మోడీని ఢీకొట్టేందుకు రాహుల్‌‌‌లో ఈ మార్పు సరిపోతుందా?

మోడీని ఢీకొట్టేందుకు రాహుల్‌‌‌లో ఈ మార్పు సరిపోతుందా?
x
Highlights

రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించి, విశ్రాంతి తీసుకోవాలని, సోనియా గాంధీ 2014 నుంచి అనుకుంటూనే ఉన్నారు. కానీ ముళ్లకిరీటంలా భావించి...


రాహుల్‌ గాంధీకి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించి, విశ్రాంతి తీసుకోవాలని, సోనియా గాంధీ 2014 నుంచి అనుకుంటూనే ఉన్నారు. కానీ ముళ్లకిరీటంలా భావించి తప్పించుకు తిరిగారు రాహుల్‌.ఎవరికీ చెప్పకుండా, వేరే దేశాలకు వెళ్లేవారు. కానీ ఏమైందో ఏమో కానీ, 2017 డిసెంబర్‌ 16న బలవంతంగానో, బతిమాలో రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌ అధ్యక్షున్ని చేశారు. ఇష్టంలేకుండా బాధ్యతలు తీసుకున్న రాహుల్‌, పార్టీని ప్రక్షాళన చేయడం మాత్రం మొదలుపెట్టారు.

ఏఐసీసీ కమిటీలను పూర్తిగా ప్రక్షాళన చేశారు. పీసీసీల్లోనూ అనేక మార్పులు చేశారు. యువతకు బాధ్యతలు అప్పగించారు. అలాగని వృద్దతరం నేతలందర్నీ పక్కనపెట్టలేదు. వారి మార్గదర్శనం కావాలన్నారు. పాతతరం-నవతరం మధ్య పార్టీని సమన్వయం చేశారు. దాని ఫలితం మూడు రాష్ట్రాల ఫలితాల్లో స్పష‌్టమైంది. మధ్యప్రదేశ్‌లో వృద్దతరం నాయకులు దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్‌లతో పాటు యంగ్‌ డైనమిక్‌ జ్యోతిరాధిత్య సింధియాకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. వారి ముగ్గురి మధ‌్య సమన్వయం కుదిర్చారు. దీంతో అనేక ఏళ్ల తర్వాత మధ్య భారతంలో కాంగ్రెస్ జెండా ఎగిరింది.

రాజస్థాన్‌లోనూ అంతే. అక్కడ అశోక్‌ గెహ్లాట్‌తో పాటు తనకు స్నేహితుడైన సచిన్‌ పైలట్‌ను ఎన్నికల రణక్షేత్రంలో దించారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. ఫలితాలు రాబట్టారు. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లోనూ యువతకులకే సీఎం పగ్గాలు అప్పగించాలని పార్టీలో లాస్ట్ వరకూ డిమాండ్ చేసింది రాహుల్‌ గాంధీనే. ఎవరిని సీఎం చేస్తే, బాగుంటుందో క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు తీసుకున్నారు. ఏఐసీసీ పెద్దలు, సోనియా, అలాగే ప్రియాంకతో జరిగిన సమావేశంలోనూ, జ్యోతిరాధిత్య సింధియా, సచిన్‌ పైలట్‌‌లపై పట్టుబట్టారు. అసహనంతో మీటింగ్‌ నుంచి బయటకు వచ్చారు. అలా, తాను అధ్యక్షుడైన తర్వాత పార్టీలో యువతకు ప్రాధాన్యమిచ్చారు రాహుల్.

అయితే మోడీని ఢీకొట్టేందుకు రాహుల్‌‌‌లో కనిపిస్తున్న లక్షణాలే సరిపోవంటున్నారు విశ్లేషకులు. బీజేపీ కాంగ్రెస్‌ ముక్త్ భారత్‌ను అడ్డుకున్నా, మరింత రాటుదేలాలంటున్నారు. ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, మూడింటిలో విజయం సాధించినా, మిజోరంలో అధికారం కోల్పోయారు. అనేక సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నా, కొత్త కూటములు కట్టినా, తెలంగాణ దారుణ పరాజయం చవిచూశారు. కేవలం బీజేపీ-కాంగ్రెస్‌ వర్సెస్‌ రాష్ట్రాల్లోనే విజయాల బాటపట్టారు. ప్రాంతీయ పార్టీలతో తలపడ్డంలో ఫెయిల్‌ అవుతున్నారు. అయితే మూడురాష్ట్రాల్లో, అదీ కూడా కాషాయ పార్టీకి పట్టున్న రాష్ట్రాల్లో విజయం, రాహుల్‌ గాంధీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచొచ్చు. పార్లమెంట్‌ ఎన్నికలకు సమరోత్సాహం నింపొచ్చు. అయితే, కూటమి కడితేనే, మోడీలాంటి బలశాలిని ఎదుర్కోవచ్చు. కానీ బీజేపీ వ్యతిరేక ఫ‌్రంట్‌లో హేమాహేమీ ప్రాంతీయ నాయకులు ఉండటంతో, రాహుల్‌ గాంధీ నాయకత్వానికి ఆమోదం లభిస్తుందా అన్నదే సందేహం. చూడాలి, రానున్న కాలం, రాహుల్‌ దో మోడీదో.

Show Full Article
Print Article
Next Story
More Stories