ఏపీలో హోదా హోరీ... ఎవరి దారి ఏంటి?

ఏపీలో హోదా హోరీ... ఎవరి దారి ఏంటి?
x
Highlights

ఏపిలో హోదాపోరు పక్క దారి పడుతోందా? ఐక్యంగా ఉద్యమించాల్సిన నేతలు సొంత కుంపట్లు పెట్టుకుని.. వ్యక్తిగత ప్రచారాలతో కాలక్షేపం చేస్తుంటే హోదా వస్తుందా?కలసి...

ఏపిలో హోదాపోరు పక్క దారి పడుతోందా? ఐక్యంగా ఉద్యమించాల్సిన నేతలు సొంత కుంపట్లు పెట్టుకుని.. వ్యక్తిగత ప్రచారాలతో కాలక్షేపం చేస్తుంటే హోదా వస్తుందా?కలసి కట్టుగా కేంద్రంపై పోరాడాల్సిన వారు.. విడి విడిగా, ఒకరినొకరు మాటల దాడులతో టార్గెట్ చేసుకుంటున్నారు.. నిన్నటి తిరుపతి, వైజాగ్ మీటింగ్ లు చూసిన వారికి కలిగిన భావాలివి..

హోదా పోరు టార్గెట్ తప్పుతోందా? ప్రశ్నించాల్సిన వారిని ప్రశ్నించకుండా పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాలు రంగరించి హోెదా పోరాటం చేస్తున్నాయా? అడగాల్సిన వారిని అడగకుండా.. చేయాల్సిన రీతిలో పోరాటం చేయకుండా ప్రత్యేక హోెదా సాధించగలమా? సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఏప్రిల్ 30న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానంటూ తిరుపతి వెంకన్న సాక్షిగా మోడీ మాయ మాటలు చెప్పారు.. కానీ ఆ తర్వాత ఆ మాటలన్నీ ఒట్టి అబద్ధాలేనని తేలిపోయింది. ఇప్పుడు మోడీని నిలదీయాల్సిన టిడిపి, వైసిపి ఒకరినొకరు నిందించుకుంటూ అసలు లక్ష్యాన్ని వదిలేస్తున్నారా? నిన్నటి ధర్మ పోరాట సభ, నయవంచన వ్యతిరేక దీక్ష రెండూ ఇవే సందేహాలను కలిగిస్తున్నాయి. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని ప్రస్తావించాల్సిన వైసిపి టిడిపిని టార్గెట్ చేసి మాట్లాడింది.

ఒకరిద్దరు కాదు.. నిన్నటి నయవంచన దీక్షలో మాట్లాడిన వైసిపి నేతలంతా మూకుమ్మడిగా టిడిపినే దోషిని చేసి మాట్లాడారు. ప్రత్యేక హోదా డిమాండ్ ను కేంద్రం ముందుకు తేవడంలో చంద్రబాబు విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఇంత వరకూ బానే ఉన్నా.. అసలు హోదా ఇవ్వని కేంద్రాన్ని టార్గెట్ చేయకపోవడం విచిత్రంగా ఉంది. వైసిిపి వంచన వ్యతిరేకపోరాటమంతా చంద్రబాబుపైనే చేసినట్లు కనిపించింది. మరోవైపు టిడిపి కూడా ఇందుకు మినహాయింపు కాదు.. తిరుపతి ధర్మ పోరాట సభలో హోదా కోసం పోరాటం కన్నా స్వోత్కర్ష ఎక్కువ కనిపించింది. చంద్రబాబు స్పీచ్ తో ఎన్నికల ప్రచార సభలా అనిపించింది. కోట్లల్లో ప్రజాధనం ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఈ సభలో చంద్రబాబు తాను చేసేదే ధర్మ పోరాటమంటూ చెప్పుకున్నారు.. నమ్మక ద్రోహం, కుట్ర రాజకీయాలంటూ షరా మామూలుగా ప్రతిపక్ష పార్టీని ఏకిపారేశారు. తాను కేంద్రంపై పోరాడుతుంటే వైసిపి తనపై విమర్శలు చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు.

వైసిపి అవినీతి పార్టీ అనీ ప్రతీ శుక్రవారం జైలుకు వెళ్లే నేతకు మద్దతు ఇవ్వడానికి కేంద్రం ముందుకొస్తోందనీ ఆక్రోశించారు. పనిలో పనిగా తన ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలను కవర్ చేసుకోడానికి తీవ్రంగా ప్రయత్నించారు. పోలవరం, రాజధాని నిర్మాణాలలో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. టిడిపిని బలహీన పరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొన్ని పార్టీల పేరు చెప్పకుండా అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికలలో 25కి 25 లోక్ సభ సీట్లు గెలిచి కేంద్రంలో తాము చక్రం తిప్పుతామని నారా లోకేష్ అన్నారు.

మొత్తం మీద హోదా కోసం ఎలా పోరాడాలన్న విషయాన్ని పక్కన పెట్టి.. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యక్తిగత ప్రచారాలు చేసుకున్నారు.కనీసం హోదా కోసం పోరాట కార్యాచరణ ప్రణాళికనూ ప్రకటించలేదు. కలసి రమ్మని టిడిపి ఇతర పార్టీలకు బహిరంగంగా పిలుపు పెట్టినది లేదు..
వైసిపి ఓ అడుగు ముందుకేసి తామే కలసి వస్తామని సుహృద్భావ ప్రకటన చేసినది లేదు.ఏపిలో ఒక్కటిగా అడుగులేయాల్సిన పార్టీలు, ఎవరికి వారు వ్యక్తిగత ఎజెండాలతో ప్రచారాలు, కార్యక్రమాలు చేపడుతుంటే.. ఇక హోదా ఎలా సాధ్యం?

Show Full Article
Print Article
Next Story
More Stories