టీఆర్ఎస్ లో మొదలైన టిక్కెట్ల లొల్లి

టీఆర్ఎస్ లో మొదలైన టిక్కెట్ల లొల్లి
x
Highlights

టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ల కోసం పోటీ పడుతున్న నేత‌లు బ‌హిరంగ విమ‌ర్శలకు దిగుతున్నారు. సిటింగ్ ల...

టీఆర్ఎస్ లో అప్పుడే టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో టికెట్ల కోసం పోటీ పడుతున్న నేత‌లు బ‌హిరంగ విమ‌ర్శలకు దిగుతున్నారు. సిటింగ్ ల సీట్లపై ఆశావహులు కండువా పరుస్తుంటే సిటింగ్ లు మండిపడుతున్నారు. ఒక‌రికి తెలియ‌కుండా ఒక‌రు నియోజ‌క‌ వ‌ర్గాల్లో పార్టీ కార్యాల‌యాలు ఓపెన్ చేసి స‌వాల్ విసురుకుంటున్నారు. ఇంకొంద‌రు బ‌హిరంగంగా తిట్లు, విమర్శలకే దిగుతున్నారు.

ఎన్నిక‌ల‌కు ఏడాది ముందే అధికార టీఆర్ ఎస్ లో టికెట్ల గోల మొద‌లైంది. ఒకే నియోజక వర్గంపై ఎక్కువమంది నేతలు ఆశ పెట్టు కోవడంతో ఆశావహులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మొదట్నుంచి ఆ టిక్కెట్ కోసం కష్టపడి కసరత్తు చేసుకున్న నేతలు చివరి నిమిషంలో ఎవరైనా తన్నుకుపోతారా అన్న సందేహంలో సతమతమవుతున్నారు. తమ నియోజక వర్గంలో మరొకరు వేలు పెట్టకుండా రకరకాలుగా జాగ్రత్తలు పడుతున్నారు. ఎవరైనా సీటుపై కన్నేస్తున్నారని చూచూయగా తెలిసినా, అనుమానమొచ్చినా వారిపై బహిరంగంగా విమర్శలు చేసి డిఫెన్స్ గేమ్ మొదలు పెడుతున్నారు.

టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో తెలియ‌దు కాని ఆశావ‌హులు మాత్రం ఇప్పటి నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఉనికిని చాటుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు దీంతో సిట్టింగ్ లు, ఆశావాహుల మధ్య కోల్డ్ వార్ బయట పడుతోంది తెలంగాణ లో కొన్ని జిల్లాల్లో ఈ తరహా వార్ ఎక్కువగా ఉంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంపై కన్నేసిన డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కూతురు కావ్యపై సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య మండిపడుతున్నారు. కావ్యకు అస‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు హ‌క్కే లేద‌ని ఎద్దేవా చేశారు. త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట్లు కూడా లేవ‌ని బ‌హిరంగంగా విమ‌ర్శలు గుప్పించారు.

ఇక వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయ‌ర్ న‌న్నప‌నేని న‌రేంద‌ర్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌ం కనిపిస్తోంది. న‌రేంద‌ర్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక్రమాలు చేపడుతుండటం కొండా సురేఖకు ఇబ్బందిగా మారింది. దాంతో ఇద్దరూ రెండు వర్గాలను కొనసాగిస్తున్నారు మీడియా స‌మావేశాలు పెట్టి బ‌హిరంగంగా పరస్పరం విమర్శలతో హోరెత్తిస్తున్నారు. మ‌హ‌బూబాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌ మాజీ ఎమ్మెల్యే క‌విత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది. కవితపై ఘాటైన విమర్శలు సంధిస్తున్నారు శంకర్ నాయక్.

భూపాల ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో మరో గొడవ స్పీకర్ మ‌ధు సూధ‌నా చారి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌ వ‌ర్గంనుంచి త‌మ కూతురు కొండా సుస్మిత ను రంగంలోకి దించాలని సురేఖ భావిస్తున్నారు. అయితే మధుసూదనాచారి ఇవేం పట్టించుకోకుండా పల్లెనిద్రల పేరుతో నియోజక వర్గంలోనే ఉంటూ పర్యటిస్తున్నారు దీంతో సురేఖ మధుసూదనా చారిని టార్గెట్ చేశారు. వీరిద్దరికీ తోడు ఈ మధ్యే టిడిపి నుంచి టిఆరెస్ లో చేరిన గండ్ర స‌త్యనారాయ‌ణ రావు కూడా నేను సైతం బరిలో ఉన్నానంటూ సంకేతాలిస్తున్నారు.

ఇక పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం సీను మరింత రసవత్తరంగా మారింది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధం లేకుండా ఏకంగా తెలంగాణ ఉద్యమ‌కారుల కార్యాల‌యం పేరుతో టీఆర్ ఎస్ నేత‌లే ఆఫీస్ తెరిచారు. గ‌తంలో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేసిన త‌క్కెళ్ల ప‌ల్లి రవీంద‌ర్ రావే ఈ కార్యాల‌యంను ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్త గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు కు పోటీగా ఉట్కూరి గోపాల్ రావు ప్రజలకు దగ్గరవుతున్నారు ఉట్కూరి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత కావ‌టంతో ఇద్దరు నేత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది.

న‌ల్లగొండ జిల్లా హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంకోసం పోటీ రసవత్తరంగా మారుతోంది. ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఓ వైపు, ఎన్ ఆర్ ఐ సైదిరెడ్డి మరోవైపు ఈ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సైదిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి అండదండలున్నాయన్నది శంకరమ్మ ఆరోపణ. కోదాడ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే వేనేప‌ల్లి చంద‌ర్ రావు, గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి పాలైన శ‌శిధ‌ర్ రెడ్డిల మ‌ధ్య పొస‌గ‌టం లేదు. వేనేప‌ల్లి వ‌య‌స్సు రీత్యా నియోజ‌క‌వ‌ర్గంలో తిర‌గ‌లేక‌పోతుంటే శ‌శిధ‌ర్ రెడ్డి మాత్రం చురుకుగా తిరిగేస్తున్నారు దీంతో వేనేపల్లికి టెన్షన్ పట్టుకుంది. తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంపై సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ జాగృతి ఉపాధాక్షుడు మేడె రాజీవ్ సాగ‌ర్ ల మ‌ధ్య పోటా పోటీ నెల‌కొంది. మంత్రి కేటీఆర్ పర్యటనలో రాజీవ్ సాగ‌ర్ ఫ్లెక్సీలు పెట్టడాన్ని ఎమ్మెల్యే కిషోర్ తీవ్రంగా వ్యతిరేకించి వాటిని తొలగించడం వివాదంగా మారింది. వీరిద్దరికీ తోడు వేర్ హౌస్‌ కార్పోరేష‌న్ చైర్మన్ మందుల శ్యామూల్ కూడా టికెట్ ఆశిస్తున్నారు.

ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొడంగ‌ల్ సీటుకోసం ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది న‌రేంద‌ర్ రెడ్డికి టికెట్ ఇస్తే తిరుగుబాటు చేసేందుకు గుర్నాథ్ రెడ్డి సిద్ధ మవుతున్నారన్న ప్రచారం ఉంది. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహీం చేరికను మందా జగన్నాథమ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మ‌ధ్య విభేదాలు ముదిరి పోలీస్ స్టేష‌న్ ల‌లో కేసులు వేసుకునే వ‌ర‌కు వెళ్ళాయి. పార్టీలో పరిస్థితిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్న టిఆరెస్ అధిష్టానం కట్టు తప్పుతున్న నేతలపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories