ఆర్డినెన్స్‌తో అయోధ్య సమస్య సమసిపోతోందా?

ఆర్డినెన్స్‌తో అయోధ్య సమస్య సమసిపోతోందా?
x
Highlights

రామజన్మభూమి...బాబ్రీ మసీదు వివాదం.... సుమారు 170 ఏళ్ళుగా నలుగుతున్న వివాదం ఇది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కావాల్సిన హియరింగ్ జనవరికి...

రామజన్మభూమి...బాబ్రీ మసీదు వివాదం.... సుమారు 170 ఏళ్ళుగా నలుగుతున్న వివాదం ఇది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కావాల్సిన హియరింగ్ జనవరికి వాయిదా పడింది. కనీసం అప్పుడైనా ప్రారంభం అవుతుందని, సత్వరమే తీర్పు వస్తుందని చెప్పలేని పరిస్థితి. సరిగ్గా ఈ సమయంలోనే ఇక ఈ సమస్యను ఆర్డినెన్స్ ద్వారా పరిష్కరించాలనే డిమాండ్ భారీస్థాయిలో తెరపైకి వచ్చింది. మరి ఆర్డినెన్స్ తో ఈ సమస్యను పరిష్కరించగలమా ?

అయోధ్యలో రామాలయ నిర్మాణ వివాదం ఇటీవలిదేమీ కాదు. 1853 నుంచే ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఒక వివాదం....అందులోనూ మతపరంగా అత్యంత సున్నితమైన వివాదం ఏళ్ళ తరబడి కొనసాగడం ఏ దేశానికైనా మంచిది కాదు. అందుకే సుప్రీం కోర్టు సైతం ఇటీవల అయోధ్య వివాదానికి సతర్వరమే తెర వేయాలని భావించింది. అందులో భాగంగా అక్టోబర్ 29 నుంచి ఈ అంశంపై విచారణను వేగవంతం చేయాలని సంకల్పించింది. అనుకోకుండా అది తిరిగి జనవరి కి వాయిదాపడింది. సంఘ్ పరివార్ సంస్థలకు అది నిరాశపర్చింది. ఇక ఈ వ్యవహారం కోర్టులతో తెగేది కాదని అవి భావిస్తున్నాయి. అందుకే సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ మార్గాన్ని ఎంచుకోవాలని గొంతెత్తాయి. సంఘ్ పరివార్ తో బీజేపీకి అనుబంధం ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నది ఆ పార్టీనే అయినే నేపథ్యంలో నేరుగా సుప్రీంకోర్టు ధోరణిని విమర్శించేందుకు వెనుకాడుతోంది. మరోవైపు సంఘ్ పరివార్ లోని ఇతర పక్షాలు మాత్రం ఆర్డినెన్స్ తేవాల్సిందిగా బీజేపీ పై ఒత్తిడి తెస్తున్నాయి.

అయోధ్యలో రామాలయ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని సంఘ్ పరివార్ సంస్థలు భావిస్తున్నాయి. ఆరెస్సెస్, వీహెపీ లతో సహా పరివార్ సంస్థలు, భావసారూప్య సంస్థలు ప్రభుత్వంపై గత కొద్దికాలంగా ఒత్తిడి పెంచుతూ వచ్చాయి. తాజాగా రామాలయ నిర్మాణానికి ఆర్గినెన్స్ తీసుకురావాలని అవి డిమాండ్ చేయడం తో ఈ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఈ డిమాండ్ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ విధంగా స్పందిస్తారనే అంశంపైనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్యాంగపరంగా భారతదేశం లౌకిక రాజ్యం. శతాబ్దాలుగా హిందువులు అధిక సంఖ్యలో ఉన్న దేశం. అదే సందర్భంలో ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్న దేశం. ఇక అయోధ్య విషయానికి వస్తే..... ఆలయ నిర్మాణానికి అనుకూల, ప్రతికూల వాదనలు బలంగా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ముంచుకొస్తున్న ఎన్నికలు....కమల వికాసంపై అనుమానాలు లాంటివి కూడా ఈ వాదన మరో సారి తెరపైకి వచ్చేందుకు కారణం అయ్యాయన్న వాదనలూ ఉన్నాయి. అదే సమయంలో రాజకీయాలతో సంబంధం లేని వారెంతో మంది అయోధ్య వివాదం సత్వరమే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. మత విశ్వాసాలు ప్రబలంగా ఉన్న భారత్ లో అయోధ్య అంశానికి ఆర్డినెన్స్ లేదా చట్టం మాత్రమే పరిష్కారం అన్న ఆలోచనను సమర్థిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా గానే ఉంది. కోర్టుల్లో ఏళ్ళుగా ఈ అంశం పరిష్కారం కాకపోవడంతో, ప్రత్యామ్నాయ మార్గం పై మొగ్గ చూపుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరి ఈ ప్రత్యామ్నాయం ఏమిటనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్డినెన్స్ ఒక్కటే ఆ సమస్యకు పరిష్కార మార్గమా ? ఆర్డినెన్స్ ను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయా ? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

గత కొద్ది కాలంలో వివిధ అంశాల్లో సుప్రీం కోర్టు పలు అంశాల్లో ఎన్నో సంచలనాత్మక తీర్పులను ఇచ్చింది. వాటిలో అత్యధికం ఇన్ని శతాబ్దాాలుగా భారతీయ సమాజం విశ్వసించిన సంప్రదాయాలకు, విలువలకు భిన్నంగా ఉన్నవే. భార్యాభర్తల అక్రమ సంబంధాలు, స్వలింగ సంపర్కం లాంటివెన్నో వీటిలో ఉన్నాయి. అయినా కూడా..... ఆయా అంశాల్లో సుప్రీం కోర్టు తీర్పులపై సమాజం నుంచి పెద్దగా నిరసనలు వ్యక్తం కాలేదు. శబరిమల లో అయ్యప్ప స్వామి ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలు ప్రవేశించేందుకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై మాత్రం హిందూ సమాజం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబికింది. సుప్రీంకోర్టు అయోధ్య అంశంపై హియరింగ్ ప్రారంభిచడంలో జాప్యం చేయడానికి ఆ అంశం కూడా ఒక కారణమై ఉండవచ్చన్న వాదనలూ వినవస్తున్నాయి. అయోధ్య అంశం మతపరంగా అత్యంత సున్నిత అంశం కావడంతో న్యాయస్థానాల్లో ఆ అంశం తేలేందుకు మరెన్నో దశబ్దాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హిందూత్వ సంస్థలు ఎప్పటి నుంచో ఈ జాప్యాన్ని భరించలేకపోతున్నాయి. అందుకే ఈ సమస్య పరిష్కారానికి వీలుగా ఆలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా సంఘ్ పరివార్ సంస్థలు సైతం రామాలయ నిర్మాణంపై స్వరం పెంచాయి. అయితే సరిగ్గా ఎన్నికలకు ముందే మరో సారి తెరపైకి రావడం వెనుక మరెన్నో కారణాలు కూడా ఉన్నాయి.

బీజేపీ అమ్ముల పొదిలో ఉండిన పలు అస్త్రాలు ఆచరణలో ఫలితాలను అందించలేకపోయాయి. నల్లడబ్బు వెలికితీత, విదేశాల నుంచి నల్లడబ్బును తిరిగి వెనక్కు రప్పించడం, పెద్ద నోట్ల రద్దు లాంటివి వీటిలో ఉన్నాయి. బీజేపీ చేపట్టిన వివిధ ప్రచార కార్యక్రమాలు కూడా పెద్దగా ప్రజలపై ప్రభావం కనబర్చలేకపోయాయి. స్వచ్ఛ్ భారత్, మేకిన్ ఇండియా లాంటి వాటితో సామాన్యులకు తక్షణ ప్రయోజనాలు పెద్దగా లభించలేదు. మరో వైపున జీఎస్టీ, పెట్రో ధరలు లాంటివి ప్రతికూల ప్రభావాలను కలిగించాయి. ఆయుష్మాన్ భారత్, పంట బీమా, పేదలకు ఇళ్లు, ముద్ర లాంటి పథకాలు మంచివే అయినప్పటికీ, కొన్ని లోపాల కారణంగా ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్ళలేకపోయాయి. మరో వైపున రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశాన్ని కాంగ్రెస్ రాజకీయం చేసింది. వివిధ సర్వేల్లో కొంతమేరకు ప్రతికూలత కనిపించడం మొదలైంది. ఐదేళ్ళు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజమే. అది ఒక స్థాయి దాటితే మాత్రం అధికార పక్షం ఆందోళన చెందక తప్పదు. ఇలాంటి కారణాల నేపథ్యంలో బీజేపీ తిరిగి రామనామ జపం ప్రారంభించిందన్న విమర్శలూ ఉన్నాయి. గత కొన్నేళ్ళుగా రామాలయ నిర్మాణం బీజేపీ ఎన్నికల అజెండాలో ఉంది. వివిధ కారణాలతో బీజేపీ ఆ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లలేకపోయింది. ఒక అడుగు ముందుకేస్తే....రెండు అడుగులు వెనక్కు వేసింది. ఇక ఇప్పుడు మాత్రం ఆ విషయంలో ఏదో ఒకటి, ఎంతో కొంత చేయాల్సిన సందర్భం వచ్చింది. రాముడి భక్తులే కాదు....మరెందరో ప్రజలు కూడా ఈ అయోధ్య సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories