కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్రం గురి

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పై కేంద్రం గురి
x
Highlights

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్టేట్‌మెంట్ తర్వాత.. తెలంగాణపై కేంద్రం ఫోకస్ పెంచిందా..? మంత్రులతో పాటు కీలక పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై ఎందుకు నిఘా...

కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్టేట్‌మెంట్ తర్వాత.. తెలంగాణపై కేంద్రం ఫోకస్ పెంచిందా..? మంత్రులతో పాటు కీలక పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నేతలందరిపై ఎందుకు నిఘా పెంచారు.? రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు ఇంటలిజెన్స్ బ్యూరో కేంద్రానికి రిపోర్ట్ ఇస్తోందా.? కేసీఆర్‌, కేంద్రం, ఫెడరల్ ఫ్రంట్‌.. అంతా బాగానే ఉన్నా.. సింక్ లేకుండా వెనక కనిపిస్తున్న వాట్సాప్ సింబల్‌కు ఏంటి లింక్.? అది తెలుసుకోవాలంటే.. ముందు ఇది తెలుసుకోవాలి..

ఒకే ఒక్క ప్రకటనతో సీఎం కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి దిగినంత పనిచేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని నిధులు సకాలంలో ఇవ్వడం లేదని పోరాటం మొదలుపెట్టారు. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలంటే నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ కూటమి రావాలన్నారు. అందుకు ఫెడరల్ ఫ్రంట్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు కేసీఆర్ ఫ్రంట్‌పైనే చర్చ జరుగుతోంది.

కేంద్రంపై పోరాటానికి సిద్ధమని కేసీఆర్ ప్రకటించడంతో రాష్ట్రంపై కేంద్రం ఫోకస్ పెంచిందని టీఆర్ఎస్ నేతలకు సమాచారం వచ్చింది. రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాలపై ఇంటలిజెన్స్ వర్గాలు కేంద్రప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారని టీఆర్ఎస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ కాల్స్, నేతలతో భేటీలు, రాజకీయ సమాలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కీలక విషయాల్లో గోప్యత పాటించాలని పార్టీలో కీలక నేతలకు గులాబీ బాస్ హెచ్చరికలు జారీ చేశారట.

కేంద్రంతో పోరాటానికి దిగుతున్నాం కాబట్టి వాళ్ల ఆధీనంలోని దర్యాప్తు, నిఘా సంస్థలు ఏ క్షణమైనా రంగంలోకి దిగే చాన్స్ ఉందని చిన్న తప్పు కూడా జరగకుండా జాగ్రత్త పడాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశాలిచ్చారట. ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు కీలక నేతలంతా అనుక్షణం జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. ఒకరి తప్పులు ఎత్తి చూపిస్తున్న టైంలో తామే తప్పు చేసి దొరికిపోతే పరిస్థితి ఘోరంగా తయారవుతుందన్నారట. ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ఏ చిన్న తప్పు జరిగినా కేంద్రం చేతిలో బుక్ కావాల్సి వస్తుందని ముందస్తుగానే హెచ్చరించారట కేసీఆర్.

కేసీఆర్ ఆదేశాలతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలంతా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారట. ఎవరితో ఏం మాట్లాడితో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారట. రాజకీయ వ్యూహాలను ఇతర విషయాలను తెలుసుకునేందుకు ఫోన్లు ట్యాప్ చేసే చాన్స్ ఉందని అందుకు ఆస్కారమివ్వకుండా ఉండాలని భావిస్తున్నారు. అందువల్ల రెగ్యులర్ ఫోన్ కాల్స్ కాకుండా వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటున్నారట టీఆర్ఎస్ లీడర్లు. ఏదైనా సీక్రెట్‌గా చెప్పాల్సి వస్తే వాట్సాప్ కాల్ చేయాలని సూచిస్తున్నారట.

కేంద్ర నిఘా సంస్థలకు చిక్కకుండా.. టీఆర్ఎస్ నేతలు వాట్సాప్ కాల్స్‌నే ఎందుకు ఎంచుకున్నారు.? వాట్సాప్ కాల్ మాట్లాడితే దొరకలేమని ఎందుకంత ధీమా.? వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లను ట్యాప్ చేయడానికి చాన్స్ లేదా.? అసలు ఫోన్ కాల్ ట్యాపింగ్ చేయడం కరెక్టేనా.? ట్యాపింగ్ చేయాలంటే.. అంతకంటే ముందు ఏం చేయాలి.?

భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం. ఒక వ్యక్తికి తెలియకుండా అతని ఫోన్ ట్యాపింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఒక వ్యక్తి వల్ల దేశానికి ముప్పు పొంచి ఉందని భావిస్తే అది ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసే అవకాశం ఉంది. కానీ అందుకు షరతులు వర్తిస్తాయి. మనకున్న చట్టాలు, నిబంధనల ప్రకారం సెంట్రల్ హోం ఎఫైర్స్‌, స్టేట్ హోం సెక్రటరీ ఆదేశాలు, అంగీకారంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయాలని చట్టం చెప్తోంది. ఎలాంటి తప్పు చేయకపోయినా ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి వాటిని లీక్ చేస్తే మాత్రం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు.

ట్యాపింగ్ సంగతి పక్కనబెట్టి వాట్సాప్ కాల్ వైపు వైళ్దాం. టీఆర్ఎస్ లీడర్లు ఏది సీక్రెట్‌గా మాట్లాడాలనుకున్నా ఇప్పుడు సాధారణ కాల్స్‌ను పక్కనబెట్టి ఇప్పుడు వాట్సాప్ కాల్స్‌నే ఎక్కువగా వాడుతున్నారట. ఎందుకంటే వాట్సాప్ కాల్స్‌ను ట్యాపింగ్ చేసే అవకాశం లేదని చెప్తున్నారు టెక్ నిపుణులు. వాట్సాప్ కాల్స్‌కు, మెసేజ్‌లకు ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం వల్ల ట్యాపింగ్ చేయడానికి వీలు పడదంటున్నారు. ఒకవేళ చేసినా దానిని ఓపెన్ చేయడానికి కుదరదని ఆ డేటా వల్ల అస్సలు ఉపయోగముండదని స్పష్టం చేస్తున్నారు సాంకేతిక నిపుణులు.

Show Full Article
Print Article
Next Story
More Stories