పెథాయ్‌ తుపానుతో రైతన్న విల విల

పెథాయ్‌ తుపానుతో రైతన్న విల విల
x
Highlights

పెథాయ్ రైతన్నలను నిండా ముంచింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీటిపాలైంది. అరటి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు...

పెథాయ్ రైతన్నలను నిండా ముంచింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీటిపాలైంది. అరటి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలు నాశనం అయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. పెథాయ్‌ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. చివరి దశలో ఉన్న పంటపై తుపాను విరుచుకుపడింది. కురుస్తోన్న వర్షాలకు వరిపంట పూర్తిగా నాశనమైంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు, పాలకొ్ల్లు, పెదపాడు, నరసాపురం, మొగల్తూరు, పెదవేగి, ఏలూరు గ్రామీణ మండలాల్లో పంట నీటమునిగింది. కోతకోసి పొలాల్లో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో వరిపంటకు నష్టం జరిగింది. రాకాసి తుపాను కారణంగా తీవ్రంగా నష్టోయామని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.35 వేలు నుంచి 40వేల వరకు తాము పెట్టుబడి పెట్టామని, ఆ డబ్బులు చేతికి వస్తాయో, రాదో అర్థంకావడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలో పెథాయ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట పొలాలు నష్టం వాటిల్లింది. వరి, అరటి, కొబ్బరి చెట్లు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్తిపాడు, రావెలపాలెంలో అరటి తోటలు దెబ్బతిన్నాయి. వరి పంటకు స్వల్పంగా నష్టం జరిగింది. పంటలు ఆలస్యంగా వేసిన వారి పంటలు నీట మునిగాయి. పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. పెథాయ్‌ ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న వర్షాల వల్ల ధాన్యం చాలా వరకు తడిసిపోయింది. తడిసిన బస్తాలను వేరే బస్తాల్లోకి మార్చి రవాణా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి.

గుంటూరు జిల్లాలో పెథాయ్ బీభత్సం సృష్టించింది. పంట పొలాలు నీట మునిగాయి. రేపల్లె , బాపట్ల, దమ్ములపాలెం, దిండి, నక్షత్ర నగరాలు, దాలవాయిగూడెం, నర్సరావు పేట, నకిరేకల్, రుతిచర్ల ప్రాంతాల్లో వరిపంట దెబ్బతింది. కోతల సమయంలో చేతికి వచ్చే పంట వర్షం పాలయింది. ప్రత్తిపాడు, సత్తెనపల్లి, మేడికొండూరు ప్రాంతాల్లో పత్తి పంట దెబ్బతింది. పెథాయ్‌తో కృష్ణా జిల్లాలో పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. తూర్పు కృష్ణాలోని కోసిన వరిపంటలు నీటమునిగాయి. రెండో పంటగా వేసిన మినుము మొలక దశలో ఉన్న పొలాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నూజివీడులో మొక్కజొన్న, పొగాకు, పత్తి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, జగ్గయ్యపేట, పెనుగ్రంచిప్రోలు, తిరువూరు తదితర చోట్ల పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టంవాటిల్లింది.విజయవాడ రూరల్ మండలం పి.నైనవరం గ్రామంలో గొర్రెల కాపరి ఇంట్లోచలికి తట్టుకోలేక 67 మేకలు మృతి చెందాయి. పెథాయ్ ప్రభావంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. తుపాను రైతులను కోలుకుండా దెబ్బతీసింది. పంట నష్టం చెల్లించాలని రైతన్నలు వేడుకుంటున్నారు. మరోవైపు పంట నష్టంపై అంచనా వేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఎన్ని ఎకరాల్లో , ఏఏ పంటలకు ఎంత మేర నష్టం జరిగిందని నివేదకలు తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories