logo
జాతీయం

నిషేధం రేపే..!

నిషేధం రేపే..!
X
Highlights

దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీలో 15 ఏళ్ల కిందటి పెట్రోల్‌ వాహనాలు,...

దేశ రాజధానిలో కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఢిల్లీలో 15 ఏళ్ల కిందటి పెట్రోల్‌ వాహనాలు, పదేళ్ల కిందటి డీజిల్‌ వాహనాల రాకపోకలను సుప్రీంకోర్టు నిషేధించడంతో ఆ తీర్పు అమలు దిశగా ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కాలుష్య తీవ్రత పెరిగితే రేపటి నుంచే ఢిల్లీలో అన్ని ప్రైవేటు కార్లును నిషేధించాలని యోచిస్తోంది. ఢిల్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది దేశ రాజధానిలో పీల్చేందుకు కనీసం గాలి లేక జనం అల్లాడిపోతున్నారు క్షణం క్షణం ఊపిరి నిలబెట్టుకోడానికి నానా అగచాట్లూ పడుతున్నారు. పులి మీద పుట్రలా మరో వారంలో వస్తున్న దీపావళి పండుగ వారిని భయపెడుతోంది. విపరీతమైన శబ్ద, వాయుకాలుష్యాలకు కారణమయ్యే ఆ పండుగ అంటే ఇప్పుడు ఢిల్లీ వణికిపోతోంది.

ఓవైపు వాహనాలు వదిలే కాలుష్యం.. మరోవైపు వాతావరణంలో ఈ సీజన్ లో సహజంగా కురుస్తున్న మంచు, వీటికి తోడు పంజాబ్, హర్యానాల నుంచి వస్తున్న పంట పొలాల పొగ.. వీటితో రాజధానిలో పౌరుడు స్వచ్ఛమైన గాలి లేక శ్వాస సంబంధ సమస్యలతో అల్లాడిపోతున్నాడు. గాలి కాలుష్యం డేంజర్ బెల్స్ దాటేసి ప్రమాదకర స్థాయికి చేరిపోయింది. గత రెండు రోజులుగా రోడ్లపై వాహనాలు కూడా కనిపించనంత దట్టంగా కాలుష్యం కమ్మేసింది. ప్రతీ ఏడాది చలికాలం వస్తోందంటే చాలు ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. కాలుష్యం పరిధి దాటడంతో ప్రమాదం అంచుల్లో ఢిల్లీ నిలబడింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రైవేట్ వాహనాలన్నింటినీ కొన్నాళ్లు నిషేధించాలనే ఆలోచనలో ఢిల్లీ ప్రభుత్వం ఉంది. ప్రతీ ఏడాది పంజాబ్, హర్యానాల్లో రైతులు తమ పాత పంట అవశేషాలను కాల్చేస్తుంటారు.. తద్వారా నేలను మళ్లీ దున్ని తర్వాత విత్తుకు సన్నాహాలు చేసుకుంటారు.

ఈక్రమంలో ఈ రాష్ట్రాల్లో పంట పొలాలనుంచి వస్తున్న పొగ, ఢిల్లీ మంచుతో కలసిపోయి తెల్లని దుప్పటిలా పరుచుకుపోతోంది. జనం పీల్చేందుకు గాలి లేక దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ కంట్రోల్ అథార్టీ డీజిల్ తో నడిచే జనరేటర్లు, వాహనాలను ఆపేయాలని, భవన నిర్మాణాలనూ తాత్కాలికంగా ఆపేయాలని సూచించింది. నవంబర్ 1 నుంచి పది రోజుల పాటూ ఇటుక బట్టీలను మూసేయాలని, చెత్త తగుల పెట్టడాన్ని ఆపేయాలని ఈ కమిటీ సూచించింది. ఢిల్లీలో గాలి సాంద్రతను కాలుష్య నియంత్రణ బోర్డు సూచీలు కొలువగా, దానిలో ధూళి కణాల స్థాయి469 పాయింట్లకు చేరుకుని డేంజర్ బెల్స్ మోగిస్తోందని తెలిపింది. వీటికి తోడు గత కొన్నాళ్లుగా గాలి కూడా స్తంభించింది. బలమైన గాలి తెమ్మెరలు లేకపోవడం వల్ల కూడా ఎక్కడి పొగ అక్కడే స్తంభించి పోడానికి కారణమవుతోంది. దాంతో నవంబర్ 7న దీపావళి పండగ ఎలా జరుపుకోవాలా అన్న సంశయం ఢిల్లీ వాసులను వేధిస్తోంది. ప్రతీ ఏడాది అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు పంజాబ్, హర్యానా ప్రభుత్వాల చేతకాని తనం వల్ల ఢిల్లీ ప్రజలు నలిగిపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు పంట తగులబెట్టడాన్ని తాము కొంత నియంత్రించామని, ఇక ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యం నివారణకు తన పాట్లు తాను పడాల్సిందేనని అంటున్నారు కేంద్ర పర్యావరణ మంత్రి హర్ష వర్ధన్ మరోవైపు ఢిల్లీ ప్రజలు మాత్రం.. ఆరోగ్యపరమైన ఇబ్బందులతో ఇప్పటికే నానా అగచాట్లూ పడుతున్నారు. దేశ, విదేశీ అతిధులొచ్చే రాజధానిలో ఆరోగ్య ప్రమాణాలు ఇలా డేంజర్ బెల్స్ మోగిస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకుంటున్నాయి.

Next Story