Top
logo

శ్రీవారి నిధుల్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తున్న టీటీడీ

Highlights

తిరుమల శ్రీవారి నిధులను తమ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తుంది టీటీడీ. నిధులు ఉన్నాయిగా అనీ అవసరం ఉన్నా...

తిరుమల శ్రీవారి నిధులను తమ ఇష్టం వచ్చినట్టు ఖర్చుచేస్తుంది టీటీడీ. నిధులు ఉన్నాయిగా అనీ అవసరం ఉన్నా లేకపోయినా... నిర్మాణాలు చేపట్టడం తర్వాత వాటిని వదిలేయడంతో వెంకన్న ఖజానాకి భారీగా గండి పడుతుంది. ఇటీవల కాలంలో భక్తుల అవసరాలుకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించకుండానే ఆగమేఘాలపై ఇనుమ వంతెలను నిర్మించడం... తర్వాత వాటిని గాలికొదిలేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే పలు ఇనుప బ్రిడ్జిలు నిరుపయోగంగా మారిపోతే.. తాజాగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకంటూ 60 లక్షల రూపాయలు ఖర్చుచేసి ఓ వంతెనను నిర్మిస్తుంది టీటీడీ.
ఇప్పటికే తిరుమలలో ఇలాంటి నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల దేవాలంయం వద్ద భక్తులు రోడ్డుపైనే నడుస్తుంటారు. దీన్ని తప్పించాలన్న ఉద్దేశంతో గతంలో... అలిపిరి నడక మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి అక్కగార్ల దేవాలయం వరకు అన్నమయ్యా మార్గం పేరుతో దాదాపు 5 కోట్ల రూపాయలతో ఓ భారీ ఇనుప వంతెన ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ మార్గం వల్ల టీటీడీ అనుకున్న ఫలితం రాలేదు. ఇంత నిధులు ఖర్చు చేసినా భక్తుల రోడ్డుపై నుంచి మాత్రం నడవడాన్ని ఎక్కువగా తగ్గించలేకపోయింది.
దీంతో గత మూడేళ్లుగా వంతెన ఖాళీగానే ఉంటుంది. గతంలో పాత అన్నదాన సత్రం నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌ వరకు ఓ ఇనుప వంతెన నిర్మించారు. ఈ వంతెనను భక్తులు ఉపయోగంచుకునేలా టీటీడీ చేయలేకపోయింది. ఇక సప్తగిరి కార్ పార్కింగ్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లేందుకు మరో ఇనుప వంతెనను నిర్మించారు. ఈ వంతెన పరిస్థితీ అంతే. సప్తగిరి అతిథి గృహం నుంచి వచ్చే భక్తులు కుడి వైపున ఉన్న పోలీసు కాంప్లెక్స్‌ వైపు గానీ... ఎడమ వైపు ఉన్న లేపాక్షి సర్కిల్ నుంచి గానీ వెళ్లడానికే మొగ్గు చూపుతున్నారు గానీ ఈ వంతెనను వాడట్లేదు. ప్రస్తుతం ఈ వంతెన అనధికారిక హాకర్లకు, కోతులకు ఆవాసంగా మారుతుంది.
గతంతో ఆదికేశువులనాయుడు టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లను ప్రారంభించారు. భక్తుల రద్దీతో సంబంధం లేకుండా రెండు గంటల్లోనే శ్రీఘ్రదర్శనం కల్పించే ఉద్దేశంతో ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం పెద్ద ఎత్తున క్యూలైన్లలో మార్పు చేర్పులు చేశారు. ఇలా శ్రీఘ్రదర్శనానికి పెద్ద ఎత్తున భక్తుల నుంచి స్పందన రావడంతో మామాలు రోజుల్లో కూడా శ్రీఘ్రదర్శనం కోసం భక్తులు బారులు తీరేవారు. దీంతో లేపాక్షీ సర్కిల్ నుంచి ఏటీసీ కార్ పార్కింగ్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర భారీ ఇనుప క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్‌కు అనుసంధానిస్తూ ప్రెస్ క్లబ్ సర్కిల్ వద్ద... ఏటీసీ ఎంక్వయిరీ ఆఫీసు వద్ద రెండు భారీ ఇనుప బ్రిడ్జిలను నిర్మించారు.
టీటీడీ ఈఓగా సాంబశివరావు ఉన్నప్పుడు ఏటీసీ కార్ పార్కింగ్ వద్ద శ్రీఘ్రధర్శనం భక్తులకు ప్రత్యేకే కాంప్లెక్స్ నిర్మించారు. దీంతో ప్రస్తుతం లేపాక్షి నుంచి ఏటీసీ కార్ పార్కింగ్ వరకు ఉన్న క్యూలైన్ అస్సలు ఉపయోగించడంలేదు. దీంతో నాడు ఈ క్యూలైన్ నిర్మాణంపై పెట్టిన నిధులన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయ్.
ఇప్పటికే కోట్ల రూపాయలతో నిర్మించిన ఇనుప బ్రిడ్జీలన్నీ నిరుపయోగంగా ఉంటున్నా... టీటీడీ మాత్రం ఏడాదికో బ్రిడ్జీ కట్టుకుంటూపోతుంది. తాజాగా ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకి 60 లక్షల రూపాయలతో వీఐపీల కోసం ఓ భారీ ఇనుప వంతెనను టీటీడీ నిర్మిస్తుండటంపై భక్తులు భగ్గుమంటున్నారు.
ఇప్పటికే సప్తగిరి నుంచి షాపింగ్ కాంప్లెక్స్ వరకు నిర్మించిన ఇనుప వంతెనను ఉపయోగించడం లేదు. సరిగ్గా ఈ వంతెనకు 300 మీటర్ల దూరంలోనే మరో బ్రిడ్జిని ఆగమేఘాలపై నిర్మిస్తున్నారు. దీన్ని బ్రహ్మోత్సవాలలోపు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని చూస్తుంది టీటీడీ. ఈ వంతెన వల్ల పెద్దగా ఉపయోగం కనింపించడంలేదు. ఒక్క గరుడ సేవ రోజు కోసం రెండు గంటల ఉపయోగం కోసం 60 లక్షల రూపాయలను ఖర్చు చేస్తుంది టీటీడీ.
టీటీడీ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. గత ఏడాది బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవరోజున టీటీడీ ఉద్యోగులతో పాటు... పోలీసులు... వీఐపీలను ఆస్ధాన మండపం నుంచి ప్రత్యేక పాసుల ద్వారా శ్రీవారి ఆలయం ముందున్న వాహనమండపం గ్యాలరీలకు పంపింది టీటీడీ. గత ఏడాది సామాన్య భక్తులతో పాటు వీఐపీ పాసులు ఉన్న వారు చాలా ఇబ్బంది పడ్డారు. రోడ్డపైనే పెద్దఎత్తున భక్తులు నిలబడిపోయారు. దీంతో ఇటు వైపునే వెళ్లాల్సిన వీవీఐపీలు తమ వాహనాలను అక్కడే వదిలి రామ్‌బగీచా ముందు నుంచి 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్లారు. ఈసారి ఆ పరిస్థితి రాకుండా జనసంచారం లేకుండానే వీవీఐపీలకు అనువుగా మార్చాలని చూస్తుంది. దీనికోసం రాంబగీచాకన్నా ముందుగానే 60 లక్షలతో నూతన వంతెనను టీటీడీ నిర్మిస్తుంది.
ఈ నూతన వంతెన ద్వారా పోలీసులు... టీటీడీ ఉద్యోగులు.... వీఐపీ పాసులు ఉన్న భక్తులకు అనుమతించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో అన్ని రోజులూ ఈ వంతెనను ఉపయోగించే అవసరం రాదు. ఒక్క గరుడోత్సవం రోజు మాత్రమే ఈ నూతన వంతెన అవసరం ఉంటుంది. ఈ రెండు గంటల కోసం... వీవీఐపీలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం 60 లక్షలలో వంతెనను నిర్మిస్తుంది టీటీడీ.

Next Story