logo
జాతీయం

లవర్ కోసం కోటి నగలు కొట్టేసింది!

లవర్ కోసం కోటి నగలు కొట్టేసింది!
X
Highlights

ప్రేమ కోసం నగల చోరీ కోటి విలువైన వజ్రాల హారం మాయం మింత్ర సీఈవో ఇంట్లో పనిమనిషి నిర్వాకం పోలీసుల...

  • ప్రేమ కోసం నగల చోరీ
  • కోటి విలువైన వజ్రాల హారం మాయం
  • మింత్ర సీఈవో ఇంట్లో పనిమనిషి నిర్వాకం
  • పోలీసుల విచారణలో బయటపడ్డ నిజాలు

బెంగళూరు: ప్రేమ కోసం.. ప్రేమించిన వారి సంతోషం కోసం ఏమైనా చేయొచ్చనే మాటలను స్ఫూర్తిగా తీసుకుందో ఏమో కానీ ఓ యువతి తన ప్రియుడి కోసం దొంగతనానికి పాల్పడింది. తను పనిచేసే ఇంట్లో కన్నం వేసి రూ. కోటి విలువైన నగలను తస్కరించింది. ఇంట్లో తన పని చక్కబెట్టుకున్న తర్వాత ఉద్యోగం మానేస్తానంటూ చెప్పింది. అయితే, మరొకరు దొరికేంత వరకూ పనిమానొద్దని యజమాని కోరడంతో మంచితనం నటిస్తూ కొనసాగుతోంది. ఇంటిలో ఉన్న భద్రతా ఏర్పాట్లు చూసిన పోలీసులు సదరు నగల చోరీ ఇంటి దొంగల పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆపై పనిమనుషులపై నిఘా పెట్టి అసలు రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ కామర్స్ దిగ్గజం మింత్ర సీఈవో అనంత్ నారాయణన్ ఇంట్లో ఈ నెల ప్రారంభంలో రూ. కోటి విలువైన నగలు చోరీకి గురయ్యాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంత్.. పనిమనుషులపై సందేహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లావెల్ రోడ్‌లోని అనంత్ ఇంటిని పరిశీలించాక.. ఆయన సందేహం నిజవేునని భావించారు.

విదేశాల్లో స్థిరపడాలని..
భవాని ముప్పుదత్తి.. పాతికేళ్ల యువతి. అనంత్ నారాయణన్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. విశ్వాసపాత్రంగా ఉంటూ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సురేశ్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతకన్నా ముందు బాగా డబ్బు సంపాదించాలని భావించారు. ఎక్కువ కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం దొంగతనవేునని, అందుకు తమ యజమాని ఇల్లే సరైనదని ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. పెద్ద మొత్తం చోరీ చేసి దొరకకుండా విదేశాలకు పారిపోయి అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడాలని అనుకున్నారు. ఇందుకోసం పకడ్బందీగా పథకం రచించారు. ఈ ప్లాన్‌లో భాగంగా.. సురేశ్ కుమార్ డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, చెన్నైకి మకాం మార్చాడు. అక్కడి నుంచి భవానిని సంప్రదిస్తూ చోరీకి అనువైన సమయం కోసం వేచి చూడసాగారు.

ఇంట్లోని విలువైన నగలు, డబ్బు ఉంచే ప్రదేశాలను, ఆయా లాకర్లకు సంబంధించిన తాళాల డూప్లికేట్ కీలను భవాని సంపాదించింది. ఈ మారు తాళం చెవులను దగ్గర పెట్టుకుని సమయం కోసం వేచి చూడసాగింది. ఈ నెల 6న అనంత్ కుటుంబ సభ్యులంతా ఓ కార్యక్రమం కోసం బయుటికి వెళ్లగా.. ఇదే అదనుగా భావించి విలువైన నగలను భావన కాజేసి, బయటికి తరలించింది. ఏడు డైమండ్ నెక్లెస్‌లతో పాటు 24 జతల చెవి రింగులు, ఆరు బంగారు గాజులు, నాలుగు డైమండ్ బ్రాస్‌లెట్లను తన ప్రియుడికి అందజేసింది. ఆపై ఏమీ ఎరగనట్లు ఇంట్లో పనులు చక్కబెట్టుకోసాగింది. నగలు మాయైమెన సంగతి గుర్తించిన అనంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో భవానిపై సందేహం ఉందని పేర్కొన్నాడు. ఈ నెల 7న పోలీసులు భవానీని విచారించగా.. తనకేమీ తెలియుదని బుకాయించింది. గతంలోనే తను ఉద్యోగం మానేస్తానని చెప్పినా.. మరొక నమ్మకస్తురాలు దొరికేంత వరకూ కొనసాగాలంటూ యజమాని కోరడంతో ఇక్కడే ఉన్నానని చెప్పింది. భవాని ఫోన్ కాల్స్ జాబితాను విచారించగా.. సెప్టెంబరు 7న ఒకేరోజు సురేశ్ కుమార్‌తో 25 సార్లు మాట్లాడినట్లు తేలింది.

ప్రతిసారీ సుదీర్ఘంగా మాట్లాడడంతో భవానీపై మరింత అనుమానం పెరిగిందని, ఆమె కదలికలపై నిఘా పెట్టి గత శనివారం నాడు చెన్నైలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. భవానీని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకుందని, ఆ నగలను తన ప్రియుడు సురేశ్, అతడి సహాయకురాలు పుష్పకు అందజేసినట్లు తెలిపింది. ప్రస్తుతం నగలు ఎక్కడున్నాయనే విషయం తెలిసినా.. కోర్టు ద్వారానే వాటిని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రియుడు సురేశ్‌ను పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడాలనే ఉద్దేశంతోనే నగల చోరీకి పాల్పడినట్లు భవానీ తెలిపింది. నగలను దొంగిలించి సురేశ్, పుష్పలకు అందజేశానని చెప్పింది. చోరీ కార్యక్రమం విజయువంతం అయ్యాక తదుపరి కార్యక్రమం ఏంటనే విషయాన్ని, తను చేయాల్సిన ఇతర పనులకు సంబంధించి ప్రియుడితో మాట్లాడేందుకు శనివారం చెన్నై వచ్చింది. అప్పటికే భవానీపై నిఘా పెట్టిన పోలీసులు.. చెన్నైలో ఆమెను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. పరారీలో ఉన్న సురేశ్ కుమార్, పుష్పల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Next Story