అవునా... కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులున్నారా? హన్మన్న అలా అన్నారేంటి?

అవునా... కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులున్నారా? హన్మన్న అలా అన్నారేంటి?
x
Highlights

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలు, ఆ పార్టీలో నిద్రాణంగా ఉన్న అసంతృప్తి సెగలను రాజేశాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్...

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఎన్నికల కమిటీలు, ఆ పార్టీలో నిద్రాణంగా ఉన్న అసంతృప్తి సెగలను రాజేశాయి. తమకు తగిన అవకాశలు దక్కలేదంటూ పలువురు సీనియర్ నేతలు, నోటికి పని చెప్పారు. ఎన్నికల ముంగిట్లో సమరోత్సాహంతో వెళ్లాల్సిందిపోయి, సంచలన వ్యాఖ్యలతో పార్టీల్లో కల్లోలం రేపుతున్నారు.
కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో స్థానాలపై అలక బూనిన సీనియర్‌ నాయకుడు వి. హనుమంతారావు, పార్క్‌ హయత్‌ హోటల్‌లో గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌ పదవి వస్తుందని ఆశించానని.. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన వాపోయారు. ఇదే సమయంలో వీహెచ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పార్టీలో కేసీఆర్‌ కోవర్టులున్నారని.. తనకు పదవి వస్తే.. కేసీఆర్‌ను ఓడిస్తాననే భయం.. కోవర్టుల్లో ఉందని వీహెచ్‌ ఆరోపించారు. అందుకే తనకు పదవి రాకుండా చేశారని ఆరోపించిన వీహెచ్‌.. వారి పేర్లను డైరెక్ట్‌గా రాహుల్‌గాంధీ ముందే చెబుతానని స్పష్టం చేశారు. 1989 లో ప్రచార కమిటీ ఛైర్మెన్‌గా ఉండి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానన్న వీహెచ్‌.. ప్రస్తుతం కూడా అదే పదవి వస్తుందని ఆశించానని అన్నారు.

వి. హనుమంత రావు గతంలోనూ పార్టీ నేతలపై ఇలాంటి ఘాటు వ్యాఖ్యలే చేసినా, అందరూ లైట్‌ తీసుకునేవారు. ఈసారి చేసిన కామెంట్లు మాత్రం, అలా పక్కనపెట్టేయడానికి వీల్లేదు. ఎన్నికల ముంగిట్లో ఉన్న సమయంలో, కేసీఆర్‌ కోవర్టులు పార్టీలో ఉన్నారన్న కామెంట్లు, నిజంగా సంచలనమే. మరి ఎవరిని ఉద్దేశించి వీహెచ్‌ అలాంటి మాటలన్నారన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వీహెచ్‌ ప్రధాన అభ్యంతరం కమిటీల కూర్పుపైనే. కానీ కమిటీలపై స్పష్టమైన ముద్ర కనిపిస్తున్నది పీసీసీ చీఫ‌‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిదే. కేవలం తన ఆలోచనల ప్రకారం కమిటీలకు ఆమోదముద్ర వేయించుకున్నారన్నది అసంతృప్త నేతల భావనగా కనిపిస్తోంది. అంతేకాదు, అధిష్టానం దగ్గర ఆశీస్సులు దండిగా ఉన్న కేవీపీ కూడా కమిటీల జాబితాలో జోక్యం చేసుకున్నారని, గాంధీ భవన్‌లో నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో వీహెచ్‌ చేసిన, కోవర్ట్ వ్యాఖ్యలు నిజంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరి త్వరలో రాహుల్‌ గాంధీ ఎదుట, కోవర్టు జాబితా చెబుతానంటున్న, వీహెచ్ అందులో ఎవరెవరి పేర్లు బయటపెడతారో చూడాలి.

మరోవైపు కాంగ్రెస్ కమిటీలపై కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని తీవ్ర ఆరోపణలు చేశారు. వార్డు మెంబర్స్‌గా కూడా గెలవలేనోళ్లను కమిటీలో వేశారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మొత్తానికి ఎన్నికల కమిటీలపై సీనియర్ నాయకుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అయితే, పార్టీలో ఎలాంటి మార్పులొచ్చినా, కాంగ్రెస్‌లో ఇలాంటి వ్యాఖ్యలు మామూలే. ప్రాంతీయ పార్టీల్లా కాంగ్రెస్‌లో నియంతృత్వం ఉండదని, ప్రజాస్వామ్యం ఉంటుందని చెప్పుకునే నేతలు, కీచులాడుకోవడం మామూలేనని అంటారు. కేవలం కమిటీలు ప్రకటించినందుకే ఇలాంటి రచ్చరచ్చ అయితే, అభ్యర్థుల జాబితా వెల్లడించిన తర్వాత, ఇంకెన్ని రగిలే స్వరాలు భగ్గుమంటాయో చూడాలి. వీరిని చూసి ప్రత్యర్థి పార్టీలు పండగ చేసుకుంటే, ఈ అసమ్మతి జ్వాలలను ఎలా ఆర్పాలా అని, కాంగ్రెస్‌ అధిష్టానం తలలు పట్టుకుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories