచి మాత్రమే వేసుకుని దిగిన సదరు ముఖ్యమంత్రి గారు.. ఒక మామూలు రిక్షా ఎక్కి తాను వెళ్లాల్సిన కార్యక్రమ వేదిక వరకు వెళ్లిపోయారు. ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం రైల్లో తోటి ప్రయాణికులకు గానీ, రిక్షా డ్రైవరుకు గానీ, రోడ్డు మీద ఆయనను చూస్తున్న జనాలకు గానీ ఎవరికీ తెలియదు. వేదిక వరకు వెళ్లిన తర్వాత నిర్వాహకులలో ఒకరు ఆయనను గుర్తుపట్టి.. అరె సీఎంగారూ, మీరిలా వచ్చేశారా అని అడిగారట. ఈ రోజుల్లో ఇలాంటి సత్తెకాలపు సత్తయ్యలు ఒకరిద్దరు మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలినవాళ్లంతా మాత్రం ఎప్పటికప్పుడు తమ జేబులు ఎలా నింపుకొందామా అని చూస్తున్నవాళ్లే. ఇలాంటి వ్యవస్థ వల్లే భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపో తోంది తప్ప ఏనాటికీ అభివృద్ధిలో ముందడుగు వేయలేకపోతోంది. ఒకడుగు ముందుకేస్తే నాలుగడుగు లు వెనక్కి అన్నట్లు తయారవుతోంది. ఒకవైపు దేశంలో నల్లధనాన్ని, అవినీతి అక్రమాలను నిర్మూలిస్తామని చెబుతున్న నాయకులు.. మరోవైపు అదే నల్లధనం, అవినీతి, అక్రమాలను పెంచి పోషిస్తున్న వినాయకు లు.. వీళ్లందరి మధ్య నలిగిపోతున్న సామాన్యులు.. ఇదీ ప్రస్తుత భారతావని దీనస్థితి. ఈ దుస్థితి నుంచి భరతమాతను కాపాడే నాయకుడు ఎప్పటికి వస్తాడో.. దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణల మీద ఎప్పటికి దృష్టి పెడతారో చూడాలి. బిహార్ లాంటి రాష్ట్రాల్లో ఇంత కుముందు ఓట్లు వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. నాయకుల అనుచరులు తుపాకులు పట్టుకుని పోలింగ్ కేంద్రాలను ఆక్రమించుకుని మొత్తం ఓట్లన్నీ వాళ్లే వేసేసేవారు. అప్పటినుంచి టీఎన్ శేషన్, కేజే రావు లాంటి ఎన్నికల అధికారులు అక్కడి పరిస్థితిని చాలా వరకు మార్చారు.

మరింతమంది శేషన్‌లు, మరింత మంది రావులు వస్తే తప్ప ఎన్నికల వ్యవస్థలో డబ్బు ప్రభావం దూరం కావడం అసాధ్యం. సుప్రీంకోర్టు చెప్పినా, ఒకరిద్దరికి పొరపాటున శిక్షలు ఏమైనా పడినా కూడా వీళ్లు మారతారన్న నమ్మకం మాత్రం కలగడం లేదు.

చంద్ర‌శేఖ‌ర శ‌ర్మ‌

Next Story