రైతులు, రెవెన్యూ సిబ్బందికి చుక్కలు చూపిస్తున్న ధరణి వెబ్‌సైట్‌ ...ఇంతకీ ధరణికి ఏమైంది?

x
Highlights

ధరణి. భూమి. మనుషులను భరించడానికి ధరణికి చాలా ఓర్పుంది కానీ, భూ రికార్డులను డిజిటలైజ్‌ చేసే ధరణి వెబ్‌సైట్‌కు మాత్రం అస్సలు ఓపికలేనట్టుంది. రైతులు,...

ధరణి. భూమి. మనుషులను భరించడానికి ధరణికి చాలా ఓర్పుంది కానీ, భూ రికార్డులను డిజిటలైజ్‌ చేసే ధరణి వెబ్‌సైట్‌కు మాత్రం అస్సలు ఓపికలేనట్టుంది. రైతులు, అధికారులకు చుక్కలు చూపెడుతోంది. దేశానికే ఆదర్శమని తెలంగాణ సర్కారు చెప్పుకుంటున్న భూ రికార్డుల డిజిటలైజేషన్‌, పరేషన్‌ చేస్తోంది. రికార్డులు ఎంట్రీ కాక, కరెక్షన్స్ యాక్సెప్ట్ చేయక, వానలు కురుస్తున్న తరుణంలో రైతులకు కంటికమీద కనుకు లేకుండా చేస్తోంది ధరణి వెబ్‌సైబ్‌ గందరగోళం. ఇంతకీ ధరణికి ఏమైంది?

తెలంగాణలో భూ రికార్డుల సమగ్ర నిర్వహణకు రూపొందించిన ‘ధరణి’ వెబ్‌సైట్‌ రెవెన్యూ సిబ్బందికి, రైతులకు చుక్కలు చూపిస్తోంది. పాస్‌ పుస్తకాల జారీలో జరిగిన తప్పుల సవరణకు వెబ్‌సైట్‌ సహకరించడం లేదని రెవెన్యూ సిబ్బంది నెత్తీనోరు బాదుకుంటుంటే, రుణాలు అందక, రైతు బంధు చెక్కులు చేతికి రాక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరిగితిరిగి విసిగివేసారిపోతున్నారు రైతులు. తెలంగాణలో ధరణి వెబ్‌సైట్‌తో, రైతుల కష్టాలు. కేవలం కర్షకులకే కాదు, రెవెన్యూ సిబ్బందికీ చుక్కలు చూపిస్తోంది ధరణి వెబ్‌సైట్. కంప్యూటర్ల ముందు తలలు బాదుకుంటున్నారు అధికారులు.

తెలంగాణలో ధరణి వెబ్‌సైట్‌ అందరినీ ఒక ఆట ఆడుకుంటోంది. వంశపార్యంగా దక్కిన భూమిని, రికార్డుల నుంచి మాయం చేశారని ఒక రైతు ఫిర్యాదయితే తనకు తెలియకుండానే పట్టా భూమి మాయం చేశారంటూ మరో కర్షకుడి ఆవేదన ఇవన్నీ ధరణి వెబ్‌సైట్‌లో సరి చేయాలి. అప్పుడే, ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు, బీమా పథకాలు పొందడానికి అర్హత లభిస్తుంది. అటు ధరణి వెబ్‌సైట్‌లో భూమి రికార్డు ఉంటేనే, బ్యాంకులు రుణాలిస్తున్నాయి. దీంతో అటు వెబ్‌సైట్‌లో డీటైల్స్ ఎంటర్‌ కాక, ఇటు రుణాలు దొరక్క, తెలంగాణలో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.

అటు ధరణి వెబ్‌సైట్‌ ఇబ్బందులతో పాటు రైతుల కష్టాలపై తెలంగాణ జనసమితి పోరాట బాట పట్టింది. అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు దీక్ష పేరుతో ఆందోళన చేస్తోంది. పాసు బుక్కు, పంట చెక్కు, భూమి మీద హక్కు అంటూ దీక్షాస్త్రం సంధిస్తోంది. తెలంగాణలో 46 శాతం మంది రైతులకు పాస్‌ బుక్కులు అందలేదని, ఇచ్చినవాటిలో తప్పులు ఎక్కువున్నాయని, రైతులు భూమి మీద హక్కు కోల్పోయే పరిస్థితి దాపురించిందన్నారు టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. అన్నదాతల హక్కులపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.

ధరణి వెబ్‌సైట్‌‌తో రైతులు పడుతున్న అవస్థలు. అధికారుల కష్టాలు. ధరణి వెబ్‌సైట్‌తో జనం ఇంతగా ఇబ్బందులు పడుతున్నా, ఇంకా ఎందుకు సరి చేయడం లేదు? ఎలాంటి సమస్యలు సృష్టిస్తోంది వెబ్‌సైట్...

రాష్ట్ర్రంలో సమగ్ర భూరికార్డుల పక్రియ చేసిన ప్రభుత్వం ఆ వివారాలన్నింటిని అన్ లైన్ పెట్టే విధంగా ప్లాన్ చేసింది. అందుకుగాను ధరణి వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని ప్రతీ ఎకరం భూభాగం వివరాలు పొందుపరుస్తూ, ఎప్పటి కప్పుడు చోటు చేసుకునే మార్పులను కూడా నమోదు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల వెబ్‌సైట్‌ ‘ధరణి’ ఉపయోగపడనుంది. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ల్యాండ్‌ వెబ్‌సైట్‌ పనిచేస్తూందని ప్రభుత్వం ప్రకటించింది. కాని ధరణి వెబ్ సైట్ నిర్వహణ లోపాలతో అటు ప్రభుత్వంకు ఇటు రెవెన్యూ శాఖకు అపవాదులు తెచ్చిపెడుతోంది.

తెలంగాణలో సమగ్ర భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింటి కేసీఆర్ సర్కార్. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఈ కార్యక్రమం తర్వాత భూమి వివరాలు, ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయని చెప్పింది. కోర్‌ బ్యాంకింగ్‌ తరహాలో ల్యాండ్‌ వెబ్‌సైట్‌ గాను ‘ధరణి’ అనే పేరును ఖరారు చేశారు సిఎం కేసీఆర్. దీని ఆధారంగానే సమగ్ర భూ రికార్డుల ద్వారా రైతులకు పెట్టుబడి పథకంను అమలు చేస్తోంది. దీంతో రైతుల భూ వివరాలు అన్నింటిని ధరణి వెబ్‌సైట్‌లో ఉండే విధంగా అప్ లోడ్ చేసేపని చేపట్టింది.

రైతుల భూ వివరాలను బట్టి కొత్త పాసుపుస్తకాల పంపిణీ చేపట్టింది. భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో వందకు వంద శాతం పారదర్శకత సాధించడం, అవినీతి నిరోధించడం, నకిలీ పాస్‌ పుస్తకాలను అరికట్టడం లాంటి లక్ష్యాలతో సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం చేప్తోంది. దీని ద్వారా రైతులు, ఇతర ప్రజలు తరచూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని సర్కారు ఆలోచన. అంతేకాక నకిలీ పాసుపుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించడం కుదరదని తెలిపింది. అయితే, ప్రభుత్వం ఇంతటి ఘనమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా, ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. ఎక్కడిక్కడ వెబ్‌సైట్‌ తప్పుల తడకగా తయారైంది. దీంతో రైతులు, అధికారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

ధరణి వెబ్‌సైట్‌ మొత్తం లోపభూష్టంగా తయారైంది. తప్పులు సరిచేయడం కోసం కొన్ని సర్వే నంబర్లను వెబ్‌సైట్‌లో నమోదు చేసినా అవి కనిపించడం లేదు. ప్రతి రైతు ఖాతాపై డిజిటల్‌ సంతకం చేయాలంటే ఆ రైతు ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి. ఆధార్‌ నంబర్లు గతంలో ఇవ్వని వారు, ఫొటోలు లేని రైతులు వారి ఆధార్‌ నంబర్లు, ఫొటోలు మీ సేవా కేంద్రాల్లో అప్‌లోడ్‌ చేయించినా ధరణి పోర్టల్‌లో కనిపించడం లేదు. దీంతో డిజిటల్‌ సంతకాలు ఆగిపోతున్నాయి.

ప్రతి ఎంట్రీకి తహసీల్దార్లు రెండుసార్లు బయోమెట్రిక్‌ ఇవ్వాల్సి వస్తోంది. ఎంట్రీకి ముందు, తర్వాత నిర్ధారణ కోసం రెండుసార్లు బయోమెట్రిక్‌ ఇస్తున్నారు. ప్రతి ఎంట్రీకి డేటాఎంట్రీ ఆపరేటర్, సీనియర్‌ అసిస్టెంట్, నాయిబ్‌ తహసీల్దార్, తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకాలు చేయాలి. దీంతో ఇదొక పెద్ద తతంగంలా తయారై, టైమ్‌ వేస్ట్‌ అవుతోంది. ధరణి పోర్టల్‌ నెట్‌వర్క్, సర్వర్‌ కూడా చాలా తక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. తహసీల్దార్‌ కార్యాలయాల్లోని ఇంటర్నెట్‌ కూడా సరిగా పనిచేయడం లేదు. దీంతో సకాలంలో డేటా ఎంట్రీ కావడం లేదు.

అలాగే, ఒక పట్టాదారుకు ఒక ఖాతాలో రెండు సర్వే నంబర్లు ఉండి అందులో ఒక సర్వే నంబర్‌లో ఇంటి స్థలం, మరో సర్వే నంబర్లో వ్యవసాయ భూమి ఉంటే ఒక సర్వే నంబర్‌కు మాత్రమే పట్టాదారు పాసు పుస్తకం అవసరమవుతుంది. కానీ డిజిటల్‌ సంతకం కోసం ఆ ఖాతా నంబర్‌ను నమోదు చేస్తే, రెండు సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది బయోమెట్రిక్‌ ఇచ్చిన వెంటనే ఇంటి స్థలం ఉన్న సర్వే నంబర్‌కు కూడా డ్రాఫ్ట్‌ పాస్‌ పుస్తకం కనిపిస్తోంది. దీంతో తహసీల్దార్లు ఆ రైతు ఖాతాపై డిజిటల్‌ సంతకం చేయలేకపోతున్నారు.

ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా భూ వివరాలను ధరణిలో పొందుపర్చాలని చేబుతుంటే, అనేక సాంకేతిక సమస్యల వల్ల భూ వివరాలు పొందుపర్చలేకపోతున్నామని రెవెన్యూ శాఖ అంటోంది. సాంకేతిక సమస్యలు సరిచేసి, రికార్డులను పక్కాగా తయారు చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇవ్వగా,ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. వెబ్‌సైట్ నిర్వహణలో ముఖ్యమంత్రి చెప్పిన ప్రకారం అన్ని ఆప్షన్లు లేక, రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వెబ్‌సైట్ లోపాలతో రెవెన్యూ ఉద్యోగులను అందరూ బదనాం చేస్తూన్నారని తహసీల్లార్ల సంఘం నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మొన్న మెరపెట్టుకున్నారు కూడా.

అంతేకాక ఈ ధరణి వెబ్‌సైట్‌ సమస్యలన్నీ పది రోజుల్లోగా పరిష్కారం కావాలని తెలంగాణ తహసీల్దార్ల సంఘం ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేసింది. లేదంటే ఉద్యోగాలు చేయబోమని, మూకుమ్మడి సెలవులు పెడతామని హెచ్చరించింది. ధరణి వెబ్‌సైట్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చుతామని మూడు వారాల కిందటే హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. ఆప్షన్లు ఇవ్వలేదు. ఇచ్చినా ఇబ్బందులే ఉన్నాయి. ఇక తాము పనిచేయలేమని క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు. చెబుతున్నారు.

సమగ్ర భూ సర్వేను 90 రోజుల్లో పూర్తి చేసిన ఆ భూ సర్వే వివరాలు ధరణి వెబ్ సైట్ లోకి ఎక్కించడంతో అనేక సాంకేతిక సమస్యలు వస్తున్నాయనే విమర్శ వస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. కోదండరాం స్థాపించిన తెలంగాణ జన సమితి ఎక్కడికక్కడ, ధర్నాలు, దీక్షలు చేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. బ్యాంకులు లోన్లు ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భూముల విక్రవిక్రయాలు ఆగిపోతున్నాయని విమర్శించారు. ధరణి వెబ్‌సైట్‌ నిర్వహణ లోపాలను వెంటనే సరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories