Top
logo

స్కూల్ టైమింగ్స్‌ మార్చండి బాబోయ్.. కుమిలిపోతున్న భాగ్యనగర తల్లులు

స్కూల్ టైమింగ్స్‌ మార్చండి బాబోయ్.. కుమిలిపోతున్న భాగ్యనగర తల్లులు
X
Highlights

ఈ ఆధునిక యుగంలో మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన విధానం కూడా మారింది. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే విద్యా...

ఈ ఆధునిక యుగంలో మారుతున్న కాలంతో పాటు ప్రజల జీవన విధానం కూడా మారింది. అన్ని వ్యవస్థల్లో మాదిరిగానే విద్యా వ్యవస్థలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. అయితే చదువుల తల్లిని సిరుల కురిపించే లక్ష్మిగా మార్చుకుని విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ శక్తుల మూలాన విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు పాఠశాలకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వెళ్లేవారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ స్కూల్స్‌లో తరగతులు నిర్వహించేవారు. సాయంత్రం బడి గంట కొట్టగానే రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులు ఇంటికెళ్లేవారు. ఇంటికొచ్చి కాసేపు సరదాగా ఆడుకుని, ఆ తర్వాత ట్యూషన్స్‌కు వెళ్లేవారు. దాంతో వారికి విద్యతో పాటు మానసికోల్లాసం కూడా కలిగేది. ఎప్పుడూ హుషారుగా ఉండేవారు.

ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ పేరుతో ప్రతీచోట కనిపిస్తున్న ప్రైవేట్ స్కూల్స్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. ఉదయాన్నే తల్లిదండ్రులు పిల్లలను నిద్రలేపి.. ఏదో యుద్ధానికి వెళుతున్నట్టుగా సమాయత్తం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది. పట్టణాలు, నగరాల్లో చదువుకుంటున్న పిల్లల కష్టాలు వర్ణనాతీతం. వారికి కనీసం ప్రశాంతంగా టిఫిన్ చేసే సమయం కూడా దొరకడం లేదు. పోనీ పిల్లలకు టిఫిన్ తినిపించడానికి తల్లి ముద్ద నోట్లో పెడుతుంటే.. స్కూల్ బస్సు హారన్ మోత, ఆ తల్లి చెవిలో భగవద్గీతలా వినిపిస్తుంది. దీంతో ఆ తల్లి హడావుడిగా టిఫిన్ బాక్స్‌ను కట్టి.. పిల్లలను పరుగులు పెట్టించి.. తాను ఉరుకులు పెడుతూ బస్సు ఎక్కించేస్తుంది. ఈ హడావుడి వల్ల తల్లి చేతి ముద్ద తినే భాగ్యం కూడా ఆ పిల్లలకు ఉండటం లేదు. ఆ తల్లి ఉద్యోగస్తురాలైతే పర్వాలేదు కానీ గృహిణి అయితే మాత్రం ఆమెకు అదో ఉద్యోగం. తెల్లవారుజామునే లేవాలి. పిల్లలను లేపాలి. రెడీ చేసి ఉదయం 7 గంటల కల్లా బస్సు ఎక్కించి పంపించేయాలి. ఇన్ని చేసినా ఆ పిల్లల ముఖంలో ఆనందం కనిపించదు. ఏదో పోగొట్టుకున్నట్టుగా ఎప్పుడూ ముభావంగా ఉంటారు. తప్పు పిల్లలది కాదు. ఆ బండెడు పుస్తకాలను మోయిస్తున్న విద్యా సంస్థలది. అలాంటి విద్యా వ్యవస్థలో చదివిస్తున్న తల్లిదండ్రులది. ఈ పరిస్థితి మారాలని భాగ్యనగరంలోని మెజార్టీ తల్లులు అభిప్రాయపడుతున్నారు. నగరంలోని ఓ ప్రముఖ స్కూల్లో చదివిస్తున్న ఓ తల్లి తన పరిస్థితిని వివరించింది.

‘‘ఉదయాన్నే 8 గంటలకు స్కూల్ ప్రారంభమవుతుంది. అంటే, 07.15 అయ్యేటప్పటికీ ఇంటి దగ్గర్నుంచి బయల్దేరాలి. కనీసం 6.45 నిమిషాలకు బ్రేక్‌ఫాస్ట్ పూర్తి కావాలి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చాలామంది పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేయకుండానే స్కూల్‌కెళుతున్నారు. స్కూల్ క్యాంటీన్‌లో దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడుతున్నారు. అందువల్ల ఉదయం 9 గంటలకు నగరంలోని పాఠశాలలను ప్రారంభించాలి. ఇదీ పిల్లల చదువుల విషయంలో చాలామంది తల్లుల అభిప్రాయం.

నగరానికి చెందిన పీడియాట్రీషియన్ మాత్రం వారి వాదన సమర్థనీయం కాదంటున్నారు. అమెరికా వంటి దేశాల్లో స్కూల్స్ ఉదయం 7గంటల కల్లా మొదలవుతాయని.. రాత్రి 8గంటల సమయానికి పిల్లలు నిద్రకు ఉపక్రమిస్తారని చెప్పారు. మన దేశంలో.. పిల్లలు రాత్రి భోజనం తర్వాత తల్లిదండ్రులతో కలిసి టీవీ చూస్తూ గడిపేస్తారని, ఉదయాన్నే అలసటగా నిద్ర లేస్తారని చెబుతున్నారు. అయితే ఉదయాన్నే తరగతులు నిర్వహిస్తున్న స్కూల్స్ కూడా బ్రేక్‌ఫాస్ట్ విరామం ఇవ్వాలని ఆయన సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే, హైద్రాబాద్‌లోని స్కూల్ యాజమాన్యాలు మాత్రం ఉదయం 07.00 గంటల కల్లా తరగతులు మొదలుపెట్టడాన్ని సమర్థించుకుంటున్నాయి. సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో బ్రేక్‌ఫాస్ట్ సౌకర్యం అందుబాటులో ఉందని, ట్రాఫిక్ వల్ల ఉదయాన్నే స్కూల్స్ ప్రారంభిస్తున్నామే తప్ప పిల్లలను, వారి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. విద్యా వ్యవస్థలో గణనీయ మార్పులు జరిగితే తప్ప తల్లులు ఆశ నెరవేరదనేది జగమెరిగిన సత్యం.


Next Story