అమ‌రావ‌తి డిజైన్ల‌పై చంద్ర‌బాబు సంతృప్తి

అమ‌రావ‌తి డిజైన్ల‌పై చంద్ర‌బాబు సంతృప్తి
x
Highlights

ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణం నా కల అన్న చంద్రబాబు మాటలను నిజం చేసేలా… అంతర్జాతీయ ప్రమాణాలను ధీటుగా రాజధాని డిజైన్లు ఉన్నాయన్న మాట సర్వత్రా...

ప్రపంచ శ్రేణి రాజధాని నిర్మాణం నా కల అన్న చంద్రబాబు మాటలను నిజం చేసేలా… అంతర్జాతీయ ప్రమాణాలను ధీటుగా రాజధాని డిజైన్లు ఉన్నాయన్న మాట సర్వత్రా వినిపిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే సిటీ సివిల్‌ కోర్టు, జంట ఐటీ టవర్ల డిజైన్లకు విశేష స్పందన లభిస్తోంది. గతవారం ఏపీసీఆర్డీయే సమావేశంలో 31 డిజైన్లు(సిటీ సివిల్‌ కోర్టుకు 12, ఐటీ టవర్లకు 19)ను సీఎంకు చూపించగా ఆయన బాగున్నాయని అన్నారు. వీటిని ఆన్‌లైన్‌లో ఉంచారు. అత్యధికులు మెచ్చిన డిజైన్‌ను ఫైనల్‌ చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు ఏపీ సీఆర్డీయే వెబ్‌సైట్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. 23,500 మంది సిటీ సివిల్‌కోర్టు కాంప్లెక్స్‌ డిజైన్లకు, 18,500 మంది ఐటీ టవర్ల డిజైన్లపై తమ అభిప్రాయాలు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం మరోసారి సీఎం చంద్రబాబు సమక్షంలో సీఆర్డీయే అధికారులు సమావేశం అవుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తుది డిజైన్‌ను ఖరారు చేస్తారని సమాచారం.అమరావతిలో త్వరగా హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సిటీ సివిల్‌ కోర్టుకు సంబంధించిన టెండర్లను ముందుగా పిలవబోతున్నారు. అందుకే సీఎం ఓకే అనగానే ఆ ప్రక్రియ మొదలయ్యే వీలుంది. జంట ఐటీ టవర్ల నిర్మాణ టెండర్లను కొన్ని రోజుల తర్వాత ఆహ్వానిస్తారని తెలుస్తోంది. ఐకానిక్‌ కట్టడాల్లో ఒకటైన అసెంబ్లీ భవనపు అంతర్గత డిజైన్లపై మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ నిపుణులు ఏపీసీఆర్డీయే అధికారులతో కలసి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. సూదిమొనను పోలిన వాచ్‌టవర్‌తో అత్యంత ఆకర్షణీయంగా డిజైన్‌ను ఈ సంస్థ రూపొందించగా, రాష్ట్ర ప్రభుత్వం దానిని ఆమోదించడం తెలిసిందే.

ఈ నేపథ్యంలో సదరు భవంతిలో కొలువు దీరనున్న శాసనసభ, శాసనమండలి కార్యకలాపాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వర్తించేందుకు వీలుగా లోపలి భాగం ఏ విధంగా ఉండాలన్న దానిపై కొన్ని రోజులుగా ఫోస్టర్‌, సీఆర్డీయే ఉన్నతాధికారులు మేధోమధనం సాగిస్తున్నారు. ఫోస్టర్‌ నిపుణులు ఇటీవల విజయవాడకు వచ్చారు. సీఎం సూచనలకు అనుగుణంగా రూపొందించిన అసెంబ్లీ భవనపు అంతర్గత (డిటైల్డ్‌) డిజైన్లను సీఆర్డీయే అధికారులకు చూపించి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.

వీటికి సబంధించి స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, మండలి ఛైర్మన్‌ ఫరూఖ్‌లు డిజైన్లు చూసి కొన్ని మార్పులు చెప్పిన సంగతి తెలిసిందే. చాంబర్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించి సంతృప్తి వ్యక్తం చేసినా తమ పరిపాలనా సిబ్బంది కోసం రూపొందించిన డిజైన్లలో మార్పులు అవసరమన్నారు. ఆ మేరకు మార్పులు కొలిక్కి రాగానే సీఎం, స్పీకర్‌, మండలి ఛైర్మన్లకు చూపిస్తారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు తర్వాతే డిజైన్లు ఫైనల్‌ చేసి, టెండర్లు పిలుస్తారని చెబుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ పనులు కూడా మెడలు పెట్టాలని ఎన్నికల వేడి మొదలయ్యేలోపు పనులు ప్రారంభం అయ్యేలా చూడలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories