టీ కాంగ్రెస్‌లో చిచ్చురేపిన ముందస్తు ఎన్నికల ప్రచారం

టీ కాంగ్రెస్‌లో చిచ్చురేపిన ముందస్తు ఎన్నికల ప్రచారం
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్ లో నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శుల ఎదుటనే బల ప్రదర్శనకు దిగుతున్నారు. టిక్కెట్ల కోసం లొల్లి చేస్తున్నారు....

తెలంగాణ కాంగ్రెస్ లో నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శుల ఎదుటనే బల ప్రదర్శనకు దిగుతున్నారు. టిక్కెట్ల కోసం లొల్లి చేస్తున్నారు. ఎన్నికల ఏడాది ముందే పార్టీ నేతలు బాహాబాహీకి దిగడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది.

తెలంగాణ కాంగ్రెస్‌లో ముందస్తు ఎన్నికల ప్రచారం దుమారం రేపుతోంది. అధికార టీఆర్ ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధం అని ప్రకటించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సై అంది. కాంగ్రెస్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఏఐసిసి కార్యదర్శుల జిల్లాల పర్యటనలో కాంగ్రెస్ నేతలు టిక్కెట్ల కోసం ఆందోళన చేస్తున్నారు.

ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో తెలంగాణలో పార్టీ పటిష్టతపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. ప్రస్తుత ఇన్ చార్జ్ కుంతియాకు ఏఐసీసీ కార్యదర్శులు బోస్ రాజు, సలీం అహ్మద్, శ్రీనివాసన్ కృష్ణన్ లను సహాయకులుగా నియమించింది. జిల్లాల్లో పార్టీ సమస్యలు గుర్తించి చక్కదిద్దేందుకు ఏఐసీసీ కార్యదర్శులు పార్లమెంట్ స్థానాలవారీగా రివ్యూలు ప్రారంభించారు.

గాంధీ భవన్ లో హైదరాబాద్, భువనగిరి, నిజమాబాద్ పార్లమెంటు రివ్యూల్లో గ్రూపు తగాదాలు రచ్చకెక్కాయి. సికింద్రబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ క్రికెటర్ అజాహరుద్ధీన్ ప్రకటనపై హైదరాబాద్ సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగారు. విహెచ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఆయన సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక భువనగిరి సీటుపై కోమటి రెడ్డి, ఉత్తమ్ వర్గీయులు తమ వర్గానికి టిక్కెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మూడు పార్లమెంట్ స్థానాల రివ్యూలు రసాభాసగా ముగిశాయి.

పార్టీ గ్రూపు తగదాలపై ఏఐసిసి కార్యదర్శులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రివ్వూ కంటే పార్టీ నేతల మధ్య గొడవలు చక్కదిద్దడానికే పుణ్యకాలం సరిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు సమీక్ష సమావేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై తలలు పట్టుకుంటున్నారు. టిక్కెట్ల కోసం కాంగ్రెస్ లో లొల్లి ఎప్పుడూ జరిగేది అని, ఇదంతా జనానికి తెలుసు అని కొందరు కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories