Top
logo

రుణ మాఫీపై విపక్షాల కొత్త ఆఫర్...విపక్షాల ఆఫర్ పై కేసిఆర్ సర్వే

X
Highlights

ఎన్నికల వేళ అన్నదాతతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్న కేసిఆర్ ప్రయత్నాలను విపక్షాలు దెబ్బ తీస్తున్నాయా? రైతు...

ఎన్నికల వేళ అన్నదాతతో బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్న కేసిఆర్ ప్రయత్నాలను విపక్షాలు దెబ్బ తీస్తున్నాయా? రైతు బంధుతో మరోసారి అధికారం గ్యారంటీ అని సర్కార్ భావిస్తుంటే రుణ మాఫీ అస్త్రానికి పదును పెట్టి సంధిస్తున్నాయి కాంగ్రెస్, బిజెపి. రైతు బంధు చెక్కులు అందుకున్న రైతులు కూడా ఇప్పుడు మాఫీ మాయాజాలానికి ఆకర్షితులవుతున్నారన్న వార్త గులాబీ బాస్ ని కలవరానికి గురి చేస్తోంది.

తెలంగాణలో ఓట్ల వేట మొదలవుతోంది. రైతే అన్ని పార్టీలకు ముద్దొస్తున్నాడు ఖరీఫ్‌ సాగు కోసం రైతులు సిద్ధమవుతుంటే వారి ఓట్ల కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే రైతు బంధు, రైతు భీమా పథకాలతో రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమాతో ఉన్న టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేశాయి. రైతు కుటుంబాల ఓట్లు గుంపగుత్తగా కొల్లగొట్టే లక్ష్యంతో తాము అధికారంలోకి వస్తే 50 వేల నుంచి రెండు లక్షల లోపు పంట రుణాలను ఒకే విడత మాఫీ చేస్తామంటూ రెండు పార్టీలు ప్రకటించాయి. దీంతో తెలంగాణలో మరోసారి రుణమాఫీ అంశం తెరపైకి వచ్చింది.

ప్రతిపక్షాలు విసురుతున్న రుణమాఫీ గూగ్లీ కేసిఆర్ ను బలంగానే తాకుతోంది. ప్రతిపక్షాల రుణ మాఫీ హామీపై కేసీఆర్‌ జరిపిన క్షేత్రస్ధాయి సర్వేతో పాటు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌లో అధికార పార్టీకి మింగుడుపడని విషయాలు వెలుగుచూశాయనే ప్రచారం జరుగుతోంది. రైతు బంధు, రైతు బీమా పథకాల కంటే ఒకేసారి రుణమాఫీకి రైతులు ఆసక్తి చూపుతున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పథకం చెక్కులను 58 లక్షల మంది రైతులు అందుకున్నారు. ఇందులో వంద రూపాయల నుంచి పది వేల వరకు అందుకున్న రైతులు 99 శాతం మంది ఉన్నారు. వీరిలో అధిక శాతం రైతులు రుణమాఫీ హామికే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది.

రైతు బంధు, రైతు బీమా పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. దీని ద్వారా ఎకరాకు పెట్టుబడి సాయం కింద ఎనిమిది వేల రూపాయలు అందించడంతో పాటు 5 లక్షల మంది రైతులకు ఇన్సురెన్స్ కల్పిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఆశించిన స్ధాయిలో ప్రయోజనం లేదనే సర్వేలు ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ప్రతిపక్షాల రుణమాఫీ హామీ ఏమాత్రం సాధ్యం కాదంటూ కేసీఆర్‌ ఎదురుదాడికి దిగారు. ప్రస్తుతం నెలకు 10 వేల 525 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా ఇందులో 2 వేల కోట్లు రుణాలకు, ఆరువేల కోట్లు ఉద్యోగుల జీతాలు, ఆసరా పించన్ల కోసం ఖర్చు చేస్తుండగా మిగిలిన రెండు వేల 500కోట్ల రూపాయలను ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నామని ఇలాంటి పరిస్ధితుల్లో రుణమాఫీ ఎలా సాధ్యమంటూ కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు ఇవ్వకుండా రుణమాఫీ అమలుచేస్తారా అంటూ ప్రశ‌్నలు సంధిస్తున్నారు.

మొత్తానికి 2014 ఎన్నికల్లో కీలకంగా మారిన రుణమాఫీ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే నాడు హామి ఇచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతుంటే ప్రతిపక్షాలు నేతలు తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ ఖాయమంటూ ప్రకటనలు చేస్తున్నారు.

Next Story