కూటమి ఎత్తులతో కారు జోరుకు బ్రేకులు..? కాంగ్రెస్ అస్త్రాలతో కారు ఉక్కిరి బిక్కిరా..!?

కూటమి ఎత్తులతో కారు జోరుకు బ్రేకులు..? కాంగ్రెస్ అస్త్రాలతో కారు ఉక్కిరి బిక్కిరా..!?
x
Highlights

కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు పాత వివాదాలను తవ్వి తీస్తున్నారు. అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్‌కు ఏకకాలంలో చెక్ పెట్టేలా వ్యూహరచన...

కారు జోరుకు బ్రేకులు వేసేందుకు కాంగ్రెస్ నేతలు పాత వివాదాలను తవ్వి తీస్తున్నారు. అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్‌కు ఏకకాలంలో చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నారు. కారు, కమలం వేర్వేరు కాదంటూ ఇప్పటి వరకు ప్రచారం చేసిన హస్తం నేతలు తాజాగా కుమ్మక్కులుకు సాక్షాలు ఇదిగో అంటూ అవినీతి ఆరోపణలు వెలికి తీస్తున్నారు . పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ నేతలు ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు దాడి పెంచుతున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు తాజాగా కేసీఆర్ కార్మిక శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ భవన నిర్మాణంలో పెద్ద కుంభకోణం జరిగిందని నామినేషన్‌ పద్దతిలో సీవీసీ గైడ్‌లైన్స్‌కు అతీతంగా ఆ పనులు ఇచ్చారని ఆరోపించారు.

తనపై ఉన్న కేసులను కొట్టివేయించుకునేందుకే మోడీతో కేసీఆర్ జతకట్టారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలోనే కేసీఆర్‌, మోదీల ఏర్పడిన రహస్య బంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోందని విమర్శించారు. ఈఎస్‌ఐలో జరిగిన అక్రమాలను సీబీఐ బయటపెడుతున్న సందర్భంలోనే కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారంటూ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఏ-1గా ఉన్న ఉన్న కేసీఆర్‌ కంటి శస్త్రచికిత్స పేరుతో ఢిల్లీ వెళ్లి ఛార్జిషీట్‌లో తన పేరును తొలగించుకున్నారని ఆరోపణలు చేశారు. సహారా కుంభకోణంలో కూడా కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషించారని, ఆ కుంభకోణంలో ఎన్ని కోట్ల కమీషన్‌ వచ్చిందంటూ ఆరోపణలు గుప్పించారు.

బీజేపీతో ఉన్న రహస్య ఒప్పందం కారణంగానే విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకపోయినా ప్రశ్నించడంలేదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను విమర్శిస్తున్న కేసీఆర్‌ ప్రధాని, బీజేపీలను ప్రశ్నించకపోవడం వెనక కేసులే కారణమన్నారు. గడచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనికి కేసీఆర్ అండగా నిలవడం రహస్య బంధానికి సాక్షమన్నారు. తాజా ఆరోపణలతో అటు మోడీని ఇటు కేసీఆర్‌ను కాంగ్రెస్ టార్గెట్ చేసినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసు వ్యవహారంలోనే గతంలోనే వెలుగుచూసిన బీజేపీతో ముడిపెట్టి ఆరోపణలు చేయడం వెనక రాజకీయ ప్రయోజనాలున్నట్టు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories