logo
సినిమా

ఆటగదరా శివా మూవీ రివ్యూ

ఆటగదరా శివా మూవీ రివ్యూ
X
Highlights

మనం చేసిన తప్పు తెలుసుకోవాలంటే శిక్షకు మించిన మార్గం లేదు. ఆ భీతి లేకపోవడం వల్లే సంఘంలో ఇన్ని అరాచకాలు...

మనం చేసిన తప్పు తెలుసుకోవాలంటే శిక్షకు మించిన మార్గం లేదు. ఆ భీతి లేకపోవడం వల్లే సంఘంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఆపే వ్యవస్థ బలహీనంగా ఉండటంతో నేర ప్రవృత్తి అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఉరిశిక్ష దీనికి పరిష్కారంగా భావించినా దాని అమలులో ఉన్న ఇబ్బందులు, అడ్డంకులు, లోపాలు ఇవన్నీ ఒక నిర్లిప్తతను సృష్టించాయి. ఈ కోణంలో గతంలో అభిలాష అనే చిరంజీవి సినిమా ఒకటి వచ్చింది కానీ అది పూర్తిగా కమర్షియల్ కోణంలో కాస్త సహజత్వానికి దూరంగా తీసింది. అందులో కథకు సంబంధించిన ఆత్మ కన్నా ఫిక్షన్ ఎక్కువగా ఉంటుంది. కానీ దర్శకుడు చంద్రసిద్దార్థ ఆ దారిలో వెళ్లకుండా ఎమోషన్స్ ని ఆధారంగా చేసుకుని పశ్చత్తాపం అనే చిన్న తీగ మీద అల్లుకున్న కథే ఆటగదరా శివా. ఆ నలుగురుతోనే తనలో మంచి క్రియేటర్ ని టాలీవుడ్ కు పరిచయం చేసిన చంద్ర సిద్దార్థ చాలా కాలం తర్వాత తనకు మాత్రమే సాధ్యమయ్యే టేకింగ్ తో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. స్టార్లు అంచనాలు ఇవేవి లేకుండా చేసిన ప్రయత్నంగా ప్రత్యేకమైన ఆసక్తి రేపిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం

కథ : బాబ్జి(ఉదయ్ శంకర్)ఉరిశిక్ష పడ్డ ఖైదీ. తేదీ దగ్గరకు వస్తుండటంతో ఎక్కడైనా దూరంగా పారిపోయి బ్రతకాలని తప్పించుకుంటాడు. ఆ క్రమంలో చేసే ప్రయాణంలో ఉరి శిక్షను అమలు పరచడం కోసం జీపులో బయలుదేరిన తలారి జంగయ్య(దొడ్డన్న) పరిచయమవుతాడు. బాబ్జీ గురించి తెలుసుకున్నాక అతనికి తెలియకుండానే జైలుకు తీసుకెళ్లే పనిలో పడతాడు జంగయ్య. మరోవైపు ఆది(హైపర్ ఆది)లేచిపోయిన తన ప్రియురాలితో కలిసి జంగయ్యనే లిఫ్ట్ అడుగుతాడు. జంగయ్యతోనే ఉంటూ బాబ్జీని పట్టిస్తే వచ్చే 10 లక్షల నగదు బహుమతి కోసం స్కెచ్ వేస్తాడు ఆది. ఈ ప్రయాణంలో ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగింది, బాబ్జీ తన చుట్టూ ఉన్న వలయాన్ని కనుకున్నాడా లేక జంగయ్య డ్యూటీ కోసం బాబ్జీని పట్టించాడా అనేది ఇక్కడ చెప్పడం భావ్యం కాదు

నటీనటులు : ఉదయ్ శంకర్ డెబ్యూ మూవీగా ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే. ఆఫ్ బీట్ తరహాలో అనిపించే బాబ్జీ లాంటి క్యారెక్టర్ చేయటం అంటే అంత ఈజీ కాదు. కరుడుగట్టిన తనాన్ని చూపిస్తూనే అవసరానికి మించిన ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వకుండా చాలా సెటిల్డ్ గా చేస్తూ అతనిలో నటుడిని మాత్రమే మనకు కనిపించేలా చేసాడు. ఆ పాత్రకు తగిన ఆహార్యాన్ని, పంచ్ అనిపించేలా ఉండే డైలాగ్ డెలివరీని బాగా ఇచ్చాడు. హావభావాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న బాబ్జీగా ఉదయ్ శంకర్ కు సరైన అవకాశాలు రావాలే కానీ సెటిల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. చాలా రఫ్ గా నిజంగానే పారిపోయిన ఖైదీలా తనను తాను ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్న తీరు మెప్పిస్తుంది.

మనకు కోట శ్రీనివాసరావు లాగా కన్నడలో దొడ్డన్న గొప్ప నటుడు. నాలుగు దశాబ్దాలుగా శాండల్ వుడ్ ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన అనుభవం బాషతో సంబంధం లేకుండా ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఇంత వయసు వచ్చినా మొహంలో నీరసం కనిపించకుండా భారీ శరీరంతో ఆయన చూపించే హావభావాలు చూస్తే ఫిదా కావలసిందే. మానసిక సంఘర్షణను మొహంలో పలికించిన తీరుకి అవార్డులు ఇచ్చినా తక్కువే. హైపర్ ఆది తనదైన కామెడీ టైమింగ్ తో పంచులతో బాగానే మెప్పించాడు. చమ్మక్ చంద్ర, చంటిలతో పాటు చిన్నా చితకా ఆర్టిస్టులు ఉన్నారు కానీ ప్రభావం చూపించేది ఆ ఇద్దరే కాబట్టి బయటికి వచ్చాక కూడా మనతో పాటు పక్కనే జంగయ్య, బాబ్జీ నడుస్తున్నట్టు అనిపిస్తుంది

సాంకేతిక వర్గం
దర్శకుడు చంద్రసిద్దార్థ్ తన బలమేంటో ఆ నలుగురుతోనే నిరూపించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ స్థాయి ఎమోషన్స్ ఉన్న మరో సినిమాను కారణాలు ఏవైనా మళ్ళి తీయలేకపోయాడు. ఆ లోటుని పూర్తిగా కాదు కానీ దాదాపుగా ఆటగాదరా శివ పూర్తి చేసింది. పేపర్ మీద చాలా సింపుల్ గా అనిపించే ఈ కథ విజయం ప్రెజెంట్ చేయటం మీద ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని మర్చిపోని చంద్రసిద్దార్థ్ అందుకు తగ్గట్టే బిగుతైన స్క్రీన్ ప్లే తో ఎంటర్ టైన్మెంట్ ని జోడించి సీరియస్ సబ్జెక్ట్ ని నడిపించాడు. హడావిడిగా సందేశాలు ఇచ్చే పని చేయకుండా చెప్పాలనుకున్న పాయింట్ ని సూటిగా చెప్పే క్రమంలో కొంత తడబడినప్పటికీ అది అంతగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం కాదు. సున్నితమైన భావోద్వేగాలను స్పృశిస్తూనే మానవత్వం-వృత్తి నిర్దేశించిన కర్తవ్యం మధ్య నలిగిపోయే పాత్రలో జంగయ్యను తీర్చిదిద్దిన తీరు నిజంగా అద్భుతం. ఇందులో ప్రత్యేకించి సందేశం ఏది ఇవ్వలేకపోయినా ప్రేక్షకుడిని ఆలోచింపజేసేలా ఒక సామాజిక కోణాన్ని ఆవిష్కరించిన తీరు ఇది రీమేక్ అన్న సంగతి కూడా మర్చిపోయేలా చేస్తుంది. గొప్పదనం కథలోనే ఉంది.

లవిత్ కెమెరా పనితనం చాలా సహజంగా ఉండాల్సిన వాతావరణాన్ని చక్కగా ఆవిష్కరించింది. అరచేతిలో టెక్నాలజీని పెట్టుకుని ఉరుకుల పరుగుల మధ్య నగర జీవితంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సగటు జీవిని మనకు తెలియని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే దర్శకుడి ఆలోచనని లవిత్ చూపించిన తీరు బాగుంది. తన పనితనం చూపాలన్న ఆత్రం కన్నా కథను నిజాయితీగా ప్రేక్షకుడికి తెలియజెప్పాలి అనే ఆలోచన ఉంది కాబట్టే ఎక్కడ అసహజత్వం కనిపించదు. నోబిన్ పౌల్ నేపధ్య సంగీతం బాగుంది. కథకు తగ్గ మూడ్ తో ఎక్కడా ఓవర్ ఎక్స్ పోజర్ కాకుండా జాగ్రత్త తీసుకుని తనవరకు పూర్తిగా న్యాయం చేసే ప్రయత్నం చేసాడు. వాసుకి వైభవ్ సౌండ్ ట్రాక్ ఇబ్బందిగా అనిపించకుండా బాగా సింక్ అయ్యేలా ఉంది. నవీన్ నూలి ఎడిటింగ్ షార్ప్ గా ఉండటమే కాదు ల్యాగ్ అవుతుందే అనే ఫీలింగ్ రాకుండా చేయటంలో బాగానే సక్సెస్ అయ్యింది. బడ్జెట్ డిమాండ్ చేసే కథ కాదు కాబట్టి దానికి తగ్గట్టు ఖర్చు పెట్టారు కానీ క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడలేదు

పాజిటివ్ పాయింట్స్

స్క్రీన్ ప్లే, డైలాగ్స్
దొడ్డన్న, బాబ్జీ
నేపధ్య సంగీతం

నెగటివ్ పాయింట్స్

అందరికి కనెక్ట్ అయ్యే అవకాశం లేకపోవడం
కొంచెం సాగదీసిన కామెడీ సీన్లు

చివరి మాట
వసూళ్లే కొలమానంగా సక్సెస్ ని కొలిచే బాక్స్ ఆఫీస్ లెక్కలకు ఎదురీదుతూ కొన్ని సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటిదే ఆటగదరా శివా. వీటికి కలెక్షన్స్ కంటే ఎక్కువ ప్రేక్షకుల ప్రతిస్పందనలు అండదండగా ఉంటాయి. ఆ రకంగా ఆటకదారా శివా ఏ రకంగానూ నిరాశ పరచదు. ఎందుకో అర్థం కానీ ఒక బరువైన ఎమోషన్ వెంటాడుతూ ఉండగా కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మస్తిష్కంతో పోరాటం చేసేలా ప్రేరేపించే ఇలాంటి సినిమాలు ప్రతిసారి రావు కాబట్టి మిస్ కాకుండా చూడటం అవసరమే. చావు బ్రతుకు మధ్య శివుడు ఆడించిన ఆటలో మనం పావులమే తప్ప మనం కోరుకున్నవన్నీ జరగవు అనే సందేశాన్ని అంతర్లీనంగా చెబుతూ చంద్రసిద్దార్థ్ చేసిన ఓ చక్కని ప్రయత్నం ఆటగదరా శివా.

పంచ్ లైన్ : మెప్పించావురా శివా

రేటింగ్ : 3.5 / 5

Next Story