ఒక్క ఆదిలాబాద్‌లోనే ఎందుకీ గులాబీ ముళ్లు!!

ఒక్క ఆదిలాబాద్‌లోనే ఎందుకీ గులాబీ ముళ్లు!!
x
Highlights

అధికార పార్టీ అభ్యర్థులకు, రెబెల్స్ దడ పుట్టిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలో,...

అధికార పార్టీ అభ్యర్థులకు, రెబెల్స్ దడ పుట్టిస్తున్నారు. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్‌ జిల్లాలో, గులాబీ పార్టీ అసమ్మతుల గోల అంతాఇంతా కాదు. కుమ్రంబీమ్ అసిఫాబాద్ సిర్పూర్‌.టి నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ వర్గ పోరు, తారాస్థాయికి చేరింది. తాజా మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఒకవర్గంగా, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య మరోవర్గంగా విడిపోయి కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే కోనప్పకు టికెట్ ఇవ్వడాన్ని, కావేటి సమ్మయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ఉద్యమం కాలం నుంచి, పనిచేసి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన తనకు, పార్టీలో గుర్తింపు ఇవ్వడంలేదని అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీఎస్పీ నుంచి వచ్చిన కోనప్పకు టికెట్ ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే సమ్మయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా, అభ్యర్థికి టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ, పార్టీ అభ్యర్థి కోనప్పపై తిరుగుబాటు ప్రకటించారు కావేటి సమ్మయ్య. కోనప్పకు వ్యతిరేకంగా రెబల్‌గా, తానే ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పేశారు. ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. టిఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థిగా మద్దతు ఇవ్వాలని విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు సమ్మయ్య. సమ్మయ్య రెండుసార్లు సిర్పూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దాంతో ప్రజల్లో ఉన్న పలుకుబడితో గ్రామాల్లోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పనిచేసిన నాయకులంతా సమ్మయ్యకు మద్దతు ఇస్తున్నారు. ఇది టిఆర్‌ఎస్‌కు స్థానికంగా ఇబ్బంది కలిగించే పరిణామంగా కొందరు చెబుతున్నారు. పైగా కోనప్ప వ్యతిరేకులను సమ్మయ్య ఏకం చేస్తున్నారు. ప్రజల్లో బలం లేని, స్థానికేతరుడైనా నాయకున్ని ఓడించాలని రెబల్ అభ్యర్థిగా కోరుతున్నారు.సమ్మయ్య పోటి చేయాలని నిర్ణయించడంతో గులాబీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. నిజంగా పోటీ చేస్తే, పార్టీ అభ్యర్థి కోనప్ప, సమ్మయ్య మద్య ఓట్లు చీలి, కాంగ్రెస్‌కి అంతిమంగా ప్రయోజనం కలుగుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ఇప్పటికే కోనప్ప తీరును నిరసిస్తూ ఏడుగురు కౌన్సిలర్లు టిఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మరికొంత మంది అదే బాటలో ప్రయాణించేందుకు సిద్దంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టిఆర్ఎస్‌కు తిరుగుబాటు బెడద ఉన్న మరో నియోజకవర్గం మంచిర్యాల. ఈ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ టికెట్ కోసం, ఎంపిపి బేర సత్యనారయణ తీవ్రంగా ప్రయత్నించారు. కాని పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావుకు టికెట్ కేటాయించింది టీఆర్ఎస్ అధిష్టానం. దివాకర్ రావుకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలోకి దిగారు సత్యనారాయణ. పార్టీకి రాజీనామా చేసి బిఎస్పీ అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయడానికి ప్రచారం చేస్తున్నారు. సత్యనారాయణ పేరుక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. నియోజకర్గంలో ఆ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు, అరవై వేలకు పైగా ఉన్నాయి. దాంతో ఆ ఓట్లు, పార్టీకి పడేపరిస్థితులు కనిపించడంలేదని విశ్లేషకులంటున్నారు. అదేవిధంగా బిసీ నాయకునిగా మిగతా వర్గాల మద్దతు కూడగడుతున్నారు. అదేవిధంగా టిఆర్‌ఎస్ పార్టీలో, అసమ్మతి నాయకులు సత్యనారాయణకు మద్దతు పలుకుతున్నారు. ఈ పరిణామాలు టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావుకి రుచించడం లేదు. టీఆర్‌ఎస్‌లో అసమ్మతి, అసంతృప్తి తగ్గుముఖం పట్టిందని, అగ్రనాయకత్వం చెబుతుంటే, ఆదిలాబాద్‌ లాంటి జిల్లాల్లో మాత్రం, ఆ పార్టీ తిరుగుబాటు నేతలు, అధికార అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు రంగంలోకి, రెబల్ అభ్యర్థులతో మాట్లాడి, పరిస్థితులను చక్కదిద్దాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories