తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సై.. ఎన్ని సీట్లు కొల్లగొట్టబోతుంది..?

తెలంగాణలో ఒంటరి పోరుకు బీజేపీ సై.. ఎన్ని సీట్లు కొల్లగొట్టబోతుంది..?
x
Highlights

బాక్సింగ్‌ రింగ్‌లో ఆల్రెడీ, ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. రక్తాలు కారే పంచ్‌లు కురిపించుకుంటున్నారు. కానీ మధ్యలో మరో ప్రత్యర్థి...

బాక్సింగ్‌ రింగ్‌లో ఆల్రెడీ, ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. రక్తాలు కారే పంచ్‌లు కురిపించుకుంటున్నారు. కానీ మధ్యలో మరో ప్రత్యర్థి దూరాడు. ఇద్దర్నీ ఓడిస్తానంటూ, తొడగొడుతున్నాడు. సకల అస్త్రాలూ వదులుతున్నాడు. ఢిల్లీ నుంచి గల్లీదాకా, బలగం మొత్తం మోహరిస్తానంటున్నాడు. మరి ఇద్దర్నీ ఓడిస్తాడు. ఇద్దరిలో ఒకరి గెలుపుకు సహకరిస్తాడా? ఎవరిపై కురిపించే పంచ్‌లు, ఎవరికి తగులుతాయి. ఎక్కడెక్కడ పంచ్‌లు కురిపించడంలో దిట్ట.?

ఒకవైపు టీఆర్‌ఎస్ మరోవైపు మహాకూటమి ఇంకోవైపు బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య, ఇప్పుడు ప్రధాన పోరు జరుగుతోంది. మూడో బలమైన పక్షంగా, కాషాయదళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. 118 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థులు గల్లీగల్లీలు తిరుగుతుండగా, బీజేపీ చీఫ్ అమిత్‌ షాతో పాటు జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు సైతం, ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. మరి తెలంగాణ పోరును ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, ఎలాంటి లెక్కలు వేసుకుంటోంది....ఒంటరిగా బరిలోకి దిగుతూ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుంది ఎన్ని సీట్లు కొల్లగొడుతుంది. కాషాయం లెక్కలేంటి అంచనాలేంటి? టఫ్‌ ఫైట్‌ ఎక్కడెక్కడ ఇవ్వబోతోంది?

2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని 45 చోట్ల పోటీచేసింది బీజేపీ. అంబర్‌పేట, గోషామహల్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, ఉప్పల్‌ స్థానాలను ఖాతాలో వేసుకుంది. అయితే ఈసారి సైకిల్‌ పార్టీతో పొత్తులేదు. ఒంటరి. టీఆర్ఎస్‌ నుంచి, ప్రజా కూటమి నుంచి బలమైన ప్రత్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో సిట్టింగ్ సీట్లను నిలబెట్టుకునేందుకే చెమటోడుస్తోంది బీజేపీ. అయితే, బీజేపీని అంత ఈజీగా తీసుకోవడానికి లేదని ప్రధాన పార్టీలు కూడా అప్రమ్తతంగా ఉన్నాయి. ఎందుకంటే, కొన్ని చోట్ల హోరాహోరిగా తలపడుతుంటే, మరొకొన్ని చోట్ల ఓట్లను చీల్చి, జయాపజయాలను ప్రభావితం చేయబోతోంది కాషాయ పార్టీ.

మల్కాజిగిరి, కరీంనగర్‌, సూర్యాపేట, నిజామాబాద్‌ అర్బన్‌, ముథోల్‌, కల్వకుర్తి, ఆదిలాబాద్‌ వంటిచోట్ల విజయం కోసం హోరాహోరీ పోరాటం చేస్తోంది. వీటిలో చాలాచోట్ల గతంలో రెండోస్థానంలో నిలిచింది. అక్కడక్కడా గెలుస్తాన్న ధీమాను సైతం కాషాయనేతలు వ్యక్తంచేస్తున్నారు. ముషీరాబాద్‌ మళ్లీ తనదేనంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, టీఆర్ఎస్‌ నుంచి ముఠా గోపాల్‌, కాంగ్రెస్‌ నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌ల రూపంలో గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక అంబర్‌పేటలో శాసనసభపక్ష తాజా మాజీ ఎమ్మెల్యే, కిషన్‌రెడ్డికి టీఆర్ఎస్‌ నుంచి కాలేరు వెంకటేశ్‌, టీజేఎస్‌ నుంచి రమేశ్‌ ముదిరాజ్‌ ప్రత్యర్థులు. ఈసారి మజ్లిస్‌ పోటీలో లేకపోవడం..టీఆర్ఎస్‌ నుంచి ఈసారి గట్టి అభ్యర్థి ఉండటం.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీల మద్దతు ఉండటంతో.. కిషన్‌రెడ్డికి గట్టి పోటీ తప్పేలా లేదు.

ఉప్పల్‌లో ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌కు ప్రజాకూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేందర్‌గౌడ్‌, టీఆర్ఎస్‌ నుంచి భేతి సుభాష్‌రెడ్డి ప్రత్యర్థులుగా ఉన్నారు. ఖైరతాబాద్‌ నుంచి పోటీచేస్తున్న చింతల రామచంద్రారెడ్డికి టీఆర్ఎస్‌ నుంచి దానం నాగేందర్‌, కాంగ్రెస్‌ నుంచి దాసోజు శ్రవణ్‌లు, టఫ్‌ ఫైట్‌ ఇస్తున్నారు. గోషామహల్‌లో రాజాసింగ్‌, కాంగ్రెస్‌ నుంచి ముఖేష్‌గౌడ్‌, టీఆర్ఎస్‌ నుంచి ప్రేంసింగ్‌రాథోడ్‌ రంగంలో ఉండటంతో, ఇక్కడ నువ్వానేనా అన్నట్టుగా పోటీ ఉంది.


గత ఎన్నికల్లో చాలాచోట్ల రెండోస్థానంలో నిలిచి, కొద్ది తేడాతో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థులున్నారు. మల్కాజిగిరిలో గత ఎన్నికల్లో 2,768 ఓట్లతో ఓటమిపాలైన రామచంద్రరావు ఈసారైనా ఛాన్స్ఇవ్వాలని, జనాన్ని అడుగుతున్నారు. గత ఎన్నికల్లో కల్వకుర్తిలో బీజేపీ అభ్యర్థి ఆచారి 78 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఓడిన సానుభూతి ఈసారి పనిచేస్తుందన్న నమ్మకంతో సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. సూర్యాపేటలో పొత్తులో అవకాశం రాక గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, రెండోస్థానంలో నిలిచిన సంకినేని వెంకటేశ్వరరావు, ఈసారి మంత్రి జగదీశ్‌రెడ్డిపై గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మరో ప్రత్యర్థిగా ఉండటంతో ఇక్కడ ట్రయాంగిల్‌ ఫైట్‌ టెన్షన్‌ పుట్టిస్తోంది. కరీంనగర్‌లో బండి సంజయ్‌కుమార్‌ విజయంపై బీజేపీ గట్టి ఆశలు పెట్టుకుంది. పొన్నం ప్రభాకర్‌, గంగుల కమలాకర్‌లతో, ఢీ అంటే ఢీ అంటున్నారు.

మరికొన్ని చోట్ల ఓట్లు పెరుగుతాయని, బీజేపీ అంచనా వేస్తోంది. అందులో శేరిలింగంపల్లి, ఎల్‌బీ నగర్, మహేశ్వరం, తాండూరు, మేడ్చల్, భూపాలపల్లి, సంగారెడ్డి, అంథోల్,ఆర్మూర్‌, రాజేంద్ర నగర్, ఇలా ఈ స్థానాల్లో గట్టిపోటినిచ్చి, పునాదులు పటిష్టం చేసుకోవాలని లెక్కలేస్తోంది కాషాయదళం. అయితే పట్టణాల్లోనే కాస్త బలంగా ఉండటం, గ్రామీణస్థాయిలో మూలాల్లేకపోవడం బీజేపీకి మైనస్‌లు. అంతేకాదు, అర్థబలం, అంగబలం ఉన్నవారికి, ఆఖరి నిమిషంలో పార్టీ మారినవారికి టిక్కెట్లిచ్చింది బీజేపీ. దీంతో స్థానిక నేతలు, తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తితో రగిలిపోతున్నారు. మొత్తానికి ఒంటరిగా పోటీ చేసి, బలోపేతం కావాలన్నది బీజేపీ వ్యూహం. అందుకే సకల శక్తులూ ఒడ్డుతోంది. అయితే కేవలం ఓట్లు చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని, అంతిమంగా టీఆర్ఎస్‌కు లాభం చేకూర్చడమే బీజేపీ వ్యూహమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎవరేమనుకున్నా తమకు పట్టున్న స్థానాల్లో కాషాయ జెండా ఎగరేస్తామంటోంది బీజేపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories