చేతికి అస్త్రాలు చిక్కాయ్.. మరి హోదా వస్తుందా?

x
Highlights

విభజన దెబ్బకి నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయిన కాంగ్రెస్ ఏపిలో మళ్లీ చిగురిస్తోందా? ఏపి ప్రజలు బలంగా కోరుకుంటున్న హోదాను తామే ఇస్తామంటూ ముందుకు రావడం...

విభజన దెబ్బకి నామ రూపాలు లేకుండా కొట్టుకుపోయిన కాంగ్రెస్ ఏపిలో మళ్లీ చిగురిస్తోందా? ఏపి ప్రజలు బలంగా కోరుకుంటున్న హోదాను తామే ఇస్తామంటూ ముందుకు రావడం వెనక అదే ప్లాన్ ఉందా? అంది వచ్చిన అస్త్రాలను ఉపయోగించి పోగొట్టుకున్న హోదాను తిరిగి తెచ్చుకుంటుందా?

పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని కాంగ్రెస్ ఆశపడుతోందా? గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే అదే నిజమనిపిస్తోంది. విభజన తర్వాత ప్రత్యేక హోదా అంశాన్ని బిజెపి రాజకీయ అంశంగా మార్చేయడంతో కాంగ్రెస్ లోనూ ఆశలు పెరిగాయి.. విభజించినందుకు కుప్ప కూలిన కాంగ్రెస్ ఇప్పుడు తిరిగి పునర్వైభవాన్ని పొందాలనుకుంటోంది. అందుకే ఏపిలో పెరుగుతున్న హోదా ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తోంది. హోదాపై వైసిపి తొలినుంచి చేస్తున్న ఉద్యమం ఇతర పార్టీలనూ ఈ గోదాలోకి దింపింది. ప్యాకేజీ చాలని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చి యూ టర్న్ తీసుకున్న చంద్రబాబు కూడా ఏపి హోదాపై పట్టుదలతో పోరాడుతుండటంతో ప్రత్యేక హోదా రాజకీయ అంశంగా మారిపోయింది. వైసిపి, హోదా సాధన సమితి, ఊరూ వాడ ఉద్యమాలతో హోరెత్తిస్తుంటే టిడిపి కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో హోదా పోరు మొదలు పెట్టింది. పరిస్థితిని గమనించిన ఏపి కాంగ్రెస్ కూడా తమకు చేతనైనరీతిలో హోదా కోసం పోరాటాలు మొదలు పెట్టింది.గత పార్లమెంటు సమావేశాల్లో ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ లో ఏపి కాంగ్రెస్ నేతలు దీక్షలు, ధర్నాలు చేశారు. ఇదే ధర్నాకు హాజరైన రాహుల్ తాము అధికారంలోకి వస్తే ఏపికి హోదా ఇస్తామని ప్రకటించారు. అంతేకాదు ఏఐ సీసీలోనూ, సిడబ్ల్యూసిలోనూ తీర్మానాలు చేశారు. అడ్డుపడటానికి ప్రయత్నించిన ఇతర రాష్ట్రాల వారిని వారించారు.

కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కోసం మాజీ ఎంపీలే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పళ్లం రాజు, జేడీశీలం మధ్యవర్తిత్వంతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరారు. అంతే కాదు ఏపిలో కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవాలంటే చంద్రబాబు కాదు జగన్ ను టార్గెట్ చేయాలంటూ రాహుల్ తో చర్చించారు. రాహుల్ కూడా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పడంతో ఏపిలో కాంగ్రెస్ మళ్లీ క్రియాశీలకం కాబోతోందనిపిస్తోంది.

వందేళ్ల పార్టీ.. రాజకీయ ఎత్తుగడల్లో విఫలమైతే ఆ పార్టీనే నమ్ముకున్న నేతల భవిష్యత్తు అయోమయంలో పడిపోవాల్సిందేనా ? మోడు వారిన కాంగ్రెస్ కి కిరణ్ రాక కొత్త ఊపిరినిస్తుందా? పవర్ లో ఉన్న పార్టీల వైఫల్యాలపై గురి చూసి కొడితే కాంగ్రెస్ కి పట్టు దొరుకుతుందా?

ఏపి విభజన కాంగ్రెస్ నేతల కొంపముంచింది. విభజన దెబ్బకు 2014 ఎన్నికల్లో ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా సాధించకపోగా 99 శాతం నియోజక వర్గాల్లో డిపాజిట్ కోల్పోయింది. అవకాశమున్న నేతలు పక్క పార్టీలకు వెళ్లిపోగా పార్టీ మారడం ఇష్టం లేని నేతలు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన ఎంపీలపై కాంగ్రెస్ పార్టీ వేటేసింది. ఇక మరికొందరు ఉద్దేశ పూర్వకంగానే పార్టీకి దూరమయ్యారు ఇప్పుడు రాష్ట్రం అయోమయ స్థితిలో పడిపోవడంతో కాంగ్రెస్ మాజీలంతా యాక్టివ్ అవుతున్నారా?ప్రత్యేక హోదా జాతీయ పార్టీలతోనే సాధ్యమంటున్న నేతలు ఇప్పుడు ఒక్కరొక్కరుగా బయటకొస్తున్నారు. నెమ్మది నెమ్మదిగా స్పందిస్తున్నారు. మాజీ నేతలు పళ్లం రాజు, జె.డీ. శీలం, పనబాక లక్ష్మి, కనుమూరి బాపిరాజు, కొణతాల రామకృష్ణ, సబ్బం హరి, వట్టి వసంత కుమార్, శైలజానాథ్, కొండ్రు మురళి మళ్లీ కాంగ్రెస్ వైపే చూస్తున్నారు.ఇన్నాళ్లూ క్రియాశీలకంగా లేని నేతలు కిరణ్ రాకతో ఇక క్రియాశీలకమవుతారా అన్నది చూడాలి. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా ఇప్పటి వరకూ తనదైన మార్క్ ఏదీ చూపించలేదు కానీ ఆయన నేతలతో వ్యక్తిగతంగా ఫోన్లలో మాట్లాడుతున్నట్లు సమాచారం.

విభజనపై అంపశయ్య పైకి చేరిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడం కూడా ఒకందుకు మంచిదే అనుకుంటోంది విభజనను సహేతుకంగా చేసి ఉంటే ఏపి ప్రజలు మరో పార్టీవైపు చూసే వారే కాదు విభజించినందుకు కాంగ్రెస్ కు పెద్ద శిక్ష వేసింది ఏపి ప్రజ.. విభజన సరిగా చేసి ఉంటే కాంగ్రెస్ బతికే అవకాశమే ఉండేది కాదు కానీ ఏపికి జరిగిన అన్యాయాన్ని భర్తీ చేయడంలో పార్టీలన్నీ మోసగిస్తుండటంతో జాతీయపార్టీలతోనే ఈ నష్ట నివారణ సాధ్యమని జనం భావిస్తున్నారు కాంగ్రెస్ కూడా తమకు అవకాశం వస్తే చేసిన తప్పును సరిదిద్దుతామంటోంది. అలాంటి టైమ్ లో వచ్చిన హోదా అస్త్రాన్ని కాంగ్రెస్ కూడా అంది పుచ్చుకుంది. తాము అధికారంలోకి వస్తే హోదాపైనే తొలిసంతకం చేస్తామని రాహుల్ గాంధీ బాహాటంగా ప్రకటించడంతో ఏపి కాంగ్రెస్ లో ఇప్పుడిప్పుడే కొత్త జోష్ కనిపిస్తోంది. అలాగే కాపు రిజర్వేషన్ల అంశం కాపు రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. సుప్రీం కోర్టు పరిమితులకు లోబడి అది సాథించాలంటే అన్ని పార్టీలను, సామాజిక వర్గాలను ఒప్పించగలగాలి రాజ్యాంగ సవరణ చేయించగలగాలి ఇలాంటి పనులు జాతీయ స్థాయి పార్టీలు మాత్రమే చేయగలవు అందుకే కాంగ్రెస్ కాపు రిజర్వేషన్లకు కూడా సై అంటోంది. ఏపిలో అధికారం ఎవరిదో డిసైడ్ చేసే కాపుల రిజర్వేషన్ పై అన్ని పార్టీలూ తలోమాట మాట్లాడుతున్నాయి. అందరినీ ఒప్పించి కాపు రిజర్వేషన్లు సాధిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలను నమ్మిస్తోంది.

మొత్తం మీద ఏపి కాంగ్రెస్ లో హుషారు పెరుగుతోంది. కాంగ్రెస్ క్రియాశీలకంగా మారితే పళ్లం రాజు, కిల్లి కృపారాణి, పనబాక, శీలం, లాంటినేతలు మళ్లీ రాజకీయాల్లో కనిపించే అవకాశం ఉంది. రాజకీయాల నుంచి తాను రిటై ర్మెంట్ తీసుకున్నానని ఉండవల్లి ఇప్పటికే ప్రకటించారు. తన కుమారుడి పెళ్లి పత్రికలు పంచడానికి లగడపాటి ఆ మధ్య కనిపించినా, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని లగడపాటి చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ మినహాయిస్తే మిగతా వారు మాత్రం ఎన్నికల రాజకీయాల్లో క్రియాశీలకమవ్వాలని ఉబలాటపడుతున్నారు.

మొత్తం మీద కాంగ్రెస్ పునర్వైభవం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏపికి ప్రత్యేక హోదా తామే ఇస్తామని ప్రకటించడం ద్వారా, కాపు రిజర్వేషన్ల కల సాకారం చేస్తామనడం ద్వారా పరిస్థితులను తమవైపు తిప్పుకుంటోంది కాంగ్రెస్. మరి ఈ పాచికలన్నీ ఫలించి కాంగ్రెస్ మళ్లీ పాత కళను సంతరించుకుంటుందా? ఏమో చూడాలి ఏం జరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories