కాంగ్రెస్‌ ఎక్సర్‌సైజ్‌లో న్యాయం జరిగిందెవరికి?

కాంగ్రెస్‌ ఎక్సర్‌సైజ్‌లో న్యాయం జరిగిందెవరికి?
x
Highlights

నెలన్నరపాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించిన...

నెలన్నరపాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్‌ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించిన కాంగ్రెస్‌.. మిగిలిన 93 స్థానాల్లో 74 సీట్లకు ఈ నెల 8న అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, ఈ జాబితా వెల్లడి కాకుండానే.. వాటిపై పలు ఫిర్యాదులు అందడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ స్వయంగా జోక్యం చేసుకుని.. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్త చరణ్‌దాస్, ఏఐసీసీ కార్యదర్శులతో రెండు విడతలుగా సమావేశమయ్యారు.

నిన్న మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు ఒకసారి, మూడు నుంచి నాలుగు గంటల వరకు మరోసారి భేటీ అయ్యి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. ఇందులో ప్రధానంగా ఇటీవలే పార్టీలో చేరి, అభ్యర్థుల జాబితాలో ఉన్నవారు.. నేతల ఒత్తిళ్లతో అభ్యర్థిత్వాలు దక్కించుకున్నవారిపై చర్చించారు. సామాజిక సమతుల్యం లేనప్పటికీ జాబితాలో ఉన్నవారు, ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అభ్యర్థిత్వాలు పొందినవారితో పాటు పలు వివాదాస్పద అంశాలపై దాదాపు 20 స్థానాల్లో పునఃపరిశీలన జరిపారు. కొన్ని మార్పులు, చేర్పులు చేయించారు. అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ.. రాహుల్‌ సూచనల మేరకు వార్‌రూమ్‌లో సమావేశమై తుదిజాబితా రూపొందించింది. ఈ జాబితాపై సోనియాగాంధీ నివాసంలో రాత్రి ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మరోసారి చర్చించింది. మార్పులు, చేర్పులు ఉన్న స్థానాలపై మాత్రమే చర్చించి ఆమోదించింది. అనంతరం ఉత్తమ్‌, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు కలసి ఏఐసీసీ కార్యాలయంలో కొత్త జాబితాను రూపొందించారు.

పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇన్‌చార్జి ముకుల్‌ వాస్నిక్‌ రాత్రి పదిన్నరకు ఏఐసీసీకి చేరుకుని, దానిని పరిశీలించి అధ్యక్షుడి ఆమోదానికి పంపి.. చివరకు 65 మందితో కూడిన జాబితాను రాత్రి 11గంటల 15నిమిషాలకు విడుదల చేశారు. తొలుత అనుకున్న 74 స్థానాల్లో 9 స్థానాలు నిలిపివేశారు. దీంతో పాటు మరికొన్ని మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. ఏకాభిప్రాయం ఉన్న స్థానాలకే తొలి జాబితాలో చోటు ఇచ్చారు. సిట్టింగ్‌ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు ఈ జాబితాలో చోటు దక్కింది. అయితే, మరికొన్ని ముఖ్యమైన స్థానాలను కూడా పెండింగ్‌లో పెట్టారు. సనత్‌నగర్‌ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి, జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య అభ్యర్థిత్వాలను ఆశించినప్పటికీ ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. మిత్రపక్షాలు కోరుతుండటంతో ఈ స్థానాలను పెండింగ్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. అలాగే మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రాని మేడ్చల్, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌ తదితర స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్న స్థానాలను పెండింగ్‌లో పెట్టారు.

కూటమి పోటీ చేసే స్ధానాలు, కాంగ్రెస్ సీనియర్లు కోరుతున్న స్ధానాలు ఒకటే ఉండటంతో ఈ వ్యవహారంపై చాలా రోజులుగా క్లారిటీ రాలేదు. పారాచ్యూట్ నేతలకు టికెట్లు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించారంటూ అధినేత రాహుల్ కు ఫిర్యాదులు అందాయి. దీంతో చివరి నిమిషంలో జాబితాకు బ్రేకులు వేసిన రాహుల్ .. జాబితాను మరోసారి సమీక్షించాలని స్క్రీనింగ్ కమిటీని ఆదేశించారు.స్క్రీనింగ్‌ కమిటీ, పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ మొత్తం 93 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం 65 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వచ్చిన అనంతరం 28 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించనున్నారు. మరోవైపు రెబల్స్‌ బెడదను తట్టుకునేందుకు, వలసలను నివారించేందుకు వ్యూహాత్మకంగా రెండో జాబితాను ఆలస్యంగా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories