Top
logo

గులాబీతో వియ్యమా.. కయ్యమా? కనిపించని కమలం కథ!!

గులాబీతో వియ్యమా.. కయ్యమా? కనిపించని కమలం కథ!!
X
Highlights

గులాబీ-కమలం ఒకటేనన్నారు. కారెక్కకపోయినా, కారుకు ముందస్తు ఇంధనం పోస్తున్నది, కాషాయదళమేనన్నారు. బీజేపీ,...

గులాబీ-కమలం ఒకటేనన్నారు. కారెక్కకపోయినా, కారుకు ముందస్తు ఇంధనం పోస్తున్నది, కాషాయదళమేనన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌ అప్రకటిత స్నేహతులని కాంగ్రెస్, టీడీపీలు ఆరోపణలు చేశాయి. తెలంగాణలో ఎన్నికల శంఖారావం పూరించిన, ీబీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, ఈ ఆరోపణలన్నింటికీ ఆన్సర్ ఇచ్చేశారు. గులాబీతో వియ్యం కాదు, కయ్యమేనని ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ సర్కారుపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టి, స్నేహం లేదు సమరమేనని యుద్ధభేరి మోగించారు. అమిత్‌ షా టూర్‌లో తేలింది ఇదేనా....కనపడని వ్యూహం ఇంకేమైనా ఉందా?

తెలంగాణలో ఒకరోజు పర్యటనకు వచ్చిన అమిత్ షా, ఉదయం నుంచి బిజిబిజిగా గడిపారు. ప్రత్యేక విమానంలో బేగం పేట్ విమానాశ్రయానికి వచ్చిన షా, ముషిరాబాద్ లో స్వచ్ఛహీ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అక్కడ నుంచి నేరుగా బిజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ముందస్తు ఎన్నికలు మొదలు, రాహుల్‌ గాంధీ ఎన్నికల కలల వరకు, అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత, పాలమూరు శంఖారావం సభలో, కాషాయదళం పూరించబోతున్న సమరశంఖారావమేంటో, ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశారు.

కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం వెనక, బీజేపీ సహకారముందని, అసెంబ్లీ రద్దుకు ముందు తర్వాత ఎన్నో విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. జోనల్‌కు ఆమోదం, చకచకా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతుండటంతో, మోడీ అండదండలు లేనిదే, ఇంత శరవేగం కష్టమని, టీఆర్ఎస్‌ బీజేపీ దొందుదొందేనని కాంగ్రెస్ సహా మిగతా విపక్షాలు ఆరోపించాయి. అంతర్గత ఒప్పందం కుదిరిందన్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలో అర్థంకాక, రాష్ట్ర బిజేపి కూడా సతమతమైంది. వీటన్నింటికీ, సమాధానమిచ్చారు అమిత్‌ షా. టీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శించారు. కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. తద్వారా బీజేపీకి టీఆర్ఎస్, కాంగ్రెస్‌ రెండూ ప్రత్యర్థులేనని స్పష్టమైన సమర సంకేతాలిచ్చారు అమిత్ ‌షా. మూఢనమ్మకాన్ని అడ్డుపెట్టుకొని సచివాలయానికి దూరంగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించి, గులాబీ దండుతో యుద్ధానికి సిద్దమన్నారు.

టీఆర్ఎస్‌, మజ్లీస్‌ స్నేహంపైనా నిప్పులు చెరిగారు అమిత్ షా. కేసీఆర్, ఒవైసీ స్నేహంతో మళ్ళీ తెలంగాణ రజకారుల చేతుల్లోకి వెళుతుందన్నారు. మజ్లిస్‌తో ఫ్రెండ్‌షిప్‌ కారణంగానే, తెలంగాణ విమోచన దినం జరపడానికి కేసీఆర్‌ వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. మొత్తానికి ఎన్నికల శంఖారావంతో, టీఆర్ఎస్‌ మీద విమర్శల బాణాలు ఎక్కుపెట్టి, గులాబీ దండుతో కయ్యమే కానీ, వియ్యం లేదని చెప్పే ప్రయత్నం చేశారు అమిత్‌ షా. సామాజిక అంశాలను టచ్‌ చేస్తూ, యూపీ తరహాలో సోషల్ ఇంజినీరింగ్‌ స్ట్రాటజీ అప్లై చేసే ప్రయత్నం చేశారు. మూడో శక్తిగా రంగంలోకి దిగి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును షా చీల్చే ప్రయత్నం చేస్తున్నారా...ఇదే జరిగితే లాభం కేసీఆర్‌కా...కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికా?

Next Story