Top
logo

సి.కె. బాబు పయనమెటు?

X
Highlights

చిత్తూరులో రాజకీయం క్షణానికో రకంగా మారుతోంది. నియోజక వర్గం గడప దాటని సి.కె. బాబు వైపు ఇప్పుడు మొత్తం చిత్తూరు...

చిత్తూరులో రాజకీయం క్షణానికో రకంగా మారుతోంది. నియోజక వర్గం గడప దాటని సి.కె. బాబు వైపు ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లా చూస్తోంది. నమ్ముకున్న కాంగ్రెస్ ను విభజన పాతరేసింది. పార్టీ మారడం ఇష్టం లేని నేతలు సైలెంట్ గా అజ్ఞాతంలోకి వెళ్లిపోగా కొత్త పార్టీలు పుట్టుకొచ్చి స్థానికంగా బలపడుతుండటంతో చిత్తూరు రాజకీయాల్లో దిగ్గజం లాంటి సి.కె. బాబు ఎటు వెళ్లాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారా? సి.కె. బాబు చూపు ఎటు?

చిత్తూరు జిల్లాలో సి.కె. బాబుకు ఒక ప్రత్యేకత ఉంది. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన బాబు హవాకు చిత్తూరులో ఎదురే లేదు. ఎన్టీఆర్ ప్రభంజనం బాగా ఉన్న రోజుల్లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన సికె రాజకీయం ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో పడింది. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏ పార్టీ వైపు చూడబోతున్నారు అన్న అంశంపై చిత్తూరు రాజకీయ నేతల్లో పెద్ద చర్చ జరుగుతోంది.

రాయలసీమ జిల్లాలకు విభిన్నమైన రీతిలో చిత్తూరు జిల్లా ఉన్నప్పటికీ కక్షలు, ముఠా రాజకీయాలు చిత్తూరులో కనిపిస్తాయి. ఆధిపత్య పోరు అడుగడుగునా కనిపిస్తూనే వుంటుంది. చుట్టూ పది కిలోమీటర్ల పరిధి కూడా లేని చిత్తూరు నగరంపై, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ పై పట్టుకోసం ఎప్పటికప్పుడు అందరూ ఆరాట పడుతుంటారు. నాలుగు పర్యాయాలు వరుసగా గెలిచిన సికె ప్రస్థానం కూడా అలా మొదలైందే.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సికె బాబు వైయస్ వర్గీయుడుగా ముద్రపడ్డారు. వైయస్ వర్గీయుడుగానే కాదు, ఆయనకు ఆత్మీయుడుగానూ మెలిగారు. వైయస్ మరణం తరువాత జిల్లాలో అదే పార్టీలోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గంతో వున్న వైరంతో ఆయన ప్రత్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో కలిశారు. అయితే ఎపి విభజన తరువాత కాంగ్రెస్ ఒక్క చోట కూడా ధరావత్తు దక్కని పార్టీగా మిగిలింది. అక్కడి నుంచే సికె కష్టాలు మొదలయ్యాయి. సమైక్యాంధ్ర కోసం కాంగ్రెస్ పార్టీని వీడిన సికె బాబు ఆ తర్వాత వైసిపికి దగ్గరయ్యారు. కుల సమీకరణల వల్ల గత ఎన్నికల్లో సికెకు వైసిపిలో టిక్కెట్టు దక్కలేదు. దీంతో కొంత కాలం వైసిపికి దూరమయ్యారు. సొంతంగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఆ తరువాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ పడ్డా ఆయన వర్గానికి భంగపాటు తప్పలేదు. భార్యను పోటీ పెడితే ఆమె కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అదే సమయంలో వైసిపిలో నుంచి ఆహ్వానం రావడంతో మళ్ళీ వైసిపితోనే కలిసి రాజకీయ అడుగులు వేస్తూ వచ్చారు. ఆ తరువాత జరిగిన పరిణామాలలో చిరకాల రాజకీయ ప్రత్యార్థి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వర్గానికి వైసిపిలో ఆధిపత్యం పెరిగింది. స్వతహాగానే ఆయన ఆధిపత్యాన్ని వ్యతిరేకించే సికెకు మళ్ళీ అక్కడా చుక్కెదురైంది.

పార్టీ నుంచి బయట పడక తప్పలేదు. ఈసారి సికె ఏకంగా కమలం కండువా కప్పుకున్నారు. అమిత్ షా వద్ద బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. హోదాపై గొడవలు ముదిరి బిజెపి, టిడిపి కటీఫ్ అనడంతో సికె రాజకీయ భవితవ్యం మళ్లీ అయోమయంలో పడింది ఏపిలో బిజెపికి పెద్దగా ప్రాధాన్యతలేక పోవడంతో ఆయన మళ్లీ మనసు మార్చుకున్నారు. బిజెపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సొంతంగా వార్డుల్లో కలియ తిరుగుతున్నారు సికే బాబు. అన్ని పార్టీలలోనూ చేరి మళ్లీ వెనక్కి వచ్చేసిన సికే ఇప్పుడేం చేస్తారు? కలసి రాని రాజకీయాల్లోనే సొంతంగా కొనసాగుతారా? లేక తనకు ఆప్తుడైన కిరణ్ కుమార్ రెడ్డి వెంట కాంగ్రెస్ లోకి చేరతారా అన్నది తెలియడం లేదు. అన్ని పార్టీలనూ కాదని సికే చేసేదేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే క్యాడర్ మాత్రం సికె పయనమెటైనా ఆయన వెంటే మేముంటామంటున్నారు. ఎటూ తేలని సికె భవితవ్యంతో చిత్తూరు జిల్లా రాజకీయం ఆసక్తి కరంగా మారింది.

Next Story